Telangana High Court: టీచర్లను పెళ్లి చేసుకుంటేనే బదిలీ చేస్తామంటే ఎలా? తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్నలు
Telangana High Court: టీచర్ ను పెళ్లి చేసుకుంటేనే ఉపాధ్యాయులను బదిలీ చేస్తామంటే ఎలా అని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
Telangana High Court: టీచర్ ను పెళ్లి చేసుకుంటేనే ఉపాధ్యాయులను బదిలీ చేస్తారా అని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. బదిలీల్లో ఏ ప్రాతిపదికన టీచర్లను వేర్వేరుగా చూస్తున్నారని వివరణ కోరింది. భార్యాభర్తలు ఒకేచోట ఉండాలనే ఉద్దేశంతోనే ప్రత్యేక పాయింట్లు కేటాయించినట్లు ఉన్నత న్యాయస్థానానికి రాష్ట్ర సర్కార్ నివేదించింది. బదిలీలకు సంబంధించిన నిబంధనలను సవరించి ఈనెల 4వ తేదీన అసెంబ్లీ, 5వ తేదీన శాసన మండలిలో ఉంచినట్లు పేర్కొంది. బదిలీల్లో ఉపాధ్యాయ దంపతులకు ప్రత్యేక పాయింట్లు కేటాయింపు వివాదానికి సంబంధించిన పిటిషన్లపై సీజే జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ టి. వినోద్ కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టింది. బదిలీల నిబంధనల్లో ఇటీవల మార్పులు చేసి చట్ట సభల ముందు ఉంచినట్లు అదనపు అడ్వకేట్ జనరల్ జె. రామచంద్రారావు మెమో సమర్పించారు. మెమో, కౌంటర్ ఇవాళ ఇచ్చినందున వాదనలకు సమయం ఇవ్వాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కోరారు.
ఏదో ఒక కారణంతో పిటిషనర్లు కాలయాపన చేస్తున్నారని అన్నారు. అలాగే ఫిబ్రవరి 14వ తేదీ నుంచి స్టే ఉన్నందున బదిలీల ప్రక్రియ నిలిచిపోయినందున త్వరలో విచారణ జరపాలని అదనపు ఏజీ న్యాయస్థానాన్ని కోరారు. విద్యా సంవత్సరం సగానికి వచ్చిందని, ఎన్నికల కోడ్ సమీపిస్తోందని పేర్కొన్నారు. ఈక్రమంలోనే ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు చీటర్ల బదిలీలపై ఈనెల 23వ తేదీన తుది వాదనలు వింటామని వెల్లడించింది. ఇటీవలే తెలంగాణ వ్యాప్తంగా ప్రధానోపాధ్యాయులు స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీలు పదోన్నతులు, బదిలీలపై విద్యాశాఖ జనవరిలో జీవోను జారీ చేసింది. దీనికి తగిన విధంగా జనవరి 27వ తేదీ నుంచి మార్చి 19 వరకు ప్రక్రియ చేపట్టేలా షెడ్యూల్ ను రూపొందించారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 73, 803 మంది టీచర్లు ఇందుకోసం దరఖాస్తు చేసుకోగా.. ఈ బదిలీలు చట్టవిరుద్ధంగా ఉన్నాయని పేర్కొంటూ.. నాన్ స్పాట్ టీచర్ల యూనియన్ ధర్మాసనాన్ని ఆశ్రయించారు.
ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న దంపతులు ఒకే చోట ఉండేందుకు వీలుగా వారికి అదనపు పాయింట్లు కేటాయించడం రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదే సౌకర్యం ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్న దంపతులకు ఇవ్వాలి కదా అని పేర్కొన్నారు. మరోవైపు గవర్నర్ కు కనీసం సమాచారం లేకుండానే ఈ జీవో ఇవ్వడం విద్యా చట్టానికి విరుద్ధమని ఆ పిటిషన్ లో వివరించారు.