Telangana Bharosa Sabha: మా పథకాలు కాపీ కొట్టారు, కానీ అమలు చేయలేదు - సీఎం కేసీఆర్ పై మాయావతి సెటైర్లు
BSP Telangana Bharosa Sabha: తెలంగాణలో తమ పార్టీ తరఫున సీఎం అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని తెలంగాణ భరోసా సభలో మాయవతి ప్రకటించారు.
BSP Telangana Bharosa Sabha: రాజ్యాంగాన్ని తొలగించాలన్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించాలని, సీఎం కేసీఆర్ ను ఓడించాలని ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణలో తమ పార్టీ తరఫున సీఎం అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని హైదరాబాద్ లో నిర్వహించిన తెలంగాణ భరోసా సభలో మాయవతి ప్రకటించారు. విలువైన ఐపిఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజల కోసం పోరాడుతున్న వ్యక్తి ప్రవీణ్ కుమార్ అన్నారు. తెలంగాణలో మన బహుజన రాజ్యం వస్తుందని నమ్ముతున్నానని తెలిపారు. బీఎస్పీ యూపీలో తీసుకొచ్చిన పథకాలను తెలంగాణ సీఎం కేసీఆర్ కాపీ కొట్టారని మాయావతి వ్యాఖ్యానించారు.
తెలంగాణ ఏర్పాటుకు మద్దతు తెలిపిన తొలి పార్టీ బీఎస్పీ
ఉత్తరప్రదేశ్ తరహాలో తెలంగాణలోనూ బీఎస్పీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. రాబోయే ఎన్నికల్లో గెలవాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పార్లమెంట్ లో మద్దతు తెలిపిన మొట్టమొదటి పార్టీ బీఎస్పీ. యూపీలో తమ హయాంలో పేదలకు ఇళ్లు కట్టించి ఇచ్చామన్నారు మాయావతి. భూమి లేని పేదలకు ఉచితంగా భూమి పంచాము. కానీ బీఎస్పీ పథకాలను ఇక్కడ కేసీఆర్ కాపీ కొడుతున్నారు కానీ అమలు చేయడం లేదని సెటైర్లు వేశారు. ప్రజలకు అవసరమైన కీలక పథకాలను కేసీఆర్ కేవలం పేపర్ మీదనే పెట్టారు. హామీ ఇచ్చినట్లుగా ఇళ్లు కట్టివ్వడం లేదు. భూమి పంచివ్వలేదని మాయావతి విమర్శించారు.
అంబేడ్కర్ కు భారతరత్న కూడా కాంగ్రెస్ ఒప్పుకోలేదు!
తెలంగాణలో నూతనంగా నిర్మించిన సచివాలయానికి బీఆర్ అంబేడ్కర్ పేరు పెట్టి, రాజకీయ స్వార్థం కోసం, ఓట్ల కోసం 125 అడుగుల ఆయన విగ్రహం పెట్టి మరోసారి దళితులను సీఎం కేసీఆర్ మోసం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేసింది. బిసిల రిజర్వేషన్ల కోసం కమిషన్ వేయాలని అంబేడ్కర్ అడిగితే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకోలేదని మాయావతి గుర్తుచేశారు. అంబేడ్కర్ కు భారతరత్న కూడా ఇవ్వడానికి కాంగ్రెస్ ఒప్పుకోలేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బిజెపి పార్టీ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తుందని ప్రజలు గుర్తించాలన్నారు.
మంత్రి పదవి కన్నా రిజర్వేషన్లే ముఖ్యం!
తెలంగాణకు చెందిన జి.కృష్ణయ్య అనే ఐఏఎస్ చనిపోతే, ఆయన హత్యకు కారణమైన నిందితుడిని బిహార్ ప్రభుత్వం విడుదల చేస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మౌనంగా ఉన్నారు. ఉత్తరప్రదేశ్ లో బీఎస్పీ పార్టీ బలహీనంగా లేదన్నారు. ఇప్పటికిప్పుడు బ్యాలెట్ పద్దతిలో ఎన్నికలు జరిగితే తమ పార్టీ గెలుస్తుందని దీమా వ్యక్తం చేశారు మాయావతి. ఈవీఎం పద్దతిలో ఎన్నికలు జరిగితే ఆధిపత్య పార్టీలకే న్యాయం జరుగుతుందన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోరాడి మన రాజ్యం తెచ్చుకోవాలి. మన కాళ్లపై నిలబడి, మనం అసెంబ్లీకి వెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. వీపీ సింగ్ ప్రభుత్వం హయాంలో బీపీ మండల్ కమీషన్ సిఫార్సులు అమలు చేయాలని బీఎస్పీ డిమాండ్ చేసి సాధించిందని ఆమె గుర్తుచేశారు. తనకు ఆనాటి విపి సింగ్ ప్రభుత్వం మంత్రి పదవి ఇస్తామన్నా సరే బీసీలకు రిజర్వేషన్ల కోసం కట్టుబడి ఉన్నానని మాయావతి తెలిపారు.