Revanth Reddy On Jamili Elections: జమిలి ఎన్నికలపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు, అధ్యక్ష తరహా కోసమేనని ఆరోపణలు
Revanth Reddy About Jamili Elections: జమిలి ఎన్నికలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. జమిలి ఎన్నికలు ప్రజాస్వామ్యానికి ప్రమాదం అని అభిప్రాయపడ్డారు.
Revanth Reddy About Jamili Elections:
హైదరాబాద్: కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం జమిలి ఎన్నికలు (One Nation One Election) కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందుకోసం మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ నేతృత్వంలో జమిలి ఎన్నికల పరిశీలనపై కమిటీని సైతం ఏర్పాటు చేశారు. అయితే జమిలి ఎన్నికలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. హైదరాబాద్ లోని గాంధీ భవన్‌లో రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. జమిలి ఎన్నికలు ప్రజాస్వామ్యానికి ప్రమాదం అని, దీనికి తాము పూర్తి వ్యతిరేకం అన్నారు. అధ్యక్ష తరహా ఎన్నికల కోసమే జమిలి విధానాన్ని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం తెర మీదకి తెచ్చిందని ఆరోపించారు.
బీజేపీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు..
రాష్ట్రాల హక్కులను కాలరాయడానికే జమిలి ఎన్నికలను బీజేపీ సర్కార్ తెస్తోందని రేవంత్ రెడ్డి విమర్శించారు. కేంద్రం వల్ల గత కొన్నిరోజులుగా ఎటు చూసినా జమిలి ఎన్నికలపై చర్చ జరుగుతోంది. కానీ అన్ని రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. బీజేపీ వాళ్ల మాయలో ప్రజలు పడే పరిస్థితి లేదని, అందుకు కర్ణాటక ఎన్నికల ఫలితాలే నిదర్శనం అన్నారు. కర్ణాటకలో ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రులు గల్లీ గల్లీ తిరిగినా ప్రజలు కాంగ్రెస్ కు ఓటు వేశారని గుర్తుచేశారు. నెల రోజులపాటు బీజేపీ పెద్దలు, కేంద్ర మంత్రులు కర్ణాటకను చుట్టేసినా కాంగ్రెస్ కు అనుకూల ఫలితాలు రావడం నిజం కాదా అని ప్రశ్నించారు. దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన మణిపూర్ అంశంపై మాత్రం ప్రధాని మోదీ పార్లమెంట్ లో నోరు విప్పలేదు, కానీ జమిలి ఎన్నికలు అంటూ రాష్ట్రాల్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
త్వరలో 5 రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నాయి. కొన్ని రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. కానీ ఆ 5 రాష్ట్రాల ఎన్నికల్లో గెలిచేది కాంగ్రెస్ పార్టీ అని పలు సర్వేలలో తేలిందన్నారు రేవంత్ రెడ్డి. అత్యధికంగా కాంగ్రెస్‌కు 38 శాతం ఓట్లు వస్తున్నాయని, బీజేపీ 31 శాతం ఓట్లతో రెండో స్థానంలో నిలిచే అవకాశం ఉందన్నారు. ఈ విషయాన్ని గమనించిన కేంద్ర ప్రభుత్వం.. వన్ నేషన్ - వన్ ఎలక్షన్ పేరుతో జమిలి ఎన్నికలను తెరపైకి తెచ్చిందని ఆరోపించారు. I.N.D.I.A కూటమి జమిలి ఎన్నికలకు పూర్తి వ్యతిరేకం అని స్పష్టం చేశారు.
జమిలి ఎన్నికలను వ్యతిరేకిస్తూ జమిలి ఎన్నికల కమిటీ సభ్యుడిగా అధీర్ రంజన్ వైదొలగడం తెలిసిందే. బీజేపీ, బీఆర్ఎస్ ఒకగూటి పక్షులను.. అందుకే గూలాబీ పార్టీ జమిలిని స్వాగతించే అవకాశం ఉందన్నారు. గతంలో 2018లో జమిలి ఎన్నికలకు సీఎం కేసీఆర్ సమ్మతి తెలుపుతూ లేఖ రాశారని గుర్తుచేశారు. కానీ ఇలాంటి ఎన్నికలతో రాష్ట్రాల అధికారాన్ని హరించి వేస్తాయని, కేంద్రం చేతుల్లోకి అధికారం వెళ్తుందని కీలక వ్యాఖ్యలు చేశారు. మోదీ సర్కార్ తీరు గమనిస్తే అధ్యక్ష తరహా ఎన్నికల కోసమే జమిలిని తెరపైకి తెచ్చారని ఆరోపించారు. ఇలాంటి ఎన్నికలు ప్రజాస్వామ్యానికే ప్రమాదమని, రాష్ట్రాల హక్కుల్ని కేంద్రం కాలరాసే అవకాశం అధికంగా ఉంటుందన్నారే రేవంత్.