(Source: ECI/ABP News/ABP Majha)
PM Modi Telangana Visit: గాంధీ జయంతి రోజున రాష్ట్రానికి రానున్న ప్రధాని మోదీ - బహుముఖ వ్యూహంతో బీజేపీ సన్నద్ధం
Telangana News: వచ్చే నెల గాంధీ జయంతి రోజున ప్రధాని మోదీ తెలంగాణకు రానున్నారు. అదే రోజు మహబూబ్‌నగర్, నిజామాబాద్ లో నిర్వహించే సభల్లో పాల్గొంటారు.
PM Modi Telangana Visit: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కార్యాచరణ కసరత్తును బీజేపీ రాష్ట్ర నాయకత్వం కొలిక్కి తెచ్చింది. ఈ ఎన్నికల్లోనూ జాతీయ నాయకత్వాన్ని వీలైనంత మేరకు భాగం చేసేలా ప్రణాళికలు రచిస్తోంది. బహుముఖ వ్యూహంతో ఎన్నికల కార్యాచరణను ముందుకు తీసుకెళ్లాలని కిషన్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. సభలు, సమావేశాలు, ఇతర ఎన్నికల కార్యక్రమాలు ఎలా చేపట్టాలి, ఎప్పుడు చేపట్టాలని అనే కార్యాచరణపై ఈ నెల ఆఖరు లోపు తుది నిర్ణయానికి వచ్చి.. వచ్చే నెల నుంచి దానిని అమలు చేయడానికి సిద్ధమైంది. అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణకు రానున్నారు. అదే రోజు నిజామాబాద్, మహబూబ్‌నగర్ లలో నిర్వహించే బహిరంగ సభల్లో పాల్గొంటారని రాష్ట్ర నాయకత్వం వెల్లడించింది.
మోదీ పర్యటన తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆ తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలు రాష్ట్రానికి రానున్నారు. వివిధ జిల్లాల్లో ఏర్పాటు చేయబోయే బహిరంగ సభల్లో పాల్గొంటారు. ఈ మేరకు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి.. రాష్ట్ర నేతలతో సమావేశమై ఎన్నికల కార్యాచరణను ఖరారు చేస్తారని పార్టీ నేతలు తెలిపారు. ఈ నెల 26వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు 119 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా 3 మార్గాల్లో బస్సు యాత్ర చేపట్టాలని రాష్ట్ర నాయకత్వం మొదటి ప్రణాళిక వేసుకుంది. ప్రస్తుతానికి బస్సు యాత్రలను వాయిదా వేసింది. బస్సు యాత్రల స్థానంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మూడు, నాలుగు సభలను నిర్వహించాలని నిర్ణయించారు. ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనే సభలను రాజకీయ సభలుగానే పరిగణించి.. వాటిని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది.
అసెంబ్లీ నియోజకవర్గాల్లో సభల తేదీలను.. ఒకటీ రెండు రోజుల్లో ఖరారు చేసే అవకాశాలున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి సభలను ప్రారంభించి.. ముఖ్యనేతలు, కేంద్ర మంత్రులు, పార్టీ జాతీయ నాయకులు పాల్గొనేలా షెడ్యూల్ రూపొందించాలని భావిస్తున్నారు. బీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది.. కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన ఒకటీ రెండు రోజుల్లో ఉండనున్నట్లు తెలుస్తోంది.. ఈ నేపథ్యంలో బీజేపీ అభ్యర్థుల జాబితాను కూడా వీలైనంత త్వరగా అక్టోబర్ మొదటి వారంలో వెల్లడించడానికి సిద్ధమవుతున్నారు రాష్ట్ర నేతలు. నియోజకవర్గానికి ముగ్గురు లేదా నలుగురి పేర్లను గుర్తించి.. సర్వేలు, పార్టీ నేతల అభిప్రాయాలు, వివిధ సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని ఎంపిక చేస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. పార్టీ ముఖ్యనేతలంతా.. అసెంబ్లీ బరిలో నిలవాల్సి ఉంటుందని ఇప్పటికే జాతీయ నాయకత్వం సంకేతాలు ఇచ్చింది. కేంద్ర మంత్రి, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సహా ఇతర కీలక నేతలు అందరూ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం దాదాపు ఖాయం అయిపోయినట్లు తెలుస్తోంది. బూత్ కమిటీలు, మండల కమిటీలతో సమావేశం అవుతూ ఎన్నికల సంసిద్ధతపై.. నియోజకవర్గాల వారీ నాయకులు పరిశీలన చేస్తున్నారు. ఎక్కడైనా ఏమైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరకించే విషయంపై దృష్టి పెట్టారు. నియోజకవర్గ ఇంఛార్జీలు తమ రాష్ట్ర కమిటీకి సెగ్మెంట్ల వారీగా నివేదికలను అందజేయనున్నారు.
Read Aslo: Congress : వ్యూహాత్మకంగా తెలంగాణ కాంగ్రెస్ - ఈ సారి బీసీ గర్జన ! ఎప్పుడు , ఎక్కడంటే ?