CM Jagan Cases: జగన్ అక్రమాస్తుల కేసు: TS హైకోర్టు కీలక ఆదేశాలు, అవి తేలాకే విచారణ చేయాలని ఉత్తర్వులు
సీఎం జగన్ కు సంబంధించి అక్రమాస్తుల కేసుల్లో సీబీఐ తరపున 11, ఈడీ అధికారులు 9 చార్జిషీట్లను గతంలో దాఖలు చేశారు.
Jagan Mohan Reddy Illegal Assets Case: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమ ఆస్తుల కేసు విషయంలో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసుల వ్యవహారంలో మొదట సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్లపైన తేల్చాలని చెప్పింది. సీబీఐ అధికారులు దాఖలు చేసిన ఛార్జిషీట్లపైన తీర్పు వెలువడిన అనంతరమే ఈడీ కేసుల విచారణ కొనసాగించాలని ఆదేశాలు ఇచ్చింది. ఒకవేళ ఈడీ, సీబీఐ కేసులు రెండూ సమాంతరంగా విచారణ చేసినట్లయితే, తీర్పు వెల్లడించే విషయంలో సీబీఐ కేసులు తేలేవరకూ ఈడీ కేసులపై తీర్పు వెల్లడించకూడదని ఉత్తర్వులు ఇచ్చింది.
ఈడీ, సీబీఐ కేసులు రెండూ వేరు వేరని, ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా విచారణ చేపట్టవచ్చని గతంలో సీబీఐ కోర్టు తీర్పు ఇచ్చింది. అయితే, తాజాగా ఆ తీర్పును హైకోర్టు కొట్టివేసింది. ఒకవేళ సీబీఐ కేసులు వీగిపోతే, ఈడీ కేసులు ఉండే ప్రసక్తే లేదని హైకోర్టు చెప్పింది.
సీఎం జగన్ కు సంబంధించి అక్రమాస్తుల కేసుల్లో సీబీఐ తరపున 11, ఈడీ అధికారులు 9 చార్జిషీట్లను గతంలో దాఖలు చేశారు. ఈ ఛార్జిషీట్లపై హైదరాబాద్ సీబీఐ స్పెషల్ కోర్టులో విచారణ జరుగుతూ ఉంది. సీబీఐ కేసులతో సంబంధం లేకుండా తమ కేసులపై విచారణ జరుపుకొనేలా అనుమతించాలని గతంలో సీబీఐ స్పెషల్ కోర్టును ఈడీ కోరింది. ఇందుకు సీబీఐ కోర్టు ఒప్పుకుంటూ తీర్పు ఇచ్చింది. సీబీఐ కేసులతో సంబంధం లేకుండా ఈడీ కేసులను విచారణ చేయొచ్చని చెప్పింది. అయితే, సీబీఐ కోర్టు నిర్ణయాన్ని ఛాలెంజ్ చేస్తూ ఎంపీ విజయసాయి రెడ్డి, జగతి పబ్లికేషన్స్, భారతీ సిమెంట్స్ వేర్వేరుగా హైకోర్టుకు వెళ్లాయి. దీంతో ఆ వాదనలు విన్న హైకోర్టు తాజా ఆదేశాలు ఇచ్చింది. మొదట సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్లపైన తేల్చాలని, అందులో తీర్పు వెలువడ్డాకే ఈడీ కేసుల విచారణ కొనసాగించాలని ఆదేశాలు తాజాగా ఇచ్చింది.