TSPSC: బండి సంజయ్, రేవంత్ కి మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు - రూ.100 కోట్ల పరువునష్టం దావా
KTR send legal Notices to Revanth and Bandi Sanjay: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ లకు మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు.
KTR send legal Notices to Revanth Reddy and Bandi Sanjay: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ లకు మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో తనపై రేవంత్ రెడ్డి, బండి సంజయ్ చేసిన నిరాధార ఆరోపణలపై బహిరంగ క్షమాపణలు చెప్పాలని.. లేని పక్షంలో రూ.100 కోట్ల పరువునష్టం దావా వేస్తానని నోటీసులలో పేర్కొన్నారు.
కేవలం ప్రజాప్రతినిధిగా ఉన్నంత మాత్రాన ఎదుటి వారి పైన అసత్య ప్రేలాపనాలు చేసే హక్కు వీరికి లేదని పేర్కొన్న కేటీఆర్, ఇండియన్ పీనల్ కోడ్ లోని 499, 500 నిబంధనల ప్రకారం పరువు నష్టం దావా నోటీసులు పంపించారు. ఎలాంటి ఆధారాలు లేని సత్య దూరమైన ఆరోపణలను మానుకోవాలని, ఇప్పటికే చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని నోటీసులో డిమాండ్ చేశారు. వారం రోజులలోగా తమ వ్యాఖ్యలను వెనకకు తీసుకొని క్షమాపణ చెప్పకుంటే 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావాను ఎదుర్కోవాల్సి వస్తుందని కేటీఆర్ తన నోటీసులో పేర్కొన్నారు.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వ్యవహారంపై నిరాధారమైన, అసత్య ఆరోపణలు చేస్తున్నారనే కారణంతో కాంగ్రెస్, బిజేపీ నేతలు రేవంత్ రెడ్డి, బండి సంజయ్ కి మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపిస్తున్నట్టు ఇటీవల తెలిపారు. TSPSC వ్యవహారంలో కేవలం రాజకీయ దురుద్దేశంతోనే తన పేరును లాగుతూ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే కుట్ర చేస్తున్నందుకు వీరిద్దరికి లీగల్ నోటీసులు పంపుతున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు స్వయంప్రతిపత్తి ఉంటుందన్న విషయం అవగాహన లేకుండా ఈ అంశంలోకి ప్రభుత్వాన్ని, తనను లాగడం వారి అజ్ఞానానికి నిదర్శనమని కేటీఆర్ మండిపడ్డారు. స్వతంత్రంగా పరీక్షల నిర్వహణ, ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వంతో సంబంధం లేకుండా పబ్లిక్ సర్వీస్ కమిషన్ వ్యవస్థ ఏర్పాటయిందని గుర్తుచేశారు.
ఈ వాస్తవాలన్నింటినీ పక్కనపెట్టి మొత్తం వ్యవహారం ప్రభుత్వ పరిధిలో జరుగుతున్న అంశంగా చిత్రీకరించే దుర్మార్గపూరిత కుట్రలకు బండి సంజయ్, రేవంత్ రెడ్డి తెరలేపారని కేటీఆర్ విమర్శించారు. ప్రభుత్వాల పరిపాలన వ్యవహారాల పట్ల కనీస ఇంగిత జ్ఞానం లేకుండా తెలివితక్కువతనంతో వీరు అవాకులు చెవాకులు పేలుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. బోడిగుండుకు మోకాలికి ముడిపెట్టినట్లు మాట్లాడుతూ టీఎస్పీఎస్సీ వ్యవహారంలో కుట్రపూరితంగా రాజకీయ దురుద్దేశంతోనే పదేపదే తన పేరును లాగేందుకు ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. బట్టకాల్చి మీదేసే ఇలాంటి చిల్లర ప్రయత్నాలను ఎట్టిపరిస్థితుల్లో సహించనని ఆయన హెచ్చరించారు.
ఇంతకీ రేవంత్ ఏమన్నారు..
పరీక్షలు పారదర్శకంగా నిర్వహించాల్సిన అధికారులు వైఫల్యం చెందారని రేవంత్ రెడ్డి ఇటీవల ఆరోపించారు. TSPSC రాజకీయ పునరావాస కేంద్రంగా మారిందన్నారు. పరీక్షల నిర్వహణలో అధికార పార్టీ నేతలు తలదూర్చారని ఆరోపించారు. ప్రశ్నా పత్రాలు పల్లి బఠాణీలు అమ్మినట్లు అమ్మేశారని మండిపడ్డారు. ఈ లీకేజీకి మంత్రి కేటీఆర్ భాధ్యత వహించాలని, ఆయనను మంత్రివర్గం నుంచి, బర్తరఫ్ చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. TSPSC లో ఛైర్మన్ , అలాగే వెంకటలక్ష్మిని జైలుకి పంపాలన్నారు. TSPSC పరీక్షలు రాసిన ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలన్నారు.
బండి సంజయ్ ఆరోపణలు ఇలా..
టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీకి మంత్రి కేటీఆర్ బాధ్యుడని బండి సంజయ్ పలుమార్లు ఆరోపించారు. బీఆర్ఎస్ జడ్పీటీసీ, సర్పంచ్, సింగిల్ విండో ఛైర్మన్ పిల్లలు, బంధువులు గ్రూప్ 1 పరీక్షలో క్వాలిఫై అయ్యారన్నారు. ఒకే మండలం నుంచి 50 మందికిపైగా క్వాలిఫై అయ్యారని, ఒక చిన్న గ్రామంలో 6గురు క్వాలిఫై అయ్యారని ఆరోపించారు. ఈ లీకేజీకి కేసీఆర్ కొడుకే బాధ్యుడని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ నియమించిన సిట్ విచారణ ఎలా చేయగలదని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, అప్పుడే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. మంత్రివర్గం నుంచి సీఎం కేసీఆర్ కొడుకును బర్త్ రఫ్ చేయాల్సిందేనని స్పష్టం చేశారు.