Water Falls Near Hyderabad: హైదరాబాద్‌కు దగ్గర్లోనే అందమైన వాటర్ ఫాల్స్, పొద్దున్నే వెళ్తే సాయంత్రానికి వచ్చేయొచ్చు!
Water Falls: ప్రకృతి ఒడిలో సేదతీరాలనుకుంటున్న వారికి అద్భుత అవకాశం. వర్షాలకు పొంగిపొర్లుతున్న జలపాతాలు, హైదరాబాద్‌కు సమీపంలోనే కనువిందు చేస్తున్నాయి.
Water Falls near Hyderabad: చుట్టూ పచ్చని కొండలు...అంతెంతు నుంచి కిందకు జాలువారుతున్న జలపాతాలు (Water Falls), వాటి నుంచి వచ్చే లేలేత తుంపర్లు, చల్లని గాలులు...అబ్బ చెబుతుంటేనే మనసు ఎటో వెళ్లిపోతుంది కదా..మరి ప్రత్యక్షంగా చూస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. కానీ ఇవన్నీ చూడాలంటే ఏ కేరళనో లేక కర్ణాటక, తమిళనాడు వరకు వెళ్లాల్సి వస్తుందనుకుంటున్నారా..? అక్కర్లేదండీ మన హైదరబాద్(Hyderabad) చుట్టు పక్కలే బోలెడన్నీ వాటర్‌ఫాల్స్ ఉన్నాయి. పొద్దున వెళితే సాయంత్రానికి తిరిగి వచ్చేయొచ్చు. అవేంటో ఒకసారి చూద్దాం పదండి..
హైదరాబాద్‌కు చేరువలోనే...
హైదరాబాద్‌లో అడుగు బయటపెట్టామంటే వాహనాలు సౌండ్లు, ట్రాఫిక్ ఇక్కట్లతో పిచ్చెక్కిపోతుంది. కొందరికి పచ్చిన చెట్లను చూసి కూడా ఎన్నో ఏళ్లు అవుతుంటుంది. ఈ బిజిబిజి లైఫ్ నుంచి కాస్త దూరంగా పారిపోయి ఏ ప్రకృతి ఒడిలోనో సేదతీరాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఏ జలపాతాన్నో చూస్తూ మైమరిచిపోదామని కలల కంటుంటారు. కానీ ఎక్కడికి వెళ్తాం...ఇప్పటికిప్పుుడు అనుకుంటే కుదిరేపని కాదులే అనుకుంటారు. మనసు ఉంటే మార్గం ఉంటుందంటారు. ఎందుకంటే మన హైదరాబాద్(Hyderabad) చుట్టుపక్కలే అలాంటి ప్రదేశాలో బోలెడు ఉన్నాయి. ఉదయం వెళ్తే సాయంత్రానికి తిరిగి వచ్చేయవచ్చు.
ఎత్తిపోతల
హైదరాబాద్‌కు సమీపంలోనే ఉన్న అందమైన ప్రదేశం ఎత్తిపోతల(Eathipothala) వాటర్‌ఫాల్స్.. హైదరాబాద్ నుంచి నాగార్జునసాగర్ వెళ్లగానే అవతలి ఒడ్డునే ఉంటుంది ఈ అందమైన జలపాతం. దాదాపు 70 అడుగుల ఎత్తు నుంచి నీరు కిందపడుతుంటే చూడటానికి ఎంతో అందగా ఉంటుంది. నాగార్జన్‌సాగర్(Nagarjunasagar) వెనక జలాల నుంచి మొదలయ్యే నక్కవాగు, తుమ్మలవాగు, చంద్రవంక వాగులు మూడ ఇక్కడ కలిసి ఎత్తైన కొండల మీదుగా కిందకు పడుతుంటాయి.ఇంకా ఇక్కడ మరోక విశేషం ఉంది. అది ఏంటంటే ఇక్కడ జాతీయ మొసళ్ల పెంపకం కేంద్రం కూడా ఉంది. కాస్త ధైర్యం చేసి కిందకు దిగారంటే వాటిని కూడా ఏంచక్కా చూడొచ్చు. సమీపంలోనే రంగనాథస్వామి,దత్తాత్రేయస్వామి ఆలయాలు కూడా ఉన్నాయి.హైదరాబాద్ నుంచి 165 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ జలపాతం
మల్లెల తీర్థం జలపాతం
నాగర్‌కర్నూలు జిల్లాలోని దట్టమైన నల్లమల అటవీప్రాంతంలో ఉన్న మల్లెలతీర్థం(Mallela Theertham) జలపాతం చూడడానికి రెండు కళ్లు చాలవంటే నమ్మండి. కృష్ణానది పాయ నుంచి విడివడి ఎత్తైన కొండల మీదుగా కిందకు పడుతున్న ఈ అందమైన ప్రదేశాన్ని తిలకించాలంటే మాత్రం...సుమారు 400 మెట్లు కిందకు దిగాల్సిందే. ముఖ్యంగా యువతీ,యువకులకు ఇది ఎంతో నచ్చుతుంది. చుట్టూ పచ్చని చెట్లు, మధ్యలో జలపాతం అహా ఇది కదా మజా అంటే అన్నట్లు ఉంటుంది. ఇక్కడి చేరుకునే మార్గం కూడా పూర్తిగా నల్లమల అడవుల్లో నుంచే ఉంటుంది కాబట్టి ప్రకృతి ప్రియులు తప్పనిసరిగా చూడాల్సిన ప్రాంతం. ఆధ్యాత్మికంగానూ ఈ తీర్థం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఏటా ఇక్కడ ఉత్సవాలు కూడా జరుగుతాయి. హైదరాబాద్ నుంచి 185 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ జలపాతం.
భీమునిపాదం జలపాతం
హైదరాబాద్‌కు సమీపంలోనే ఉన్న మరో అందమైన జలపాతం భీమునిపాదం(Bheemuni Paadam) జలపాతం. మహబూబాబాద్ జిల్లా ఉన్న ఈ జలపాతం తెల్లని నురగలు కక్కుతూ 70 అడుగులు ఎత్తు నుంచి కిందకు పడుతుంటుంది. భారతంలోని భీముని పాదముద్రతోనే ఈ జలపాతం ఏర్పడిందని ప్రతీతి. చూడడానికి కూడా ఇది రాతిపాదం మీద నుంచి కిందకి పడుతున్నట్లు కనిపిస్తుంది. హైదరాబాద్ నుంచి సుమారు 195 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
పోచమ్మ జలపాతం
హైదరాబాద్‌కు సమీపంలోనే మరో చూడదగ్గ జలపాతం పోచమ్మ(Pochamma) జలపాతం. నిర్మల్(Nirmal) సమీపంలో ఉన్న ఈ పోచమ్మ జలపాతం మంచి విశ్రాంతి విడిది కేంద్రం. చుట్టూ ప్రకృతి రమణీయత, పక్షుల కిలకిలరావాలతో మనల్ని మనం మర్చిపోవచ్చు. కడెం నదిపై ఉన్న ఈ జలపాతం వద్ద నీరు 40 అడుగుల ఎత్తు నుంచి దిగువకు దూకుతుంది. అయితే ఈ జలపాతం అత్యంత ప్రమాదకరమైనది. ఎందుకంటే తెలంగాణలో ఉన్న అత్యంత లోతైన జలపాతం కూడా ఇదే.ఇక్కడ నీళ్లల్లోకి దిగడం అత్యంత ప్రమాదకరం. ఆదిలాబాద్(Adhilabad) రైల్వేస్టేషన్‌కు కూడా దగ్గరలోనే ఉంటుంది. హైదరాబాద్ నుంచి నేరుగా కారులోనైనా వెళ్లొచ్చు. లేదా రైలులో అయినా ఇక్కడికి చేరుకోవచ్చు.
కుంతాల జలపాతం
తెలంగాణలో ఉన్న అత్యంత ఎత్తైన జలపాతం కుంతాల(Kuntala). ఆదిలాబాద్ జిల్లాలో కడెం నదిపై ఉన్న ఈ జలపాతం చూపరులను ఎంతో ఆకట్టుకుంటుంది. దాదాపు రెండువందల అడుగులకు పైగా ఎత్తు నుంచి నీరు దిగువకు పడుతుంటే కళ్లార్పకుండా చూడాల్సిందే. దట్టమైన అడవి మధ్యలో ఉన్న ఈ జలపాతం వరకు చేరుకోవాలంటే ఓ 15 నిమిషాలు పాటు అడవిలో నడుచుకుంటూ వెళ్లాల్సిందే. అక్కడి నుంచి మరో నాలుగువందలమెట్లు కిందకి దిగితే జలపాతం వద్దకు చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి దాదాపు 260 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇక్కడికి సమీపంలోనే మరో జలపాతం గాయత్రి(Gayathri) జలపాతం. దీనికి మరోపేరే ముక్తిగుండం జలపాతం దాదాపు వంద అడుగుల ఎత్తు నుంచి ఇక్కడ కిందకు పడుతుంది. కుంతాల జలపాతానికి వచ్చిన వారు ఎక్కువగా దీన్ని కూడా సందర్శిస్తుంటారు.
బొగతా జలపాతం
తెలంగాణలోనే అత్యంత సుందరమైన జలపాతం బొగతా(Bogatha). తెలంగాణ నయాగారాగా దీనికి పేరు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్న ఈ జలపాతాన్ని చూసేందుకు రెండు కళ్లు సరిపోవు. తెల్లని నురగలు కక్కుతూ కిందకి దూకుతుంటే నీటిని చూసేందుకు పెద్దఎత్తున సందర్శకులు వస్తుంటారు. ఎత్తైన కొండలపై నుంచి పడే నీటి శబ్ధం కిలోమీటర్ వరకు లయబద్ధంగా వినిపిస్తుంటుంది. హైదారబాద్ నుంచి 270 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.