Telangana Latest News: నర్సరీ టు నాలుగో తరగతి- వచ్చే విద్యాసంవత్సరం నుంచి కొత్త స్కూల్స్ ప్రారంభం
Telangana Latest News: తెలంగాణ విద్యావ్యవస్థలో భారీ మార్పులకు ప్రభుత్వం సిద్ధమైంది. కొత్తగా నర్సరీ నుంచి నాల్గో తరగతి వరకు బడి ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

Telangana Latest News: తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని విద్యాశాఖాధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. కొత్తగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి నర్సరీ టు నాల్గో తరగతి వరకు కొత్త పాఠశాలలు ప్రారంభించబోతున్నట్టు వెల్లడించారు. దీనికి ఇప్పటి నుంచి చర్యలు ప్రారంభించాలని సూచించారు. వాళ్లకు స్కూల్‌లోనే టిఫిన్, లంచ్, స్నాక్స్ ఇతర సౌకర్యాలు అందేలా చూడాలని పేర్కొన్నారు.
పైలెట్ ప్రాజెక్టుగా మొదలు కానున్న నర్సరీ టు నాల్గో తరగతి బడుల్లో అన్ని సౌకర్యాలు ఉండాలని చెప్పారు. విద్యార్థులకు సకల సౌకర్యాలు కల్పించాలని చెప్పారు. ఉదయం పాలు, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, ఆటలు ఆడుకునేందుకు గ్రౌండ్, ఉపాధ్యాయులు, ఇలా ఏ విషయంలో కూడా లోటు లేకుండా ఆదర్శంగా తీర్చిదిద్దాలని సూచించారు. తన నివాసంలో విద్యాశాఖపై సమీక్ష నిర్వహించిన రేవంత్ రెడ్డి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించారు.
ముందుగా హైదరాబాద్‌లో ఆదర్శ స్కూల్స్‌ను రెడీ చేయాలని రేవంత్ సలహా ఇచ్చారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న కోర్ ఆర్బన్ ప్రాంతంలో ఉన్న బడులపై ఫోకస్ పెట్టాలన్నారు. కార్పొరేట్ స్కూల్స్‌కు ధీటుగా ఉండాలని అన్నారు. పిల్లలు ఆడుకునేందుకు గ్రౌండ్, అధునాతనమైన క్లాస్‌రూమ్‌లు, మంచి వాతావరణం ఉండాలని తెలిపారు. అక్కడ విద్యార్థులకు ఎలాంటి లోటు ఉండకూడదని పదే పదే సూచించారు.
కొత్తగా ఏర్పాటు చేయబోయే స్కూల్స్‌కు ప్రభుత్వం స్థలాలను గుర్తించాలని అధికారులకు సూచించారు రేవంత్ రెడ్డి. సమీపంలో ఉన్న ప్రభుత్వ స్థలంలో ఏర్పాటు చేయాలన్నారు. ఇప్పుడు ఉన్న స్కూల్ పరిధిలో విశాలమైన స్థలం ఉంటే లేకుంటే ప్రభుత్వ స్థలం ఉన్న ప్రాంతానికి బడిని తరలించాలని చెప్పారు. పేదలకు మెరుగైన విద్య అందించేందుకు విలైనంత త్వరగా కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు.





















