Sarpanch Protest: ఇందిరా పార్కు ధర్నాకు కోర్టు అనుమతి, అయినా హౌస్ అరెస్టులా? - మల్లు రవి
Sarpanch Protest: ఈరోజు ఇందిరా పార్కు వద్ద టీపీసీసీ ఆధ్వర్యంలో జరిగే సర్పంచ్ ధర్నాకు కోర్టు అనుమతి ఇచ్చిందని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి తెలిపారు.
Sarpanch Protest: ఈ రోజు (జనవరి 9) ఇందిరాపార్క్ వద్ద టీపీసీసీ రాజీవ్ గాంధీ పంచాయతీ సంఘటన్ ఆధ్వర్యంలో జరిగే సర్పంచ్ ధర్నాకు కోర్టు అనుమతి ఇచ్చిందని టీపీసీసీ సీనియర్ అధ్యక్షులు మల్లు రవి తెలిపారు. కోర్టు ఆదేశాల మేరకు పోలీసుల అనుమతి కూడా తీసుకున్నామన్నారు. పోలీసుల అనుమతి తీసుకున్నప్పటికీ.. చాలా మంది కాంగ్రెస్ నాయకులను పోలీసులు గృహ నిర్బంధాలు చేస్తూన్నారని వెల్లడించారు. తమకు అన్ని ప్రాంతాల నుంచి నాయకుల ద్వారా సమాచారం తెలుస్తుందోని ఆయన వివరించారు. పోలీసులు కాంగ్రెస్ నాయకులను అడ్డుకోవద్దని సూచించారు. కాంగ్రెస్ నాయకులను అరెస్టులు, గృహ నిర్బంధాలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు మల్లు రవి తెలిపారు. అనుమతి ఉండి, శాంతి యుతంగా నిర్వహించే ధర్నాను అడ్డుకుంటే కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని చెప్పుకొచ్చారు. గృహ నిర్బంధం చేసిన నాయకులకు వెంటనే పోలీసులు స్వేచ్ఛ ఇవ్వాలని... వారిని ధర్నాలో పాల్గొనేలా అవకాశం ఇవ్వాలని సూచించారు. లేకపోతే తర్వాత జరిగే పరిణామాలకు పోలీసులే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు.
వారం రోజుల క్రితం టీకాంగ్రెస్ ధర్నా - అడ్డుకున్న పోలీసులు
గ్రామ పంచాయతీల నిధుల మళ్లింపు, సర్పంచుల సమస్యలపై కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ధర్నాను పోలీసులు అడ్డుకున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు కీలక నేతలను అరెస్టు చేశారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనలు చేస్తున్నారు. సర్పంచుల నిధుల సమస్యలపై ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహించేందుకు సిద్ధమైన కాంగ్రెస్ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని పోలీసులు సోమవారం అరెస్టు చేసి బొల్లారం పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో బొల్లారం పీఎస్ వద్ద కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ధర్నా చేస్తుంటే ప్రభుత్వం అనుమతి ఇవ్వకుండా గృహనిర్బంధాలు చేస్తూ అరెస్టులు చేయడం దారుణమని కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే రేవంత్ రెడ్డిని విడుదల చేయాలని లేని పక్షంలో ఆందోళన మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. సర్పంచుల నిధుల సమస్యలపై కాంగ్రెస్ పోరాటాన్ని అణచివేసేందుకు ప్రభుత్వం కుట్ర చేయడం సిగ్గుచేటని అన్నారు. బొల్లారం పీఎస్ ను కాంగ్రెస్ కార్యకర్తలు ముట్టడించారు. పీఎస్ ఎదుట ధర్నాకు దిగారు. పీఎస్ లోకి చొచ్చుకెళ్లేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించడంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన జీవన్ రెడ్డి..
గ్రామ పంచాయతీల హక్కుల కోసం పోరాటం చేస్తుంటే అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ నియంతృత్వ పాలన నైజాం పాలనను మించిపోయిందని విమర్శించారు. పోలీసులపై చర్యలపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని తెలిపారు. మందస్తు అరెస్టుపై జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ అరెస్టులు చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించిన నిధులను గ్రామపంచాయతీలకు జమ చేసే వరకు పోరాటం చేస్తామన్నారు. ప్రజా ప్రతినిధుల విధులకు ఆటంకం కలిగించినందుకు ఐపీసీ 353 సెక్షన్ కింద శిక్షార్హులవుతారని హెచ్చరించారు. పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాల్సిన నిధులను పంపిణీ చేయకుండా కేంద్రం ఇస్తున్న నిధులను పంచాయతీల అనుమతి లేకుండానే మళ్లించారని ఆరోపించారు. 3 నెలలుగా ట్రేజరీలో చెక్కులు నిలిపివేసి, గ్రామ పంచాయతీల నిధులు మళ్లించారని ద్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం మళ్లించిన నిధులు గ్రామ పంచాయతీలకు తిరిగి జమ చేసే వరకు కాంగ్రెస్ పార్టీ సర్పంచులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు జీవన్ రెడ్డి.