Telangana News: ప్రభుత్వ భవనాలపై సోలార్ పవర్ ప్లాంట్స్, డిజైన్స్ పంపాలని కలెక్టర్లకు భట్టి విక్రమార్క ఆదేశాలు
Bhatti Vikramarka | గ్రామ పంచాయతీల నుంచి సెక్రటేరియట్ వరకు తెలంగాణలోని అన్ని ప్రభుత్వ భవనాలపై సోలార్ పవర్ ప్లాంట్స్ ఏర్పాటు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.

Solar Power Plants at Govt Officies | హైదరాబాద్: సోలార్ విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుందని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. గ్రామ పంచాయతీల నుంచి సెక్రటేరియట్ వరకు అన్ని భవనాలపై సోలార్ పవర్ ప్లాంట్స్ ఏర్పాటు చేస్తామన్నారు. హైదరాబాద్‌లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో శనివారం నాడు ప్రభుత్వ భవనాలపై సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటు, ఆర్ఓఎఫ్ఆర్ భూముల్లో ఇందిరా సౌర గిరిజన వికాసం పథకం (Indira Soura Giri Jala Vikasam Scheme) అమలుపై జిల్లా కలెక్టర్లతో భట్టి విక్రమార్క సమీక్షించారు. ఈ సమావేశంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ నవీన్ మిట్టల్, SPDCL సిఎండి ముషారఫ్ ఫారుకి, రెడ్కో సిఎండి అనిలా తదితరులు పాల్గొన్నారు.
అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాలు, పార్కింగ్, క్యాంటీన్ ప్లాన్లు హైదరాబాద్ కు పంపాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్లు అన్నీ కూడా ఒకే నమూనాలో నిర్మించినందున సోలార్ పవర్ ప్లాంట్ (Solar Power Plants)లో ఏర్పాటుకు అవసరమైన డిజైన్లు హైదరాబాద్ నుంచి పంపిస్తామని చెప్పారు. కలెక్టరేట్లలో ఏమైనా మంచి డిజైన్లు ఉంటే కనుక వాటిని హైదరాబాద్ కు పంపాలని ఈ సందర్భంగా కలెక్టర్లకు ఆయన సూచించారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో సోలార్ పవర్ ప్లాంట్స్
గ్రామపంచాయతీ మొదలుకొని సెక్రటేరియట్ వరకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సోలార్ పవర్ ప్లాంట్ లు ఏర్పాటుచేస్తామన్నారు. వాటి ద్వారా పెద్ద ఎత్తున విద్యుత్ ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపారు. సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు అవసరమైన వివరాలకు సంబంధించి కలెక్టర్లు హైదరాబాద్ కు పంపాల్సిన వివరాలకు సంబంధించి ఒక ప్రశ్నావళిని పంపించారు. అందులో అన్ని వివరాలు నమోదు చేసి వారం లోపు విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఆఫీసుకి పంపాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు.

ప్రభుత్వ భవనాలతో పాటు ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు, ఉన్నత విద్యాసంస్థల భవనాలపై తెలంగాణ ప్రభుత్వం సోలార్ పవర్ ప్లాంట్ లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. అందుకు సంబంధించిన భవనాల వివరాలు పంపాలని కలెక్టర్లను భట్టి విక్రమార్క ఆదేశించారు. నీటిపారుదల శాఖ, రోడ్లు భవనాల శాఖ పరిధిలో ఖాళీ స్థలాలు ఉన్నాయని, వాటి వివరాలు సైతం పంపాలని కలెక్టర్లకు సూచించారు.
నల్లమల డిక్లరేషన్ ప్రకటించిన ప్రభుత్వం
గత కాంగ్రెస్ ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంతాల్లో ఆర్ ఓ ఎఫ్ ఆర్ చట్టం కింద 6.70 లక్షల ఎకరాల భూములను పంపిణీ చేసింది. ఈ భూముల్లో నల్లమల డిక్లరేషన్ కింద ఇందిరా సౌర గిరి జల వికాసం పథకం ద్వారా ఉచితంగా సోలార్ పంపుసెట్లు ఏర్పాటు చేస్తామని కలెక్టర్లకు భట్టి విక్రమార్క వివరించారు. నల్లమల డిక్లరేషన్ (Nallamala Declaration)లో భాగంగా ఇప్పటికే అచ్చంపేట నియోజకవర్గంలో ప్రారంభించాం. ఈ ఆగస్టు నెలలోనే ఆదిలాబాద్ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో ప్రారంభించే ఆలోచనలోప్రభుత్వం ఉంది. ఇందిరా సౌర గిరిజల వికాసం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కనుక కలెక్టర్లు దీనిపై సత్వరం స్పందించి వారంలోగా వివరాలు పంపండి, ఈ విషయాల్లో ఏమైనా సందేహాలు ఉంటే విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ సీఎండీలు, REDCO VC&MD ని సంప్రదించాలని’ కలెక్టర్లను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు.






















