TSPSC పేపర్ లీకేజీ కేసులో రేణుకకు షాక్ - ఆమె రిక్వెస్ట్ ను తోసిపుచ్చిన నాంపల్లి కోర్టు
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో రేణుక రిక్వెస్ట్ ను నాంపల్లి కోర్టు పట్టించుకోలేదు. రేణుక దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను నాంపల్లి కోర్టు కోర్టు తోసిపుచ్చింది.
Court rejected bail petition of Renuka: హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) పేపర్ లీకేజీ కేసులో కీలక నిందితులలో ఒకరైన రేణుకు షాక్ తగిలింది. రేణుక రిక్వెస్ట్ ను నాంపల్లి కోర్టు పట్టించుకోలేదు. రేణుక దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను నాంపల్లి కోర్టు కోర్టు తోసిపుచ్చింది. అనారోగ్యంగా ఉందని, దాంతో పాటు చిన్నారుల బాగోగులు చూసుకోవాలని కారణం చూపి తనకు బెయిల్ ఇవ్వాలని రేణుక కోర్టును అభ్యర్థించారు. టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో తనకు ప్రత్యక్షంగా సంబంధం లేదని, కేవలం తనపై నేరం చేశానని అభియోగాలు ఉన్నాయని, తన పరిస్థితి అర్థం చేసుకుని బెయిల్ మంజూరు చేయాలని రేణుక కోరింది. కానీ ఏ 3 నిందితురాలు రేణుక దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను నాంపల్లి కోర్టు తోసిపుచ్చింది.
లక్షలాది మంది విద్యార్థుల జీవితాలకు సంబంధించిన కేసులో రేణుక నిందితురాలు అని, ఆమెకు బెయిల్ ఇస్తే విచారణపై ప్రభావం చూపుతుందని, సాక్ష్యాలు తారుమారు అవుతాయని సిట్ తరఫు లాయర్ నాంపల్లి కోర్టుకు విజ్ఞప్తి చేశారు. రెండు వైపుల వాదనలు విన్న కోర్టు రేణుకకు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. మరోవైపు ఈ కేసులో ప్రశాంత్, రాజేందర్, తిరుపతయ్యను కస్టడీ కోరుతూ సిట్ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. వారం రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ వేయగా, వాదనలు ముగిశాయి. ఏప్రిల్ 3న కోర్టు తీర్పు వెలువరించనుంది.
టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో సిట్ విచారణ కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించి టీఎస్పీఎస్సీ సెక్రెటరీ, ఐఏఎస్ అధికారి అనితా రామచంద్రన్ ఈరోజు విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేయగా.. ఆమె విచారణకు హాజరయ్యారు. సిట్ అధికారులు అనితా రామచంద్రన్ వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. ప్రవీణ్ కు సంబంధించి అంశాలపై ఆమెను అధికారులు ప్రశ్నించారు. టీఎస్పీఎస్సీ పరిపాలన, కాన్ఫిడెన్షియల్ విభాగంపై పలు ప్రశ్నలు సంధించారు. పేపర్ లీక్ వ్యవహారంలో ప్రధాన నిందితుడైన ప్రవీణ్.. టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ వద్ద పర్సనల్ అసిస్టెంట్ గా పని చేస్తున్నాడు. దీంతో ప్రవీణ్ గురించి ప్రధానంగా అనితా రామచంద్రన్ ను సిట్ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. టీఎస్పీఎస్సీలో ప్రశ్నాపత్రాల తయారీ, భద్రత, ఉద్యోగ నియామక పరీక్షలకు సంబంధించిన వివరాలను సైతం సిట్ అడిగినట్లు తెలుస్తోంది. టీఎస్పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్ తో పాటు సభ్యుడు లింగారెడ్డికి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
మరింత వేగవంతమైన దర్యాప్తు
గ్రూప్ -1 పరీక్షలో ప్రధాన నిందితుడైనా ప్రవీణ్ కు 103 మార్కులు వచ్చాయి. కానీ ఎక్కడ దొరికిపోతానో అని వ్యక్తిగత వివరాల విభాగంలో డబుల్ బబ్లింగ్ చేసి డిస్ క్వాలిఫై అయ్యేలా చేసుకున్నాడు. గ్రూప్-1 పరీక్షలో 100కు పైగా మార్కులు వచ్చిన వారిని పిలిపించిన అధికారులు వారి వాంగ్మూలాన్ని ఇప్పటికే రికార్డు చేశారు. మరికొంత మందిని రెండు మూడు రోజుల్లో పిలిచి ప్రశ్నించనున్నట్లు సిట్ అధికారులు చెబుతున్నారు. లీకైన గ్రూప్-1 ప్రశ్నాపత్రాన్ని ప్రవీణ్ పలువురికి అందించగా అందులో 15 మందిని గుర్తించి అరెస్టు చేశారు. ఇంకెంత మందికి ఆ లీకైన ప్రశ్నాపత్రాలు చేరాయోనని అధికారులు గుర్తించే పనిలో ఉన్నారు. వారి ద్వారా ఎవరెవరికి నగదు అందింది అనే కోణంలో సిట్ అధికారులు ప్రశ్నలు గుప్పిస్తున్నారు.