Delhi Assembly Committee : హైదరాబాద్ అభివృద్ధిపై ఢిల్లీ అసెంబ్లీ కమిటీ అధ్యయనం - తమ రాష్ట్రంలో ఇక్కడి విధానాలు అమలు చేసే యోచన
ఢిల్లీ అసెంబ్లీ కమిటీ హైదరాబాద్ లో అవలంభిస్తున్న అభివృద్ధి , పాలనా విధాలను పరిశీలించింది. మెరుగైన వాటిని తమ రాష్ట్రంలో అమలు చేయనున్నారు.
Delhi Assembly Committee : హైదరాబాద్‌లో ప్రజలకు అందుతున్న మెరుగైన సౌకర్యాలను పరిశీలించి.. అందులో సాధ్యమైన వాటిని ఢిల్లీలో అమలు చేసేందుకు అధ్యయనం చేయాడానికి ఢిల్లీ అసెంబ్లీ కమిటీ హైదరాబాద్ వచ్చింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఆధ్వర్యంలో వినూత్నంగా అమలు చేస్తున్న మౌలిక వసతులు, రవాణా, శానిటేషన్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, సంక్షేమ పథకాలు, రెవెన్యూ, యు.బి.డి, చెరువుల నిర్వహణ తదితర అంశాలపై అధ్యయనం చేయనుంది. శుక్రవారం హోటల్ తాజ్ కృష్ణాలో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి, ఆయా విభాగాల హెచ్.ఓ.డిలతో సమావేశం అయ్యారు.
ప్రజల మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేస్తూ ముందుకు పోతున్నట్లు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి చెప్పుకొచ్చారు. రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మార్గదర్శకత్వంలో పనచేస్తున్నట్టు తెలిపారు. సిగ్నల్ రహిత రవాణా వ్యవస్థను మెరుగు పరిచేందుకు ఎస్.ఆర్.డి.పి, సి.ఆర్.ఎం.పి ద్వారా రోడ్ నెట్ వర్క్ కు పెరుగుతున్న జనాభా, విస్తరిస్తున్న నగర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని జీహెచ్ఎంసీ బడ్జెట్ రూపకల్పన చేస్తున్నట్లు మేయర్ వివరించారు. ఎస్.ఆర్.డి.పి ద్వారా 48 పనులను చేపట్టగా 33 పనులు పూర్తయ్యాయని.. మిగతా పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు అధికారులు విశేష కృషి చేస్తున్నారని అన్నారు. సి.ఆర్.ఎం.పి ద్వారా సుమారు 800 కిలోమీటర్ల మెయిన్ రోడ్డు సమర్థవంతంగా నిర్వహణ చేస్తున్నట్లు ఢిల్లీ అసెంబ్లీ బృందానికి వివరించారు మేయర్ విజయలక్ష్మి.
కరోనా తర్వాత జీహెచ్ఎంసీ పరిధిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా జరుగుతున్నాయని డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి తెలిపారు. ముఖ్యంగా వార్డుల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకు రావడం జరుగుతున్నదని, రాజకీయాలకు అతీతంగా పారదర్శకంగా అభివృద్ధి పనులు జరుగుతున్నట్లు డిప్యూటీ మేయర్ వివరించారు. ఈ సందర్భంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పై సుదీర్ఘ చర్చ జరిగింది. ప్రాథమిక, సెకండరీ, వ్యర్థాల సేకరణ ,తరలింపు ట్రీట్మెంట్ తదితర అంశాలపై కమిటీ సభ్యుల అనుమానాలను నివృత్తి చేసుకున్నారు. ఎస్.ఆర్.డి.పి, సి.ఆర్.ఎం.పి, యు.సి.డి, ఎన్ఫోర్స్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్, రెవెన్యూ, ట్యాక్స్, టౌన్ ప్లానింగ్, బడ్జెట్ సంబంధించిన ఆయా విభాగాల అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కమిటీ సభ్యులకు వివరించారు.
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ పై ఏర్పాటు చేసిన అసెంబ్లీ కమిటీ చైర్మన్ గా సౌరబ్ భరద్వాజ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులైన శాసన సభ్యులు ఆజేష్ యాదవ్, అఖిలేష్ పాటీ త్రిపాఠి, శ్రీమతి అతిషీ, దేనేష్ మహనీయ, కుల్దీప్ కుమార్, సంజీవ్ ఝా, చరణ్ గోయెల్, సొమ్ దత్తు, సెక్రటరీ స్టాఫ్ డిప్యూటీ సెక్రటరీ సునీల్ దత్ శర్మ, సెక్షన్ ఆఫీసర్ రవీందర్ కుమార్, సురేష్ కుమార్, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ చీఫ్ ఇంజనీర్ విజయ్ కుమార్ గుప్తా, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మనోజ్ కుమార్ వర్మ పాల్గొన్నారు. ఈ కమిటీ ఇక్కడ పరిశీలించిన అంశాలను నివేదిక రూపంలో ఢిల్లీ అసెంబ్లీకి సమర్పిస్తుంది.