Revanth Reddy : "దేశ భద్రతను ట్రంప్ దగ్గర మోదీ ప్రభుత్వం తాకట్టు పెట్టింది"
Revanth Reddy : ప్రధానమంత్రి మోదీపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు. పాకిస్తాన్‌ను డీల్ చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. అమెరికా ఒత్తిడికి లొంగిపోయారంటూ విమర్శించారు.

Revanth Reddy : పాకిస్తాన్ పని పట్టాలని వీర తిలకం దిద్ది ప్రదానమంత్రి మోదీని యుద్ధానికి పంపిస్తే అమెరికా ఒత్తిడికి లొంగిపోయారని తెలంగాణ సీఎం ఆరోపించారు. సైన్యం చేసిన సాహసానికి గుర్తుగా జైహింద్ యాత్ర చేపట్టింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. ఈ సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు. మోదీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు.
ఉగ్రవాదులను ప్రాణాలతో వదలొద్దని చెప్పాం: రేవంత్
సభలో రేవంత్ రెడ్డి ఏమన్నారంటే...."పహల్గామ్‌లో భారతీయుల గుండెల్లో తూటాలు దించిన ఒక్కరు కూడా ప్రాణాలతో ఉండొద్దని ఆనాడు నెక్లెస్ రోడ్ వేదికగా నినదించాం. ప్రపంచ పటంలో పాకిస్తాన్ కనిపించొద్దని, దీని కోసం ప్రధానికి మనమంతా మద్దతుగా ఉంటామని ప్రకటించాం. అఖిలపక్ష భేటీకి హాజరై రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే స్పష్టంగా కేంద్రానికి మద్దతు పలికారు."

చైనా, పాకిస్తాన్‌కు బుద్దిచెప్పిన నాయకురాలు ఇందిర: రేవంత్
ఈ దెబ్బకు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను కలుపుకోవడం మంచిదని పదే పదే ఇదే విషయం కేంద్రానికి కాంగ్రెస్ చెప్పిందని అన్నారు రేవంత్ రెడ్డి. యుద్ధం చేయాల్సిన టైంలో కేంద్రం ఎందుకు వెనక్కి తగ్గిందో ఎవరికీ అర్థం కాలేదన్నారు తెలంగాణ సీఎం. "పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను భారత్‌లో కలుపుకునేందుకు పాక్‌పై యుద్ధం చేయాలని, రాజకీయాలకు అతీతంగా అండగా ఉంటామని స్పష్టం చేశాం. కానీ నాలుగు రోజుల యుద్ధం తరువాత ఏం జరిగిందో గానీ అర్ధాంతరంగా మోదీ ప్రభుత్వం యుద్ధాన్ని ముగించింది. యుద్ధ విరమణ చేసే ముందు ఎందుకు అఖిలపక్షం అభిప్రాయం తీసుకోలేదు?, గుండెల్లో ధైర్యం ఉన్న నాయకుడే యుద్ధ తంత్రాన్ని నడిపించగలడు. ఆనాడు చైనాపై యుద్ధం ప్రకటించి చైనాకు గట్టిగా బుద్ధి చెప్పిన ఘనత ఇందిరమ్మది" అని రేవంత్ గుర్తు చేశారు.
పాకిస్తాన్, చైనాను ఎదురించడంలో మోదీ విఫలం : రేవంత్
ఇప్పుడే కాదని మనల్ని కవ్విస్తున్న పాకిస్తాన్, చైనాలకు బుద్ధి చెప్పడంలో మోదీ పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు రేవంత్. సైనికులను, భారతీయులను పొట్టన పెట్టుకున్నా పట్టించుకోరా అని ప్రశ్నించారు. "మన ఆర్మీ జవాన్ కల్నల్ సంతోష్‌ను చైనా పొట్టన పెట్టుకుంటే మోదీ కనీసం చైనాకు బుద్ధి చెప్పే ప్రయత్నం చేయలేదు. 1971లో భారత్- పాక్ యుద్ధ సమయంలో అమెరికా మధ్యవర్తిత్వం అవసరం లేదని నిర్మొహమాటంగా చెప్పిన ధీశాలి ఇందిరమ్మ. ఆనాటి యుద్ధంలో ఇందిరమ్మ పాకిస్తాన్‌ను రెండు ముక్కలు చేసి చూపారు. ఇందిరమ్మ స్ఫూర్తితో పాకిస్థాన్‌ను రెండు ముక్కలు చేయాలని.. ఇందుకు మద్దతుగా ఉంటామని నేను ప్రకటించా…. అని అన్నారు.
ట్రంప్ ఒత్తిడితో అందివచ్చిన ఛాన్స్ వదిలేశారు: రేవంత్
పదే పదే ఉగ్రదాడులు చేస్తూ దేశాన్ని అస్థిరపరిచేందుకు యత్నిస్తున్న పాకిస్తాన్ అంతు తేల్చాలని సూచించామన్నారు రేవంత్. యుద్ధం చేసి ప్రపంచపటం నుంచి పాకిస్తాన్ లేకుండా చేయమని వీర తిలకం దిద్ది పంపిచామని గుర్తు చేశారు. ఆయన మాత్రం ట్రంప్‌నకు లొంగిపోయారని ఎద్దేవా చేశారు. ఉత్త చేతులతో వెనక్కి వచ్చింది కాకుండా నేడు తిరంగా ర్యాలీలు దేనికని ప్రశ్నించారు. "దేశ ప్రజలు వీరతిలకం దిద్ది యుద్ధం చేయమంటే ట్రంప్ చెప్పాడని మోదీ యుద్ధం విరమించారు. మరి ఇవాళ దేనికోసం బీజేపీ నేతలు తిరంగా ర్యాలీ నిర్వహిస్తున్నారు? యుద్ధం మీ సొంత వ్యవహారం కాదు… దేశ భద్రత అంశం మోదీ ప్రభుత్వం దేశ భద్రతను ట్రంప్ దగ్గర తాకట్టు పెట్టారు." అని మండిపడ్డారు.

తిరంగా ర్యాలీలు ఎందుకూ: రేవంత్
అమెరికా ఒత్తిడితో వెనక్కి తగ్గి సైన్యం ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీశారని మండిపడ్డారు రేవంత్. మోదీ పని అయిపోయిందని అన్నారు. భవిష్యత్ నాయకుడు రాహుల్ గాంధీ మాత్రమేనని చెప్పుకొచ్చారు. " భారత సైనికుల ఆత్మస్థైర్యాన్ని బీజేపీ దెబ్బతీస్తే… వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు కాంగ్రెస్ జైహింద్ యాత్ర చేపట్టింది. దేశం కోసం ప్రాణాలు అర్పించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది, గాంధీ కుటుంబానిది. మోదీ కాలం చెల్లిన నాణెంలాంటి వారు… దేశానికి రాహుల్ గాంధీ లాంటి నాయకుడు కావాలి… రాహుల్ గాంధీని దేశానికి ప్రధానిగా చూసే వరకు మనం విశ్రమించొద్దు." అని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి.






















