Kancha Gachibowli : కంచ గచ్చిబౌలిలో జరిగిన నష్టాన్ని ఎలా సరి చేస్తారు? తెలంగాణ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు సీరియస్
Kancha Gachibowli : తెలంగాణ ప్రభుత్వాన్ని కంచ గచ్చిబౌలి భూవివాదం వెంటాడుతూనే ఉంది. దాఖలైన పిటిషన్‌లపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

Kancha Gachibowli : హైదరాబాద్‌లో వివాదానికి కారణమైన కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టులో వాదనలు నడిచాయి. ఈ విచారణ సందర్భంగా ప్రభుత్వంపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. వివాదాస్పద భూముల్లో చెట్లు నరికివేతపై సమాధానం చెప్పాలని నిలదీసింది. ఈ చెట్ల నరికివేతను సమర్థించుకోవద్దని మండిపడింది. పర్యావరణాన్ని పునరుద్ధరించకుంటే మాత్రం జైలుకు వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించింది.
చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ ఆగస్టీన్ జార్జ్ ధర్మాసనం హైదరాబాద్‌లోని కంచ గచ్చిబౌలి భూ వివాదంపై విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ప్రభుత్వపై తీవ్ర పదజాలంతో సుప్రీంకోర్టు మండిపడింది. ప్లాన్ ప్రకారమే అక్కడ వారంతాల్లో చెట్లు నరికేశారని ఆక్షేపించింది. అలా చేయడానికి ప్రధాన కారణం ఏంటని ప్రశ్నించింది. భారీ సంఖ్యలో యంత్రాలు, బుల్డోజర్లను మోహరించి పనులు చేయడాన్ని తప్పుపట్టింది. తాము అభిృవద్ధికి వ్యతిరేకం కాకపోయినా పర్యావరణం గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు పేర్కొంది. అక్కడ జరిగిన ప్రకృతి విధ్వంసం ఎలా సరి చేస్తారో చెప్పాలని అడిగింది. జరిగిన తప్పును సమర్థించుకోవద్దని వార్నింగ్ ఇచ్చింది. ఎలా చెట్లు నాటుతారు పర్యావరణాన్ని ఎలా కాపాడుతారో చెప్పాలని సూచించింది. లేకుంటే కచ్చితంగా సీఎస్‌పై చర్యలు ఉంటారని వెల్లడించింది.
ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ... కంచ గచ్చిబౌలిలో పనులు నిలిపివేసినట్టు తెలిపారు. పర్యావరణానికి ఎలాంటి హాని లేకుండానే అక్కడ అభివృద్ధి ప్రాజెక్టులు చేపడతామని వెల్లడించారు. రిజైన్డర్స్ వేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరారు. దీంతో కేసును జులై 23కు వాయిదా వేశారు.
ఈ వివాదంలోనే విద్యార్థులను అనవసరంగా అరెస్టులు చేశారని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు పిటిషన్‌దారులు. అయితే ఇది కేవలం పర్యావరణానికి సంబంధించిన అంశంగానే చూడాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అందుకే దీనిపై వేరే పిటిషన్ వేయాలని సూచించింది.





















