Revanth Reddy: ప్రధాని మోదీ చెప్పే అబద్దాలకు నా జవాబు ఇదే- మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి
Maharashtra Elections | తెలంగాణలో ఆరు గ్యాంరటీల అమలుపై ప్రధాని నరేంద్ర మోదీ అవాస్తవాలు మాట్లాడుతున్నారు. వాటికి నిజాలు ఏంటో మేం చెబుతాం అంటున్నారు రేవంత్ రెడ్డి.
Telangana News | తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీలపై ప్రధాని మోదీ అబద్దపు ప్రచారం చేస్తున్నారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆక్షేపించారు. ప్రధాని మోదీ అబద్దాలు చెబుతుంటే తాను నిజాలు ప్రచారం చేసేందుకే మహారాష్ట్ర వచ్చానని తెలిపారు. ఇవాళ ఆయన మహారాష్ట్ర లో ఎన్నికల ప్రచారం సందర్భంగా మీడియాతో మాట్లాడారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు , హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుక్కు, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఏఐసీసీ జాతీయ మీడియా కమిటీ ఛైర్మన్ పవన్ ఖేరా, డీసీసీ అధ్యక్షులు రోహిన్ రెడ్డి పాల్గొన్నారు.
మహారాష్ట్రలోనే ఎక్కువ రైతు ఆత్మహత్యలు
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మహారాష్ట్ర బీజేపీ నేతలు కొద్దిరోజులుగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. అందుకే నేను మహారాష్ట్ర ప్రజలకు తెలంగాణలో ఆరు గ్యారంటీల అమలుపై నిజాలు చెప్పడానికి ఇక్కడకు వచ్చానన్నారు. దేశంలో మహారాష్ట్రలోనే ఎక్కువ రైతు ఆత్మహత్యలు జరిగాయని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు సంక్షేమాన్ని మరిచాయాయని విమర్శించారు. రైతుల సంక్షేం గాలికి వదిలిన ప్రధాని మోదీ రైతులకు వ్యతిరేకంగా నల్లచట్టాలు తెచ్చి అదానీ, అంబానీలకు మేలు చేయాలని భావించారని ఆరోపించారు. తమ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చాక ఆరు గ్యారంటీల్లో భాగంగా రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చామని, ఆ మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన 25 రోజుల్లో 22,22,067 మంది రైతులకు రూ.17,869 కోట్లు మాఫీ చేసినట్లు తెలిపారు. ఎవరికైనా ఈ విషయంలో అనుమానాలు ఉంటే తమ ప్రభుత్వం పూర్తి వివరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉందన్నారు.
మా సమాధానంతో మోదీ ట్వీట్ డిలీట్ చేశారు
తెలంగాణ రైతుల విషయంలో మోదీ విమర్శలకు తెలంగాణ ప్రభుత్వం సరైన సమాధానం ఇచ్చామని, ఆ తర్వాతే ప్రధాని మోదీ తాను చేసిన ట్వీట్ ను తిరిగి డిలీట్ చేశారని రేవంత్ చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన పది నెలల్లోనే 50వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసినట్లు తెలిపారు. ఆరు గ్యారంటీల్లో హామీ ఇచ్చిన మహాలక్ష్మీ పథకం ద్వారా రూ.500లకే గ్యాస్ అందిస్తున్నామని, ఇప్పటివరకు దాదాపు 50 లక్షల మంది 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ద్వారా లబ్ది పొందుతున్నారని చెప్పారు. రైతుల పండించిన వరికి రూ.500 మద్దతు ధర అందిస్తున్నామన్నారు.
తెలంగాణలో 1 కోటి 4 లక్షల మంది మహిళలు ఈ పది నెలల్లో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం వినియోగించుకున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇందుకోసం రూ.3541 కోట్లు ఆర్టీసీకి ప్రభుత్వం అందించిందన్నారు. తమ రాష్ట్రంలో సామాజిక న్యాయం అందించేందుకు తెలంగాణలో కులగణన చేపట్టామని, 2025 జనగణనలో తెలంగాణ కులగణనను పరిగణనలోకి తీసుకోవాలని కేబినెట్ లో తీర్మానం చేసి.. ప్రధాని మోదీని డిమాండ్ చేసినట్లు రేవంత్ మీడియా సమావేశంలో చెప్పారు.
దేశచరిత్రలో మహారాష్ట్రకు ప్రత్యేక స్థానం
దేశ గతిని మార్చిన ఎందరో మహానుభావులకు మహారాష్ట్ర గడ్డ జన్మనిచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి మహరాష్ట్ర ఎన్నికల సందర్భంగా అన్నారు. మహాత్మా జ్యోతిబాపూలే, బాలగాంగధర్ తిలక్, సావిత్రిబాయి పూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వంటి ఎందరో మహానుభావులు ప్రజల్లో చైతన్యం నింపి దేశానికి ఒక దారి చూపిన నేతలంతా ఈ గడ్డపైనే పుట్టారని కొనియాడారు. ఇంతటి ఘనత ఉన్న మహారాష్ట్ర ఎవరి చేతుల్లోకో వెళ్లకూడదని దేశానికి మేలు చేసే వాళ్ల చేతుల్లోనే ఉండాలని మహారాష్ట్ర ప్రజలకు సూచించారు. మహారాష్ట్రకు రావాల్సిన 17 మెగా ప్రాజెక్టులు మోదీ గుజరాత్ కు తరిలించుకొని పోయారని , మిమ్మల్ని మోసం చేసిన బీజేపీని ఈ ఎన్నికల్లో ఓడించండని రేవంత్ మహరాష్ట్ర ఓటర్లకు పిలుపునిచ్చారు.