Yadadri Temple: ఈ నెల 18న యాదాద్రికి ముగ్గురు సీఎంలు, కేసీఆర్‌తో పాటు ఇద్దరు సీఎంలు ఎవరంటే
ఈ నెల 18న యాదాద్రికి ముగ్గురు ముఖ్య మంత్రులు రానున్నారు. బేగంపేట ఎయిర్ పోర్ట్ నుండి యాదాద్రికి ఢిల్లీ, కేరళ, తెలంగాణ సీఎంలు 11.30 గంటలకు యాదాద్రికి చేరుకుంటారు.
3 CMs will visit Yadadri On 18 January: ఈ నెల 18న యాదాద్రికి ముగ్గురు ముఖ్య మంత్రులు రానున్నారు. ఆరోజు ఉదయం 11 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్ట్ నుండి యాదాద్రికి ముఖ్యమంత్రులు బయల్దేరనున్నారు. 2 ప్రత్యేక హెలిక్యాప్టర్లలో యాదాద్రి కి కేసీఆర్, కేజ్రీవాల్, పినరయి విజయన్ చేరుకోనున్నారు. బేగంపేట నుంచి బయలుదేరిన ఢిల్లీ, కేరళ, తెలంగాణ సీఎంలు 11.30 గంటలకు యాదాద్రికి చేరుకుంటారు. ముగ్గురు సీఎంలు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారని అధికారులు తెలిపారు.
యాదాద్రి నరసింహుడిని దర్శించుకున్న అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు యాదాద్రి నుంచి సీఎంలు కేసీఆర్, కేజ్రీవాల్, పినరయి విజయ్‌లు ఖమ్మం బయలుదేరతారు. కంటి వెలుగు రెండో దఫా ప్రారంభోత్సవంలో ముగ్గురు ముఖ్యమంత్రులు పాల్గొంటారు. మధ్యాహ్నం 3.30 గంటలకు ఖమ్మం పబ్లిక్ మీటింగ్ లో ఈ నేతలు పాల్గొననున్నారు. కేజ్రీవాల్, విజయన్ సాయంత్రం 4 గంటలకు ఖమ్మం నుంచి విజయవాడ వెళ్లిపోనున్నారు.
డిసెంబర్ 16వ తేదీ నుంచి ధనుర్మాస ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. జనవరి 14వ తేదీన రాత్రి 7 గంటలకు గోదాదేవి కల్యాణం, మర్నాడు అంటే జనవరి 15వ తేదీన ఉదయం 11.30 గంటలకు ఒడి బియ్యం సమర్పణతో ఈ ఉత్సవాలు ముగిశాయని ఆలయ ఈఓ గీత తెలిపారు. భక్తులంతా ఈ ఉత్సవాల్లో పాల్గొని తరించారని చెప్పారు. తెలంగాణ ప్రజల ఇలవేల్పు, ఇష్టదైవం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆయం యాదాద్రిని రాష్ట్ర ప్రభుత్వం వందల కోట్లతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది. యాదాద్రి కొండ దిగువన కూడా యాదగిరిగుట్ట పట్టణంలో సుందరీకరణ పనులు చేసింది. కనుక సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకోవడానికి వస్తున్నారు. ఈ ధనుర్మాసంలో స్వామి వారి చెంత ఉన్న కొలువైన అమ్మవారిని దర్శించుకోవడం చాలా శుభప్రదం. పునర్ నిర్మితమైన పంచనారసింహుల దివ్యాలయంలో ధనుర్మాస ఉత్సవాలు నిర్వహించడం ఇదే తొలిసారి.
బీఆర్ఎస్ ఈ నెల 18 న ఖమ్మంలో నిర్వహించనున్న సభ చారిత్రక సభ అని దేశ రాజకీయాలను మలుపు తిప్పే సభ అని తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. వంద ఎకరాల్లో బహిరంగ సభ జరుగుతుందని, పార్కింగ్ 448 ఎకరాల్లో 20 పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశామని తెలిపారు. వెయ్యి మంది వాలంటీర్లు సభలో అందుబాటులో ఉంటారని, నియోజక వర్గాల వారీగా ఇన్ ఛార్జిలను నియమించి జన సమీకరణ చేస్తున్నాం అని చెప్పారు.
సభకు వాహనాలు దొరకడం లేదు..
ఖమ్మంలో నిర్వహించనున్న ఈ సభకు 13 నియోజకవర్గాల నుంచి ఎక్కువ జన సమీకరణ చేస్తున్నాం. ప్రజల నుంచి స్పందన వస్తోందని, సభకు వాహనాలు దొరకడం లేదు అని మంత్రి హరీష్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పక్క రాష్ట్రాల నుంచి బస్సులు, వాహనాలు సమకూరుస్తున్నాము. ముఖ్య అతిథులతో పాటు ఖమ్మం జిల్లా ప్రజా ప్రతినిధులు, నేతలు వేదికపై ఉంటారని వెల్లడించారు. మంగళవారం రాత్రికి ముఖ్య మంత్రులు, జాతీయ నేతలు హైదరాబాద్ చేరుకోనున్నారు. జనవరి 18వ తేదీన ఉదయం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో ముగ్గురు ముఖ్య మంత్రులు, జాతీయ నేతలు చర్చలు జరుపుతారు.