Telangana సర్కార్ తో చర్చలు సక్సెస్, సమ్మె నిర్ణయాన్ని విరమించిన రేషన్ డీలర్లు - వారం రోజుల్లో జీవో
Telangana Ration Dealers Called off Strike: చౌకధరల దుకాణాల డీలర్ల సంఘాలతో పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ జరిపిన చర్చలు సక్సెస్ కావడంతో సమ్మె నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు.
- రేషన్ డీలర్లతో మంత్రి గంగుల కమలాకర్ చర్చలు సఫలం
- 22 సమస్యలపై 20 పరిష్కారానికి సానుకూలం
- గౌరవ వేతనం, కమీషన్ పెంపు సీఎం దృష్టికి
Telangana Ration Dealers Called off Strike Decision: తెలంగాణ ప్రభుత్వం రేషన్ డీలర్లతో జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. దాంతో సమ్మె నిర్ణయాన్ని రేషన్ డీలర్లు విరమించుకున్నారు. రాష్ట్రంలోని చౌకధరల దుకాణాల డీలర్ల సంఘాలతో పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ జరిపిన చర్చలు సక్సెస్ కావడంతో సమ్మె నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. రేషన్ డీలర్లు మొత్తం 22 అంశాలను ప్రభుత్వం ముందుంచారు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే జూన్ 5 నుంచి సమ్మె చేస్తామని రేషన్ డీలర్లు ప్రకటించారు. ఈ క్రమంలో నూతనంగా నిర్మించిన బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో రేషన్ డీలర్ల ఐక్య కార్యాచరణ సంఘాలతో మంత్రి గంగుల చర్చలు జరిపారు.
మొత్తం 22 అంశాలను రేషన్ డీలర్లు రాష్ట్ర ప్రభుత్వం ముందుంచగా, అందులో 20 సమస్యల పరిష్కారానికి సర్కార్ ఓకే చెప్పింది. మరో 2 అంశాలపై త్వరలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని రేషన్ డీలర్లకు మంత్రి గంగుల హామీ ఇచ్చారు. తమ డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం అంగీకారం తెలపడంతో సమ్మె నిర్ణయాన్ని విరమించుకున్నారు రేషన్ డీలర్లు. వారం రోజుల్లో ఉత్తర్వులు జారీ చేస్తామని మంత్రి గంగుల రేషన్ డీలర్ల ఐకాసకు హామీ ఇచ్చారు. మంత్రి గంగులతో చర్చలు ముగిసిన తరువాత సమ్మె నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు రాష్ట్ర రేషన్ డీలర్ల ఐకాస సోమవారం రాత్రి ప్రకటించింది.
పేద ప్రజలకు నిత్యావసర సరుకులను సకాలంలో అందించవలసిన కనీస బాధ్యత, కర్తవ్యం తెలంగాణ ప్రభుత్వానికి ఎంతైతే ఉందో రేషన్ డీలర్లపై కూడా అంతే వుందని పౌరసరఫరాల శాఖా మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. పేద ప్రజలకు నిత్యావసర సరుకులు అందించడం ఒక సామాజిక బాధ్యత అనే విషయాన్ని డీలర్లు మరవద్దని ఈ బాధ్యతను విస్మరించి రేషన్ బియ్యం పంపిణీకి ఆటంకం కలిగించేలా రేషన్ డీలర్లు సమ్మెకు పిలుపునివ్వడం బాధాకరం అన్నారు. వచ్చే నెల 5వ తేది నుండి రేషన్ డీలర్ల సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో డా॥బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో సోమవారం నాడు మంత్రిగారు తెలంగాణ రేషన్ డీలర్ల ఐక్యకార్యాచరణ కమిటీ(జెఎసి)తో చర్చలు జరిపారు.
ఈ సమావేశంలో శాసనసభ్యులు వినయ్ భాస్కర్, పద్మాదేవేందర్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ కమీషనర్ వి.అనిల్‌కుమార్, జెఎసి చైర్మన్ నాయికోటి రాజు, వైస్ ఛైర్మన్ బంతుల రమేష్‌బాబు, కన్వీనర్ దుమ్మాటి రవీందర్, కో కన్వీనర్ గడ్డం మల్లికార్జున్ గారు పాల్గన్నారు. ఈ సమావేశంలో జెఎసి ఇచ్చిన 22 డిమాండ్లపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా మంత్రిగారు మాట్లాడుతూ.. రేషన్ డీలర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు. మొత్తం 22 సమస్యలపై 20 సమస్యల పరిష్కారినికి సానుకూలంగా ఉన్నామని ఇందుకు సంబధించి వారం రోజుల్లో ఉత్తర్వులు జారీ చేస్తామని, గౌరవ వేతనం, కమీషన్ పెంపు ఈ రెండు సమస్యలను గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.
సమ్మెను విరమిస్తున్నాం:
మంత్రి గంగుల హామీ మేరకు సమ్మెను విరమిస్తున్నట్లు మంత్రిగారి సమక్షంలో జెఎసి ప్రతినిధులు ప్రకటించారు. సీఎం కేసీఆర్ పై సంపూర్ణ నమ్మకం వుందని ముఖ్యమంత్రి తమ సమస్యలను పరిష్కరిస్తారని సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించారు.