TS High Court: 15 ఏళ్ల బాలిక అలా కలిసినా అత్యాచారమే - TS హైకోర్టు వ్యాఖ్యలు, ఊరటనిస్తూ తీర్పు
Telangana High Court Verdict on Abortion: 15 ఏళ్ల బాలిక ప్రసవించితే మైనర్ అయిన ఆమె వ్యక్తిగత పరువుతో జీవించే హక్కు కోల్పోతుందని ధర్మాసనం అభిప్రాయం వ్యక్తం చేసింది.
![TS High Court: 15 ఏళ్ల బాలిక అలా కలిసినా అత్యాచారమే - TS హైకోర్టు వ్యాఖ్యలు, ఊరటనిస్తూ తీర్పు Telangana High Court permits abortion for girl who raped by relative in Hyderabad TS High Court: 15 ఏళ్ల బాలిక అలా కలిసినా అత్యాచారమే - TS హైకోర్టు వ్యాఖ్యలు, ఊరటనిస్తూ తీర్పు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/01/1bc51f2ae669a9d436b394bb98c9a67a_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Telangana High Court Verdict: అత్యాచారం వల్ల పెళ్లి అవ్వకుండానే అవాంఛిత గర్భం వచ్చిన బాలికకు తెలంగాణ హైకోర్టు ఊరటనిచ్చింది. తన భవిష్యత్తు కోసం అబార్షన్ చేయించుకొనేందుకు అనుమతి కోరగా.. మానవతా దృక్పథంతో ధర్మాసనం వ్యవహరించింది. బాధిత బాలిక గర్భస్రావానికి అనుమతించింది.
అత్యాచారం జరగడం వల్ల వచ్చిన ఆ గర్భాన్ని తొలగించాలని బాలిక కుటుంబ సభ్యులు తొలుత నిలోఫర్ ఆసుపత్రికి వెళ్లారు. అబార్షన్ చేసేందుకు డాక్టర్లు ఒప్పుకోలేదు. దీంతో బాలిక తరఫున ఆమె తల్లి హైకోర్టు మెట్లెక్కింది. ఈ క్రమంలోనే కోర్టు బాధితురాలికి ఊరట కల్పిస్తూ తీర్పు చెప్పింది. 15 ఏళ్ల బాలిక ప్రసవించితే ఆమె మానసిక, శారీరక ఇబ్బందులకు గురవుతుందని పిటిషన్ దారు వాదనతో హైకోర్టు ఏకీభవించింది. గర్భం కారణంగా మైనర్ అయిన బాలిక వ్యక్తిగత పరువుతో జీవించే హక్కు కోల్పోతుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. అత్యాచారం సమయంలో ఆమె ఇష్టపూర్వకంగానే తన బంధువైన అతడితో వెళ్లినా, లైంగికంగా కలిసినా.. అది అత్యాచారం పరిధిలోకే వస్తుందని స్పష్టం చేసింది. చివరికి ఆమె 20 వారాల గర్భాన్ని తొలగించాలని నిలోఫర్ ఆసుపత్రికి సూచించింది.
అసలేం జరిగిందంటే..
ఖమ్మం జిల్లాకు చెందిన ఓ యువకుడి (26)కి పెళ్లై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కొద్ది రోజుల క్రితం ఇతను హైదరాబాద్ వచ్చి బంధువుల ఇంట్లోనే ఉంటున్నాడు. బంజారాహిల్స్‌లోని ఓ బస్తీలో ఉంటుండగా.. వారి ఇంట్లోనే 8 వ తరగతి చదువుతున్న ఆమె కూతురిపై కన్నేశాడు. బాలిక తల్లిదండ్రులు రోజువారీ పనికి బయటకు వెళ్లి మాయమాటలు చెప్పి అత్యాచారం చేశాడు. తల్లిదండ్రులకు చెప్తే చంపుతానని బెదిరించాడు. దీంతో భయపడిన బాలిక ఎవరికీ చెప్పలేదు.
ఆ బాలికకు ఆరోగ్య సమస్యలు రావడంతో తల్లిదండ్రులకు అసలు విషయం చెప్పింది. వారు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి.. నిందితుడ్ని పట్టుకుని రిమాండ్‌కు తరలించారు. బాలిక గర్భం దాల్చినట్లు వైద్య పరీక్షల్లో తేలడంతో అబార్షన్ చేయాలని నిలోఫర్ ఆస్పత్రిని ఆశ్రయించారు. వారు కాదనడంతో హైకోర్టుకు వెళ్లాల్సి వచ్చింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)