Harish Rao On Chandrababu: పాపం చంద్రబాబు అరెస్టయ్యారు : హరీష్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు
Harish Rao responds over arrest of Chandrababu: తెలంగాణ మంత్రి హరీష్ రావు చంద్రబాబు అరెస్టుపై స్పందించారు. పాపం చంద్రబాబు నాయుడు అరెస్టైనట్టున్నారు అని కీలక వ్యాఖ్యలు చేశారు.
Harish Rao responds over arrest of Chandrababu:
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్టుపై ఇదివరకే తెలంగాణ మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందించారు. చంద్రబాబు అరెస్ట్ అప్రజాస్వామికమని వ్యాఖ్యానించారు. తాజాగా తెలంగాణకు చెందిన మంత్రి హరీష్ రావు చంద్రబాబు అరెస్టుపై స్పందించారు. పాపం చంద్రబాబు నాయుడు అరెస్టైనట్టున్నారు అని కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, కేసీఆర్ పాలనలో వ్యత్యాసాన్ని వివరించారు.
తన నియోజకవర్గం సిద్దిపేటలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో చంద్రబాబు ఐటీని దేశంలో అగ్రగ్రామిగా నిలిపానని చెప్పుకునేవారు. పాపం ప్రస్తుతం చంద్రబాబు అరెస్టైనట్టున్నారు. దాని గురించి మాట్లాడకూడదు. గానీ గతంలో ఆయన ఎప్పుడూ ఐటీ ఐటీ అని ప్రస్తావించేవారని గుర్తుచేశారు. ప్రస్తుతం సీఎం కేసీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ లో ఐటీ రంగం మరింత అభివృద్ధి జరిగిందన్నారు. అదే సమయంలో పల్లెల్లో వ్యవసాయం అభివృద్ధి చెందింది.. దటీజ్ కేసీఆర్ రూలింగ్ అని వ్యాఖ్యానించారు.
దేశంలో బెంగళూరును ఐటీకి సిలికాన్ సిటీ ఆఫ్ ఇండియా అంటారు, కానీ ఐటీ ఉత్పత్తుల వృద్ధి రేటులో తెలంగాణ నెంబర్ వన్ గా ఉందన్నారు. ఉద్యోగాల కల్పనలో రాష్ట్రం తొలి స్థానంలో ఉందన్నారు. తెలంగాణ వచ్చిన సమయంలో రాష్ట్రంలో 3 లక్షల ఐటీ ఉద్యోగులు ఉంటే, ఇప్పుడు పది లక్షల మంది ఉన్నారని హరీష్ రావు వ్యాఖ్యానించారు. కేసీఆర్ పాలనతో రాష్ట్రంలో ఐటీ ఉద్యోగాలు 3 రెట్లు పెరిగాయని చెప్పారు. ఓ వైపు ఐటీ ఉత్పత్తులు, ఎగుమతులు పెరగడంతో పాటు పల్లెల్లో వ్యవసాయం బాగా జరిగి, ధాన్యాల ఉత్పత్తిలోనే దేశంలో మెరుగైన స్థానంలో తెలంగాణ ఉందన్నారు.