Revanth Reddy: చంద్రబాబు, వైఎస్సార్ హైదరాబాద్ అభివృద్ధికి కృషి చేశారు: రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు
Telangana News | హైదరాబాద్ అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో జరిగిందని, బీజేపీ నేతలు కలిసొస్తే హైదరాబాద్, తెలంగాణను అభివృద్ధి చేసుకుందామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
Telangana CM Revanth Reddy | హైదరాబాద్: హైదరాబాద్ నగరం అంశంపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. చారిత్రక కట్టడాలతో హైదరాబాద్ అద్భుత నగరంగా విలసిల్లిందన్నారు. హైదరాబాద్ ను రాబోయే వందేళ్ల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని హైడ్రాను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. భిన్నాభిప్రాయాలున్నప్పటికీ చంద్రబాబు, వైఎస్సార్ హైదరాబాద్ అభివృద్ధికి కృషి చేశారు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘హైదరాబాద్‌లో చెరువులు ఆక్రమణకు గురయ్యాయి. అందుకే ఈ ఆక్రమణలను నియంత్రించే బాధ్యత హైడ్రా తీసుకుంటుంది. గతంలో గంటకు 2 సెం.మీ వర్ష పడటాన్ని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ లో డ్రైనేజ్ వ్యవస్థ రూపొందించారు. అయితే వాతావరణ మార్పులతో కుంభవృష్టి వరదలు వస్తున్నాయి. హైదరాబాద్ లో వర్షాల సమయంలోనూ సమస్యల శాశ్వత పరిష్కారానికి హైడ్రాను ఏర్పాటు చేస్తున్నాం.
హైదరాబాద్‌కు జలాలు తెచ్చింది కాంగ్రెస్
హైదరాబాద్ లో నాళాలు ఆక్రమణ చేయాలంటేనే గుండెల్లో గుబులు పుట్టే వ్యవస్థను తీసుకువస్తాం. నగర ప్రజల ఇబ్బందులు తొలగించాలని ప్రణాళికలు రూపొందిస్తున్నాం. హైదరాబాద్ సిటీకి కాంగ్రెస్ ప్రభుత్వం 1965లో మంజీరా జలాలు, 1982 సింగూరు జలాలు, 2004లో కృష్ణా ఫేజ్-1, అదే విధంగా 2008 కృష్ణా ఫేజ్-2 ద్వారా తాగునీరు అందించింది. కృష్ణా ఫెజ్-3 90శాతం పనులు 2014లో కాంగ్రెస్ పూర్తి చేసింది. కానీ 2015లో తామే తెచ్చినట్లు టీఆర్ఎస్ నేతలు ప్రచారం చేసుకున్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిన అభివృద్ధిని తామే చేసినట్లు ప్రచారం చేసుకున్నారు.
హైదరాబాద్ నగరాన్ని మంచి ప్రణాళికతో అభివృద్ధి చేయబోతున్నాం. ఎక్కువ వర్షం పడినపుడు రోడ్లపై నీళ్లు నిలవకుండా డిజైన్ చేయాలని అధికారులకు సూచించాం. 141 ప్రాంతాలను గుర్తించి డిజాస్టర్ మేనేజ్ మెంట్ (Disaster Management) సిబ్బందిని అప్రమత్తం చేసేలా చర్యలు చేపట్టాం. బీఆరెస్ నేతలు హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయంటూ పదే పదే కాంగ్రెస్ ప్రభుత్వంపై నిందలు వేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ బీఆర్ఎస్ హయాంలో సంతోష్ నగర్ సింగరేణి కాలనీలో గంజాయి మత్తులో బాలికను రేప్ చేస్తే కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించిన పాపాన పోలేదు. దిశ ఘటనలో ఆ కుటుంబాన్ని సైతం పరామర్శించ లేదు. మొయినాబాద్ దగ్గర టీఆరెస్ నాయకుడు రేప్, మర్డర్ చేస్తే చర్యలు తీసుకోలేదు’ అని రేవంత్ రెడ్డి ప్రసంగించారు. మిరాలం చెరువుపై 2.6కి.మీ సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మిస్తాం, లండన్ ఐ లాంటి టవర్ ను మిరాలం చెరువులో నిర్మిస్తామని రేవంత్ అన్నారు.
బీజేపీ కలిసి వస్తే అభివృద్ధి..
‘హైదరాబాద్ నగర అభివృద్ధికి అందరి సలహాలు తీసుకోవాలని భావిస్తున్నాం. బీజేపీ ఎమ్మెల్యేలు మాతో కలిసి రండి. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన అనుమతులు, నిధులను ఉమ్మడిగా అడిగి తెచ్చుకుందాం. తెలంగాణను, హైదరాబాద్ నగరాన్ని కలిసి అభివృద్ధి చేసుకుందాం. గత ప్రభుత్వం తమ కోసమే ప్రగతి భవన్, ఆఫీసు కోసం సచివాలయం నిర్మించింది కానీ ప్రజల కోసం కాదు. అభివృద్ధి కోసం కలసి పనిచేద్దామని చెప్పినా, తన పాత్ర మిత్రుడికి కోపం వస్తుందని కిషన్ రెడ్డి ముందుకు రాలేదు’ అన్నారు.