Telangana Elections 2023: కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేకి షాక్ ఇవ్వనున్న కార్మికులు, భారీగా నామినేషన్లతో నిరసన సెగ
Quthbullapur MLA: తమ సమస్యలు పట్టించుకోకుండా కాలయాపన చేసిన నేతలకు నిరసనగా కార్మికులు భారీ సంఖ్యలో నామినేషన్ వేయడానికి సిద్ధమవుతున్నారు.
BRS MLA Vivekananda: జీడిమెట్ల : అయిదేళ్లు ఎలా గడిచినా సరే, ఓటింగ్ సమయంలో సామాన్యుడు తన గళాన్ని వినిపించేందుకు సిద్ధమవుతాడు. తమ సమస్యలు తీర్చని నేతలు, తమ కష్టాలను పట్టించుకోని ప్రజా ప్రతినిధులను ఇంటికి పంపే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని చోట్ల ఎమ్మెల్యేలను తమ గ్రామంలోకి అడుగు పెట్టనీయకుండా ప్రజలు అడ్డుకుంటున్నారు. కొన్నిచోట్ల గట్టిగానే తమ సమస్యలపై ఎమ్మెల్యేలను, మంత్రులను నిలదీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. తాజాగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఇలాంటి పరిస్థితినే స్థానిక ఎమ్మెల్యే వివేకానంద ఎదుర్కోబోతున్నారు.
జీడిమెట్ల తమ సమస్యలు పట్టించుకోకుండా కాలయాపన చేసిన నేతలకు నిరసనగా కార్మికులు భారీ సంఖ్యలో నామినేషన్ వేయడానికి సిద్ధమవుతున్నారు. జీడిమెట్ల బస్ డిపో వద్ద వల్ల సూపర్ మాక్స్ కంపెనీ లో విధులు నిర్వహిస్తున్న 1000 మంది కార్మికులు తమకు 18 నెలల నుంచి జీతభత్యాలు రావడం లేదని గత కొన్ని నెలలుగా కంపెనీ వద్ద నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. ఇదే అంశంపై తమ సమస్యను పరిష్కరించాల్సిందిగా ప్రభుత్వంలో ఉన్న పెద్ద స్థాయి అధికారులను కలవడమే కాకుండా మంత్రి మల్లారెడ్డిని, స్థానిక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత కేపీ వివేకానందను, ఎమ్మెల్సీలను కలిసి వినతి పత్రాలు గతంలో అందజేశారు. పలుమార్లు ప్రజాప్రతినిధులు సమస్యను తప్పకుండా పరిష్కరిస్తామంటూ హామీ ఇచ్చినప్పటికీ అది ఇప్పటివరకు నెరవేరలేదు. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ కుత్బుల్లాపూర్ మీదుగా నర్సాపూర్ వెళ్లే గ్రామంలో ఆయనను కేపీ వివేకానంద సమక్షంలో కలిసేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ అది జరగలేదు. నాటి నుంచి నేటి వరకు వారి సమస్య అలాగే ఉండిపోయింది.
నామినేషన్ల ద్వారా నిరసనగలం..
అయితే సూపర్ మాక్స్ కంపెనీ లో ఉన్న మూడు యూనియన్ల లో ఉన్న 1000 మంది కార్మికులు ఎన్నికల వేల ప్రభుత్వానికి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఎన్ని మార్లు విజ్ఞప్తులు చేసిన తమ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో కుత్బుల్లాపూర్ నియోజక వర్గం ఎన్నికల బరిలో నిలిచేందుకు కార్మికులు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో మంగళవారం పెద్ద ఎత్తున కార్మికులు కుత్బుల్లాపూర్ రిటర్నింగ్ కార్యాలయం తరలివచ్చి నామినేషన్ పత్రాలు తీసుకున్నారు. ప్రస్తుతానికి 36 మంది నామినేషన్ పత్రాలు తీసుకున్నామని మరింతగా కార్మికులు దాదాపుగా 200 నామినేషన్లు దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నామని కార్మిక నేతలు వెల్లడించారు. తమ నిరసనగాలాన్ని వినిపించేందుకే నామినేషన్ దాఖలు చేయడానికి సిద్ధమయ్యామని వారు పేర్కొన్నారు.