Miss World 2025: మిస్ వరల్డ్ ఏర్పాట్లను సమీక్షించేందుకు హైదరాబాద్‌కు వచ్చిన మిస్ వరల్డ్ లిమిటెడ్ సీఈవో జూలియా మోర్లి
Miss World 2025 In Hyderabad | తెలంగాణ వేదికగా త్వరలోొ ప్రారంభం కానున్న మిస్ వరల్డ్ 2025 పోటీల ఏర్పాట్లను పరిశీలించేందుకు మిస్ వరల్డ్ లిమిటెడ్ సీఈవో, చైర్ పర్సన్ జూలియా మోర్లి హైదరాబాద్‌కు వచ్చారు.

Julia Evelyn Morley, Chairperson & CEO, Miss World Limited, London | హైదరాబాదులో జరగనున్న మిస్ వరల్డ్ 2025 పోటీల ఏర్పాట్లను సమీక్షించేందుకు టీమ్ నగరానికి వచ్చింది. లండన్ లోని మిస్ వరల్డ్ లిమిటెడ్ సీఈవో, చైర్ పర్సన్ జూలియా ఈవేలిన్ మోర్లి శుక్రవారం (మే 2న) ఉదయం హైదరాబాద్ కు చేరుకున్నారు. శుక్రవారం ఉదయం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న జూలియాకి సాంప్రదాయపద్ధంగా ఘన స్వాగతం పలికారు. త్వరలో నిర్వహించనున్న మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ కోసం జరుగుతున్న ఏర్పాట్లతో పాటు, మిస్ వరల్డ్ కాంటెండర్స్ పర్యటించే పలు ప్రాంతాల లో చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించనున్నారు. మిస్ వరల్డ్ ఈవెంట్లకు సంబంధించిన అంశాలపై జూలియా మోర్లి సంబంధిత ఏజెన్సీలు, పలు విభాగాల అధికారులు, ప్రతినిధులతో సమీక్షించనున్నారు.
ప్రతిష్టాత్మక అందాల వేడుకకు తెలంగాణ వేదిక
మిస్ వరల్డ్ పోటీలు అంటే ప్రపంచంలోనే ఓ అరుదైన వేడుక. వివిధ దేశాల నుంచి అందగత్తెలు పాల్గొనే ఈ వేడుకలకు ఈసారి తెలంగాణ వేదికగా మారింది. హైదరాబాద్ వేదికగా జరగనున్న ఈ అందాల వేడుకలకు ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ ఈవెంట్ తో సత్తా చాటాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ప్రపంచ దేశాలన్ని హైదరాబాద్ వైపు చూసే రోజు దగ్గర్లో ఉంది. ఈ ఏడాది మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్‌లో నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. దీంతో 72వ మిస్ వరల్డ్ పోటీలకు తెలంగాణ రాజధాని హైదరాబాద్ ఆతిథ్యం ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు చాటేందుకు ఇదే అరుదైన అవకాశమని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
ఈ మే నెలలో 4 వారాల పాటు జరిగే ఈ పోటీల గ్రాండ్ ఫినాలేనతో పటు ప్రారంభ, ముగింపు వేడుకలు సైతం హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. మిస్ వరల్డ్ ఫెస్టివల్‌లో 120కి పైగా దేశాలు పాల్గొంటాయి. బ్యూటీ విత్ ఎ పర్పస్ అనే లక్ష్యంతో జరిగే అందాల పోటీల్లో పాల్గొనే దేశ విదేశాల ప్రతినిధులకు రాష్ట్రం స్వాగతం పలకబోతుంది. మే 7 నుంచి ఈ అందాల పోటీలు ప్రారంభం కానుండగా మే 31న గ్రాండ్ ఫినాలే జరగనుంది.
పర్యాటక రంగంపై తెలంగాణ సర్కార్ ఫోకస్, ఇదే మంచి ఛాన్స్
గతంలో న్యూఢిల్లీ, ముంబైలో మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించారు. ముంబై 71వ ఎడిషన్ లో భాగస్వామి అయింది. ప్రపంచంలోనే అత్యుత్తమ మౌలిక సదుపాయాలున్న నగరమైన హైదరాబాద్ ఇదివరకే పలు అంతర్జాతీయ వేడుకలకు వేదికగా మారింది. ఐటీ, ఫార్మాసూటికల్ సహా పలు రంగాల్లో దూసుకెళ్తున్న తెలంగాణకు ఈ అవకాశం రావడం గొప్ప విషయమే. తెలంగాణను పర్యాటక రంగంలో, బ్యూటీ రంగంలో ప్రపంచ పటంలో నిలబెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. తెలంగాణ జరూర్ ఆనే నినాదంతో టూరిజం శాఖ ప్రపంచ వ్యాప్తంగా ఈ వేడుకలకు సంబంధించి ఇదివరకే ఆహ్వానాలు పంపింది. గొప్ప చేనేత వారసత్వం, అరుదైన వంటకాలు, అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు, విభిన్నమైన కళా వారతస్వమున్న రాష్ట్రం తెలంగాణలో మిస్ వరల్డ్ ఈవెంట్ నిర్వహణను మిస్ వరల్డ్ లిమిటెడ్ చైర్మెన్, సీఈఓ జూలియా మోర్లీ స్వాగతించారు. ఈ విషయాన్ని, తెలంగాణ పర్యాటక శాఖ కార్యదర్శిగా ఉన్న సమయంలో స్మితా సబర్వాల్ అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు.






















