TSRTC: బస్టాండుల్లోని షాపుల్లో అధిక ధరలకు అమ్ముతున్నారా? ఈ నెంబర్లకు ఫోన్ చేయండి
ఆర్టీసీ బస్టాండ్లలో అధిక ధరలకు వస్తువులను విక్రయిస్తే ఇక నేరుగా బస్ స్టేషన్ మేనేజర్, లేదా ఆర్టీసీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు ఇవ్వొచ్చు.
ఆర్టీసీ బస్టాండుల్లో ఉండే దుకాణాల్లో వస్తువులు కొనాలంటే బెంబేలెత్తాల్సిందే. ప్రతిచోటా ఎమ్మార్పీ ధర కంటే అధికంగా డబ్బులు వసూలు చేస్తుంటారు. ఇంకొందరైతే ప్రత్యేకంగా ఎక్కువ రేటుతో స్టిక్కర్ అంటించి మరీ డబ్బులు లాగుతుంటారు. ఇకపై ఇలా చేస్తే ఆర్టీసీ అధికారులు కఠిన చర్యలు తీసుకోనున్నారు. ఏ బస్టాండుల్లోనైనా ఎమ్మార్పీ ధర కన్నా అధిక ధర వసూలు చేస్తే ఫలానా నెంబర్లకు ఫిర్యాదు చేయొచ్చని బోర్డులు పెడుతుంటారు. ఫిర్యాదు చేస్తే ప్రశ్నించేవారు. కానీ, ఇకపై జరిమానాలు వేసేందుకు అధికారులు సిద్ధం అయ్యారు.
Also Read: కేసీఆర్ మాటలకు అర్థాలే వేరా ? తెలంగాణలో ముందస్తు ఖాయమేనా ?
ఎవరైనా అధిక ధరలు అంటూ ఫిర్యాదు చేస్తే అధికారులు ఆ దుకాణదారుడి దగ్గరకు వెళ్లి బెదిరించడం తప్ప జరిమానాలు వేసేవారు కాదు. కానీ, ఇప్పుడు ఆర్టీ ఎండీ సజ్జనార్ ఆదేశాలతో కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఓ ఫిర్యాదు అందగానే నేరుగా ఎంజీబీఎస్‌లో ఓ దుకాణానికి వెళ్లి రూ.వెయ్యి రసీదు చేతిలో పెట్టి, గట్టిగా హెచ్చరించారు. ఒక్క ఎంజీబీఎస్‌లోనే కాకుండా.. దిల్‌సుఖ్‌నగర్ బస్టాండు సహా ప్రతి చోటా రూ.20 ఉండే వాటర్ బాటిల్‌ను రూ.25కు అమ్ముతుంటారు. దీంతో ఓ ప్రయాణికుడు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు ట్వీట్ చేశారు. దీంతో ఆయన తక్షణం స్పందించి రాష్ట్రవ్యాప్తంగా ఈ విషయంపై దాడులు చేయాలని ఆదేశించారు.
Also Read: ఈటలను చిత్తు చేయండి.. హరీశ్ రావు వ్యాఖ్యలు, సొంత ఇలాకాలో మంత్రికి షాక్
ఎంజీబీఎస్‌లో ఈ నెంబర్లకు ఫిర్యాదు చేయొచ్చు
ఆర్టీసీ బస్టాండ్లలో అధిక ధరలకు వస్తువులను విక్రయిస్తే ఇక నేరుగా బస్ స్టేషన్ మేనేజర్, లేదా ఆర్టీసీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు ఇవ్వొచ్చు. ఈ మేరకు ఎంజీబీఎస్‌లో 28 చోట్ల బ్యానర్లు, వాల్ పోస్టర్లను అంటించారు. అధిక ధరకు అమ్మితే తమకు ఫిర్యాదు చేయాలని స్టేషన్ మేనేజర్ 9959224911, అసిస్టెంట్ మేనేజర్ 9959224910, కస్టమర్ రిలేషన్స్ మేనేజర్ 9959226245 ఫోన్ నంబర్లను ప్రదర్శించారు. టాయ్‌లెట్స్ వద్ద కూడా అధిక ధరలు వసూలు చేస్తే ఫిర్యాదు చేయడానికి నంబర్లను ఏర్పాటు చేశారు.
Also Read: టీఆర్ఎస్ పార్టీలో చేరిన మోత్కుపల్లి నర్సింహులు.. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం కేసీఆర్
ఈ జరిమానాల విషయంలో ఒక దుకాణానికి 3 జరిమానాలు విధించిన తర్వాత నోటీసులు జారీ చేస్తారు. అయితే, 2 నోటీసుల వరకూ దుకాణదారులను తప్పించే అధికారాలు ఉండకపోవడం కూడా వారికి కలిసివస్తోంది. ఎక్కువ ధరకు అమ్మినట్టు రుజువైతే ఒక్కసారికే దుకాణ ఒప్పందాన్ని రద్దు చేస్తే నకిలీలకు, అధిక ధరలకు అడ్డు కట్ట వేసేందుకు వీలుంటుందని ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు. ఇకపై ప్రయాణికుల ఫిర్యాదులే కాకుండా.. తాము సాధారణ ప్రయాణికుల్లా వెళ్లి పరిశీలిస్తామని అధికారులు చెప్పారు.
Also Read: జీవితాంతం జైల్లోనే డేరా బాబా .. హత్య కేసులో మరో యావజ్జీవ శిక్ష !