Telangana News: భూముల క్రమబద్ధీకరణకు గడువు పెంపు - 2020 జూన్ 2 కటాఫ్ డేట్
Telangana News: రాష్ట్రంలోని ప్రభుత్వ భూముల్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని చాలా కాలంగా జీవిస్తున్న పేదలు ఆ స్థలాలను క్రమబద్ధీకరించుకునేందుకు సర్కారు మరో అవకాశం ఇచ్చింది.
![Telangana News: భూముల క్రమబద్ధీకరణకు గడువు పెంపు - 2020 జూన్ 2 కటాఫ్ డేట్ Telangana News Land Regulation Due Date Extended in Telangana GO 58 Telangana News: భూముల క్రమబద్ధీకరణకు గడువు పెంపు - 2020 జూన్ 2 కటాఫ్ డేట్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/18/ba7b7cdc4b7e217e3936e450c4f0930c1679110099673519_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Telangana News: తెలంగాణలో దీర్ఘకాలంగా ప్రభుత్వ భూముల్లో స్థిరనివాసం ఏర్పాటు చేసుకొని జీవిస్తున్న పేదలు ఆ స్థలాలను క్రమబద్ధీకరించుకునేందుకు ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చింది. వారికి హక్కులు కల్పించేందుకు మరోసారి దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించింది. సింగరేణి సంస్థకు చెందిన భూముల్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న వారికి కూడా మరోసారి క్రమబద్ధీకరణ వెసులుబాటు కల్పించింది.
పేదల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు జీవో 58, జీవో 59 కింద భూముల క్రమబద్ధీకరణ, హక్కుల బదలాయింపు కోసం మరోసారి దరఖాస్తు చేసుకునే అకాశం కల్పించింది ప్రభుత్వం. కటాఫ్ తేదీని 2020 జూన్ 2వ తేదీ వరకు పొడగించింది. ఈ క్రమంలోనే రెవెన్యూ శాఖ శుక్రవారం రోజు జీవో నెంబర్ 28, 29 జారీ చేసింది. పట్టణాల్లోని భూముల క్రమబద్ధీకరణ దరఖాస్తులకు 30 రోజులు అవకాశం ఇవ్వగా.. సింగరేణి పరిధిలో దరఖాస్తులకు మూడు నెలలు అవకాశం ఇచ్చింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఇటీవల నిర్వహించిన క్యాబినెట్ సమావేశంలో జీవో 58, 59 కింద పట్టణ పేదలకు మరోసారి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో కటాఫ్ తేదీని పొడగించింది.
ఎన్నికల కోడ్ ఎత్తివేయడంతో ఉత్తర్వులు జారీ
అయితే వెంటనే మార్గదర్శకాలు విడుదల చేయాలని భావించినప్పటికీ.. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ రావడంతో ఆగిపోయింది. శుక్రవారం కోడ్ ఎత్తివేయడంతో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సింగరేణి పరిధిలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, కుమురం భీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, పెద్దపెల్లి, జగిత్యాల జిల్లాల పరిధిలో సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్ భూములు నివాసం ఉంటున్నవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడేనాటికి అంటే 2014 జూన్ 2వ తేదీ నాటికి పట్టణాల పరిధిలో ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని నివాసం ఏర్పాటు చేసుకున్న వారికి శాశ్వత హక్కులు కల్పించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు 2014 డిసెంబర్ 30వ తేదీన జీవో 58, 59ను విడుదల చేశారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించారు.
ఆన్ లైన్ ద్వారా తగ్గిన అవినీతి..
పలు కారణాల వల్ల కొందరు దరఖాస్తు చేసుకోలేకపోయారని గుర్తించిన సర్కారు... గత ఏడాది ఫిబ్రవరిలో మరోసారి దరఖాస్తుకు అవకాశం కల్పించింది. ఈ దరఖాస్తుల పరిశీలన కొనసాగుతోంది. సింగరేణి పరిధిలోనూ జీవో 58, 59 కింద 2014లో ఒకసారి, 2019లో మరోసారి దరఖాస్తులకు అవకాశం కల్పించింది. అధికారులు ఆ దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించారు. ఇలా ఇప్పటి వరకు జీవో 58 కింది.. లక్షా 45 వేల 668 మంది పట్టాలు పొందారు. జీవో 59 కింద 42 వేల మందికి వారి ఇండ్లపై హక్కులు సంక్రమించాయి. తాజాగా పేదలకు మరోసారి దరఖాస్తుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. కటాఫ్ తేదీని ఆరేళ్లు పొడగించింది. 2020 జూన్ 2వ తేదీకి మార్చింది. ఈ నిర్ణయంతో లక్షల మందికి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్గనుంది. గతంలో ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణకు పెద్ద ఎత్తున అవినీతి జరిగేది. స్థానిక నాయకులు పెద్ద మొత్తంలో డబ్బులు అడిగేవారు. కానీ తెలంగాణ సర్కారు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు తీసుకోవడం వల్ల చాలా వరకు అవినీతి తగ్గింది.
ఎవరెవరు ఎంత డబ్బులు చెల్లించాలి..
అయితే క్రమబద్ధీకరణకు కొత్త కటాఫ్ తేదీ 2020 జూన్ 2వ తేదీ. అలాగే పట్టణాల్లో దరఖాస్తుల గడువు తేదీ ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఏప్రిల్ 30 వరకు. సింగరేణి పరిధిలో ఏప్రిల్ 1 నుంచి జూన్ 30వ తేదీ వరకు. 125 చదరపు గజాల్లోపు స్థలాలను ఆక్రమించుకొని ఇండ్లు కట్టుకున్న వారికి ఉచితంగా క్రమబద్ధీకరణ. 126-250 చదరపు గజాల వరకు ఆక్రమించిన వారు భూమి మార్కెట్ ధరలో 50 శాతం ఫీజు చెల్లించాలి. 251-500 చదరపు గజాల వరకు విస్తీర్ణంలో ఇండ్లు నిర్మించుకున్న వారు మార్కెట్ ధరలో 75 శాతం ఫీజు చెల్లించి క్రమబబద్ధీకరించుకోవచ్చు. 500 నుంచి వెయ్యి గజాల వరకు ఉంటే ప్రభుత్వ ధరను 100 శాతం చెల్లించాలి. నివాసేతర భూములకు ధర 100 శాతం చెల్లించాలి. మీసేవ కేంద్రాల్లో క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఆ స్థలంలో కటాఫ్ తేదీ కన్నా ముందు నుంచే నివాసం ఉంటున్నట్లు ధ్రువపత్రాలను సమర్పించాలి. ఆర్డీఓ ఛైర్మన్ గా, తహసీల్దార్ సభ్యులుగా ఉండే కమిటీ దరఖాస్తులను పరిశీలించి, తుది నిర్ణయం తీసుకుంటుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)