Revanth Reddy: ఐదు అంశాలపై ప్రభుత్వాలతో కాంగ్రెస్ పోరాటం- రేపు విద్యుత్ సౌధ, సివిల్ సప్లై ఆఫీస్‌ల ముట్టడికి పిలుపు
ప్రధానంగా ఐదు ప్రజాసమస్యలపై తెలంగాణ కాంగ్రెస్ పోరాటానికి సిద్ధమైంది. ఆరోపణలు, ప్రత్యారపణలతో ప్రజలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని మండిపడ్డారు రేవంత్ రెడ్డి.
రెండు రోజుల క్రితం రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఇచ్చిన ప్రోత్బలంతో తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) స్పీడ్ పెంచింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై యుద్ధానికి సిద్ధమైంది. ఒకరిపై మరికొరు ఆరోపణలు చేసుకుంటూ ప్రజా సమస్యలు తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy). ప్రజలకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగేది కాదన్నారాయన.
పెట్రోల్, డీజిల్, గ్యాస్, విద్యుత్ ఛార్జీలు తగ్గే వరకు, రైతులు పండించిన పంటలు చివరి గింజ కొనే వరకు కాంగ్రెస్ పోరాటం చేస్తుందన్నారు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. అన్ని జిల్లా కేంద్రాల్లో డీసీసీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్‌ల జరిగిన ధర్నాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి పోరాటాలకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధం కావాలని సూచించారు. ప్రజలకు కూడా కాంగ్రెస్‌తో కలిసి రావాలని పిలుపునిచ్చారు.
ప్రజలకు భరోసా కల్పించి వారికి న్యాయం చేసే వరకు కాంగ్రెస్ పార్టీ జనంతో ఉంటుందన్నారు రేవంత్ రెడ్డి. ఐదు అంశాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెనక్కి తగ్గి ప్రజలకు న్యాయం చేసే వరకు విశ్రమించేది లేదన్నారు. అప్పటి వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వల వైఖరిని ఎక్కడికక్కడ నిలదీయాలన్నారు.
కేంద్రం, రాష్ట్రం ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకుంటూ రైతులను నట్టేట ముంచేస్తున్నారని మండిపడ్డారు రేవంత్ రెడ్డి. ముడి బియ్యం, ఉప్పుడు బియ్యం అంటూ ఒకరిపైన ఒకరు ప్రకటనలు చేసుకుంటూ ఇష్యూను పక్కదారి పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ బియ్యం అయిన కొనండి కానీ రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలన్నదే తమ డిమాండ్ అన్నారు.
విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని... రైతులు పండించిన పంటలు కొనుగోలు చేయాలన్న డిమాండ్‌తో గురువారం విద్యుత్ సౌధ సివిల్ స్ప్లై కార్యాలయాలు ముట్టడిస్తామన్నారు రేవంత్ రెడ్డి. అన్ని ప్రాంతాల్లో నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు రేవంత్. ఉద్యమాలను అడ్డుకునే కుట్ర టీఆర్‌ఎస్ చేస్తుందని... వాటిని అధిగమించి కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు. ఎక్కడ అడ్డుకుంటే అక్కడే రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేయాలన్నారు. పోలీస్ స్టేషన్లలో కూడా ఉద్యమం కొనసాగించాలన్నారు.
వరి ధాన్యం కొనుగోలు విషయంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో ధాన్యం క్వింటాల్ కు మద్దతు ధర 1960తోపాటు 600 రూపాయలు బోనస్ ఇస్తూ కొంటున్నామని గుర్తు చేశారు రేవంత్ రెడ్డి. రేపటి కార్యక్రమం తర్వాత ఏం చేయాలనేది నాయకులతో చర్చించి ప్రకటిస్తామన్నారు.
ఈ నెలాఖరున వరంగల్ జరిపే సభకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీని అహ్వానిస్తున్నట్టు తెలిపారు రేవంత్. దీనిపై ఆయనకు ప్రతిపాదనలు పంపినట్టు వెల్లడించారు. ఆయన రిప్లై వచ్చిన తర్వాత ఏర్పాటు పూర్తి చేస్తామన్నారు. సమావేశానికి రాహుల్ గాంధీ వచ్చినప్పుడు డీసీసీ అధ్యక్షులతో కూడా మాట్లాడుతారని... వారి సమస్యలు, పార్టీ ప్రగతి కోసం ఏం చేయాలో చర్చిస్తారన్నారు.