Telangana High Court: నలుగురు పోలీసు అధికారులకు జైలు శిక్ష- తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు
పోలీసు అధికారులకు జైలు శిక్ష విధించి తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. భార్యభర్తల వివాదంలో సుప్రీం కోర్టు ఆదేశాలను ధిక్కారించారని కోర్టు అభిప్రాయపడి తీర్పు వెల్లడించింది.
భార్యాభర్తల వివాదం కేసులో సుప్రీం ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆరోపణతో హైకోర్టు తెలంగాణకు చెందిన నలుగురు పోలీసు అధికారులకు శిక్ష విధించింది హైకోర్టు. సుప్రీం నిబంధనల మేరకు సీఆర్‌పీసీ 41ఏ నోటీసు ఇవ్వలేదని అభియోగంపై విచారణ చేపట్టి శిక్ష విధించింది.
నలుగురు పోలీస్ అధికారులకు 4 వారాల జైలు శిక్ష విధించింది తెలంగాణ హైకోర్టు. కోర్టు ధిక్కరణ కేసులో పోలీసు అధికారులకు జైలు శిక్ష విధించింది. జాయింట్ సీపీ శ్రీనివాస్, బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్, జూబ్లీహిల్స్ సీఐ రాజశేఖర్‌రెడ్డి, ఎస్‌ఐ నరేశ్‌కు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది.
ఈ నలుగురికి జైలు శిక్ష విధించడమే కాకుండా శాఖపరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కూడా హైదరాబాద్ సీపీని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. అప్పీలుకు సమయం కావాలన్ని అధికారుల తరఫు న్యాయవాది అభ్యర్థన మేరకు కోర్టు కాస్త ఊరట కల్పించింది. అప్పీలుకు వెళ్లేందుకు వీలుగా ఆరు వారాల పాటు శిక్షళలు నిలివేయాలని ఆదేశించింది.
ఏపీలో అలాంటిదే
గతంలో ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఐఏఎస్ అఫీసర్లు ఇలా కోర్టు ఆగ్రహానికి గురి అయ్యారు. గత నెలలలో ఏపీ హైకోర్టు ముగ్గురు ఐఏఎస్ అధికారులకు జైలుశిక్ష విధించింది. కోర్టు ధిక్కరణ కేసులో ఐఏఎస్ అధికారులు పూనం మాలకొండయ్య, వీరపాండ్యన్, అరుణ్‌కు నెలపాటు జైలు శిక్షతో పాటు రూ.2 వేల జరిమానా విధించింది. అక్కడ కూడా అధికారులు విజ్ఞప్తితో శిక్ష అమలును కోర్టు ఆరు వారాలపాటు నిలిపివేసింది. కర్నూలు జిల్లా వ్యవసాయ సహాయకుడి విషయంలో కోర్టు తీర్పు అమలు చేయలేదని హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది. కోర్టు తీర్పు అమల్లో నిర్లక్ష్యం వహించినందుకు ఐఏఎస్ అధికారలుకు జైలు శిక్ష విధించింది.
అంతకు ముందు కూడా ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులకు రెండు వారాల పాటు జైలు శిక్ష విధించింది. కోర్టు ధిక్కరణపై ఐఏఎస్ లు క్షమాపణలు కోరారు. క్షమాపణలు కోరడంతో జైలు శిక్ష తప్పించి సేవా కార్యక్రమాలు చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది. సంక్షేమ హాస్టళ్లల్లో ప్రతి నెలలో ఓ రోజు వెళ్లి సేవ చేయాలని తీర్పు ఇచ్చింది. ఒక రోజు పాటు కోర్టు ఖర్చులు భరించాలని ఐఏఎస్ లను హైకోర్టు ఆదేశించింది. ఏడాది పాటు హాస్టళ్లల్లో సేవా కార్యక్రమం చేపట్టాలని తీర్పు ఇచ్చింది. పాఠశాలల్లో గ్రామ సచివాలయాల ఏర్పాటు చేయొద్దన్న హైకోర్టు ఆదేశాలను అధికారులు అమలు చేయకపోవడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐఏఎస్ అధికారులు విజయ్ కుమార్, శ్యామలరావు, గోపాల కృష్ణ ద్వివేది, బుడితి రాజశేఖర్, శ్రీలక్ష్మీ, గిరిజా శంకర్, వాడ్రేవు చిన వీరభద్రుడు, ఎంఎం నాయక్ కోర్టు ధిక్కరణ ఎదుర్కొన్నారు. తర్వతా వాళ్లంతా పై కోర్టులో అప్పీలు చేసుకొని కోర్టు ధిక్కరణ నుంచి ఊరట పొందారు