Superstar Krishna Passes Away: కృష్ణ మరణంతో అద్భుత సినీశకం ముగిసింది, డేరింగ్ అండ్ డాషింగ్ అంటే ఆయనే: చంద్రబాబు
సూపర్‌స్టార్ కృష్ణ భౌతికకాయానికి టీడీపీ అధినేత చంద్రబాబు నివాళులర్పించారు. నటుడు మహేశ్‌బాబును పరామర్శించి, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
సీనియర్ నటుడు, టాలీవుడ్ సూపర్‌స్టార్ కృష్ణ భౌతికకాయానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. అనంతరం ఆయన తనయుడు, నటుడు మహేశ్‌బాబును పరామర్శించి, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు చంద్రబాబు. కృష్ణగారి మరణం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. ఆయన ఆకస్మిక మరణం తెలుగు సినిమా ప్రేక్షకులను ఎంతో బాధించిందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో కృష్ణ ఓ లెజెండ్ అన్నారు. సినిమా పరిశ్రమలలో ఓ దిగ్గజం అని కొనియాడారు. సినీ పరిశ్రమలో 44 ఏళ్లు 350 సినిమాల్లో నటించడం చాలా గొప్ప విషయం అన్నారు. అప్పట్లోనే టాలీవుడ్ జేమ్స్ బాండ్ సూపర్ స్టార్ అన్నారు. ఏదైనా చేయాలంటే, డేరింగ్ గా నిర్ణయాలు తీసుకున్న వ్యక్తి అన్నారు.
నటుడిగా మాత్రమే కాదు సినిమా స్టూడియో నిర్మించి నిర్మాతగా, దర్శకుడిగా విశేషమైన సేవలు అందించారని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. తాను విద్యార్థిగా ఉన్నప్పుడు ఆయన ఫస్ట్ సినిమా తేనె మనుషులు సినిమా చూశానని, ఇప్పటికీ తనకు ఆ సందర్భం గుర్తుందన్నారు. తిరుపతిలో తొలిసారి కృష్ణను చూశానని, ఎన్నో అవార్డులు కైవసం చేసుకున్నారని చెప్పారు. అల్లూరి సీతారామరాజు లాంటి గొప్ప సినిమా కృష్ణ తప్ప మరో హీరో తీయలేరన్నారు.
ఎన్టీఆర్ నేషనల్ అవార్డు, పద్మభూషణ్ లాంటి గొప్ప అవార్డులు పొందిన నటుడు అని గుర్తుచేసుకున్నారు. భావితరాలకు సీనియర్ నటుడు కృష్ణ ఆదర్శంగా నిలిచారన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ అభిమాన సంఘాలు కలిగిన ఏకైక నటుడు కృష్ణ. డేరింగ్ అండ్ డాషింగ్ గా సినిమాలు తీసిన నటుడు ఆయన. సూపర్ స్టార్స్ కృష్ణ, మహేశ్‌బాబు కుటుంబంలో ఒకే ఏడాది ముగ్గురు చనిపోవడం వారి కుటుంబంతో పాటు తెలుగు ప్రజలకు, టాలీవుడ్ ఫ్యాన్స్‌కు ఎంతో బాధ కలిగించిందన్నారు. దేవుడు మహేష్ బాబు కుటుంబానికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని చంద్రబాబు అన్నారు.
తెలుగు సినీ పరిశ్రమలో మంచి మనిషిగా, నిర్మాతల హీరోగా, నటశేఖరుడిగా, సూపర్‌స్టార్ గా పిలిపించుకున్న నటులు, మాజీ ఎంపీ కృష్ణ గారి మరణం దిగ్భ్రాంతికి గురిచేసింది. నటుడిగా, దర్శకుడిగా, తెలుగు సినిమాకు తొలి సాంకేతికతను అద్దిన సాహసనిర్మాతగా కృష్ణగారిని చెప్పుకుంటారు.(1/2) pic.twitter.com/Yl6oZuJTaT
— N Chandrababu Naidu (@ncbn) November 15, 2022
‘తెలుగు సినీ పరిశ్రమలో మంచి మనిషిగా, నిర్మాతల హీరోగా, నటశేఖరుడిగా, సూపర్‌స్టార్ గా పిలిపించుకున్న నటులు, మాజీ ఎంపీ కృష్ణ మరణం దిగ్భ్రాంతికి గురిచేసింది. నటుడిగా, దర్శకుడిగా, తెలుగు సినిమాకు తొలి సాంకేతికతను అద్దిన సాహస నిర్మాతగా కృష్ణగారిని చెప్పుకుంటారు. కృష్ణగారి మరణంతో ఒక అద్భుత సినీశకం ముగిసినట్లయింది. ఇటీవలే తల్లిని, ఇప్పుడు తండ్రిని కూడా కోల్పోయిన మహేష్ బాబుకు ఇది తీరని వేదన. ఈ బాధ నుంచి త్వరగా కోలుకునే మనోధైర్యాన్ని ఆయనకు ఇవ్వాలని భగవంతుని కోరుకుంటూ.. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానంటూ’ చంద్రబాబు ట్వీట్ చేశారు.