Telangana Bandh: తెలంగాణలో కొనసాగుతున్న బీసీ సంఘాల బంద్- ఆగిన రవాణా, వాణిజ్య కార్యకలాపాలు
Telangana Bandh: బీసీ సంఘాల బంద్‌తో తెలంగాణ కార్యకలాపాలు స్తంభించిపోయాయి. అన్ని పార్టీల మద్దతుతో సాగుతున్న నిరసనలు అన్ని వర్గాలపై ప్రభావం చూపుతున్నాయి.

Telangana Bandh: బీసీ రిజర్వేషన్లు ఆమోదించి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణవ్యాప్తంగా బీసీ సంఘాలు బంద్ కొనసాగిస్తున్నాయి. ఉదయం నాలుగు గంటల నుంచే రోడ్లపైకి వచ్చి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.జస్టిస్ ఫర్ బంద్ పేరిట చేపట్టిన బంద్‌లో అన్ని పార్టీల నేతలు, కార్యకర్తలు పాల్గొంటున్నారు. అన్ని వర్గాల మద్ధతుతో వ్యాపార వాణిజ్య సంస్థలు, స్కూల్స్, రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది.
బంద్ నుంచి అత్యవసర సేవలకు మినహాయింపు కల్పించారు. వివిధ పార్టీల సీనియర్ నేతలు బంద్‌లో పాల్గొంటున్నారు. రోడ్లపైకి వచ్చి నినాదాలు చేస్తున్నారు. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. వివిధ ప్రాంతాల్లో ఏర్పడ్డ జేఏసీలు ఆ ప్రాంతాల్లో బంద్ ప్రశాంతంగా జరిగే చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఆర్టీసీ బస్‌లు బయటకు రాకుండా డిపోల ముందు ఉదయం నుంచి బైఠాయించారు. దీంతో అన్ని ప్రాంతాల్లో బస్‌లు డిపోలకు మాత్రమే పరిమితం అయ్యాయి. బైక్, ట్యాక్సీ సేవలకు మాత్రం నిరసనకారులు మినహాయింపు ఇచ్చారు.
బీసీ రిజర్వేషన్ సాధనలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా బీసీ సంఘాలు రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేసే బిల్లు చట్టరూపం దాల్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలని డిమాండ్ చేస్తున్నాయి. అసెంబ్లీలో తీసుకొచ్చిన బిల్లు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉంది. చేసిన ఆర్డినెన్స్‌కు గవర్నర్ కూడా ఆమోదం తెలపలేదు. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్9ను నిలుపుదల చేస్తూ కోర్టులు స్టే విధించాయి. ఇలా ఇరు రాష్ట్రాలు బీసీల రిజర్వేషన్ కోసం చిత్తశుద్ధితో పని చేయడంలేదని బీసీ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఆ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి, ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు బంద్‌కు పిలుపునిచ్చాయి.
బీసీ సంఘాల పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా బంద్ వాతావరణం కనిపిస్తోంది. బంద్‌కు అన్ని పార్టీల మద్దతు ఇచ్చాయి. కేంద్రం కోర్టులో బీసీ బంతి ఉందని,తాము అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని కానీ కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఆ కారణంతోనే వారు కూడా ఈ బంద్‌లో పాల్గొంటున్నారు. స్వయంగా పీసీసీ చీఫ్ ఈ బంద్‌లో కాంగ్రెస్ శ్రేణులు పాల్గొనాలని పిలుపునిచ్చాయి.
కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ది లేకపోవడమే అసలు సమస్యకు కారణమని బీజేపీ ఆరోపిస్తోంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీసీ సంఘాలు ఉద్యమిస్తున్నాయని చెబుతూ బీజేపీ నేతలు కూడా బంద్‌లో పాల్గొంటున్నారు. ఎంపీ ఈటల రాజేందర్ స్వయంగా బీసీ సంఘాలతో కలిసి రోడ్డుపై ధర్నా చేశారు. బీసీలకు రాజ్యాధికారం వచ్చినంత వరకు పట్టు వీడొద్దని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్లే కోర్టుల్లో ఎదురు దెబ్బ తగిలిందని, కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం లేదని విమర్శించారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం రెండూ ప్రజలను, బీసీ జనాలను మోసం చేస్తున్నాయని బీఆర్‌ఎస్ ఆరోపిస్తోంది. రెండు ప్రభుత్వాలకు బుద్ది రావాలని, ప్రజల ఆవేశం అర్థం చేసుకోవాలని ఈ బంద్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది. కవిత కూడా ఈ బంద్‌కు మద్ధతు ప్రకటించారు.
ప్రయాణికుల అవస్థలు
బంద్ కారణంగా ఎక్కడి బస్‌లు అక్కడే ఆగిపోయాయి. డిపోల ముందే బీసీ సంఘాలు బైఠాయించడంతో బస్‌లు కదల్లేదు. దీంతో ప్రయాణికులలు అవస్థలు పడుతున్నారు. ఉదయం నుంచి ఆఫీసులకు, దూర ప్రయాణాలకు వెళ్లే వాళ్లకు సమస్యలు తప్పడం లేదు. పండుగపూట ప్రయాణాలు చేసే వారికి చుక్కలు కనిపిస్తున్నాయి. వీకెండ్‌లో ఊళ్లు వెళ్లే వాళ్లు కూడా ఇబ్బంది పడుతున్నారు. అందరూ రైల్వేస్టేషన్‌లవైపు పరుగులు తీస్తున్నారు. ప్రైవేటు క్యాబ్‌లను ఆశ్రయిస్తున్నారు.





















