Viveka Murder Case: ఉదయం 4 గంటలకే వివేకా హత్య కేసు నిందితుల తరలింపు- హైదరాబాద్‌లో విచారణ!
Viveka Murder Case: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు నిందితులను ఏపీ పోలీసులు ఉదయం 4 గంటలకు భారీ బందోబస్తు నడుమ హైదరాబాద్ కు తరలించారు.
Viveka Murder Case: వైఎస్ వివేకానంద హత్య కేసు నిందితులను ఏపీ పోలీసులు ఉదయం 4 గంటలకు హైదరాబాద్ తరలించారు. కడప జైలులో ఉన్న నిందితులను భారీ బందోబస్తు నడుమ హైదరాబాద్ పంపించారు. కడప జైల్లో ఉన్న ఏ2 సునీల్ కుమార్ యాదవ్, ఏ3 ఉమా శంకర్ రెడ్డి, ఏ5 దేవిరెడ్డి శివ శంకర్ రెడ్డిని నేటి ఉదయం సీబీఐ కోర్టులో 10.30 గంటలకు హాజరు పరిచారు. ఈ క్రమంలోనే వారిని కడప జైలు నుంచి హైదరాబాద్ కు పోలీసులు తరలించారు. ఈ కేసులో నిందితులైన ఏ1 ఎర్ర గంగిరెడ్డి, ఏ4 అప్రూవర్ దస్తగిరిలు బెయిల్ పై బయటకు వచ్చారు. ఇప్పటికే వీరిద్దరూ హైదరాబాద్ కు చేరుకున్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో శుక్రవారం హైదరాబాద్ లోని సీబీఐ కోర్టు ఎదుట హాజరయ్యారు. వివేకా కూతురు సునీత విజ్ఞప్తి మేరకు సుప్రీంకోర్టు ఈ కేసును తెలంగాణకు బదిలీ చేసింది.
కోర్టు ఆదేశాల మేరకు బెయిల్ పై ఉన్న ఎర్ర గంగిరెడ్డి, దస్తగిరి సీబీఐ సమన్లు జారీ చేసింది. ఇక సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్న సునీల్ యాదవ్, ఉమా శంకర్ రెడ్డి, దేవిరెడ్డి శంకర్ రెడ్డిని ప్రత్యే బందోబస్తు మధ్య హైదరాబాద్ తరలించేందుకు పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకుంది. గురువారం సాయంత్రం 5 గంటలకు ఈ ముగ్గురిని హైదరాబాద్ తరలించేందుకు జైలు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. నిందితులను ఏఆర్ సిబ్బంది భద్రతతో హైదరాబాద్ తీసుకెళ్లాల్సి ఉంది. అయితే రాత్రి 10 గంటలకు కూడా ఆ ముగ్గురిని జైలు నుంచి తీసుకెళ్లలేదు. సాయంత్రం వేళ దేవిరెడ్డి శంకర్ రెడ్డిని కుటుంబ సబ్యులు ములాఖత్ లో కలిసి వెళ్లారు. గురువారం అర్ధరాత్రి తర్వాత హైదరాబాద్ తీసుకెళ్లాలనే ఆలోచనలో పోలీసులు ఉన్నట్లు సమాచారం. అయితే అనూహ్యంగా ఈ ఉదయం నిందితులను తరిలించారు.
ఇటీవేల డ్రైవర్ దస్తగిరి సంచలన వ్యాఖ్యలు
వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో అప్రూవర్ గా మారిన వివేకా డ్రైవర్ దస్తగిరి... తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్య కేసులో నిజాలేంటో త్వరలో తెలుస్తాయని దస్తగిరి అన్నారు. హైదరాబాద్‌కు కేసు బదిలీ అవ్వడం మంచిదే అన్నారు. ఈ నెల 10న హైదరాబాద్ సీబీఐ కోర్టుకు హాజరు కావాలని నోటీసులు అందుకున్నట్లు ఆయన తెలిపారు. సీబీఐ అధికారులు పక్కా సమాచారంతో ఈ కేసులో సంబంధం ఉన్న వారిని విచారణకు పిలుస్తున్నారన్నారు. అందులో భాగంగానే వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని కూడా విచారణకు పిలిచారన్నారు. ఈ కేసులో ఎవరి పాత్ర ఏంటో సీబీఐ అధికారులు త్వరలోనే వెల్లడిస్తారని నమ్ముతున్నట్లు దస్తగిరి ఆదివారం అన్నారు.
సీఎం జగన్ సహకరించి ఉంటే
వివేకా హత్యకేసులో త్వరలో నిజాలు తెలనున్నాయని, వాస్తవాలు బయటపడే రోజు దగ్గర పడిందని దస్తగిరి అన్నారు. ఇప్పటి వరకూ దస్తగిరి చెప్పింది అబద్దమని అన్నారని, ఇకపై తాను చెప్పిన నిజాలు ఏంటో ప్రజలకు తెలుస్తాయన్నారు. ఆంధ్రప్రదేశ్ లో విచారణకు సీఎం జగన్ సహకరించి ఉంటే 10 రోజుల్లో కేసు విచారణ పూర్తి అయ్యేదన్నారు. తెలంగాణకు వివేకా హత్య కేసు బదిలీ అవ్వడం మంచిదేనన్నారు.