Telangana Politics: కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు ఉండాల్సిందే.. టీపిసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు
Mahesh Kumar Goud | తెలంగాణ కాంగ్రెస్ లో గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసారు టీపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. గ్రూపులు ఉండాలికానీ గీత దాటొద్దంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇతర పార్టీలతోొ పోల్చి చూస్తే నేతలకు స్వేచ్ఛ కాస్త ఎక్కువే. పార్టీలో నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు, అలకలు , ఒక్కోసారి ఏకంగా అధిష్టానంపైనే చిటపటలు సర్వసాధారణం. తెలంగాణ కాంగ్రెస్ లో మోతాదు ఇంకాస్త ఎక్కువనే చెప్పవచ్చు. ఇలా పార్టీలో నేతల మధ్య విభేదాలకు ప్రధాన కారణం గ్రూపు రాజకీయాలే అనేది నగ్నసత్యం. పార్టీ కొంపముంచుతున్న గ్రూపు రాజకీయాలకు దూరంగా ఉండాలంటూ అనేక సందర్బాల్లో అధిష్టానం సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. సొంత పార్టీలోని నేతలు ఒకరిపై ఒకరు మీడియా ముందు విమర్శలకు దిగొద్దంటూ హెచ్చరించింది. ఇంతలా పార్టీ అధిష్టానం సైతం గ్రూపు రాజకీయాలకు దూరంగా ఉండమని చెబుతుంటే, తాజాగా ఏకంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాత్రం పార్టీలో గ్రూపు రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
గ్రూపులు కట్టండి, నచ్చిన నేతల్ని పొగడండి..
తెలంగాణ కాంగ్రెస్ లో గ్రూపు రాజకీయాలు ఉండాలన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. గ్రూపులు కట్టండి, మీకు నచ్చిన నేతలను పొగడండి, కానీ పార్టీలో వేరే గ్రూపులను మాత్రం కించపరచకుండా ఉంటే మీ గ్రూపు రాజకీయాలకు డోకాలేదంటూ భరోసా ఇచ్చారు. సంగారెడ్డి జిల్లాలోని సంగ్ పేటలో రెండవ రోజు జనహిత పాదయాత్రలో మీనాక్షి నటరాజన్ తో కలసి పాల్గొన్న టీపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జోగిపేట ప్రభుత్వ కాలేజిలో శ్రమదానం తరువాత జరిగిన కాంగ్రెస్ నేతల సమావేశంలో మాట్లడుతూ పార్టీలో గ్రూప్ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలతో పార్టీలో గ్రూపు రాజకీయాలపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఇప్పటికే కులాలు, వర్గాలు, నేతల వారిగా తెలంగాణ కాంగ్రెస్ లో విభేదాలు పీక్స్ లో ఉన్నాయి. ఇది చాలదా అన్నట్లు అగ్నికి ఆజ్యం పోసినట్లుగా గ్రూపులు కట్టండి, నో వరీస్ అంటూ సంకేతాలిచ్చేలా మాట్లాడటంపై పార్టీలోనే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. గ్రూపులు కట్టండి కానీ లక్ష్మణ రేఖ దాటొద్దంటూ మాట్లాడినప్పటికీ అది ఎంతవరకూ సాధ్యమవుతుందనే చర్చ నడుస్తోంది. మీకు ఇష్టమైన నాయకులను పొగడండి తప్పులేదు , కానీ ఇతర గ్రూపులను కించపరకండి అనడం పార్టీలో అంతర్గత విభేదాలను ఏకంగా పార్టీ అధ్యక్షుడే బజారునపెట్టినట్లయ్యిందనే వాదనలు వినిపిస్తున్నాయి. గ్రూపులు వద్దు అంటేనే ఇలా పరిస్దితి ఉంటే, ఇకపై గ్రూపు రాజకీయాలకు సై అంటే, నేతల మధ్య విభేదాలు తారాస్దాయికి చేరడం ఖాయమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సంగారెడ్డి జిల్లాలో రెండవ రోజు పాదయాత్రలో భాగంగా సంగ్ పేట్ నుండి ఆరు కిలోమీటర్లు కార్యకర్తలతో కలసి నడిచారు రాష్ట్ర కాంగ్రెస్ ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్. జోగిపేటలో ఏర్పాటు చేసిన భారత్ జోడో యాత్ర ఎగ్జిబిషన్ ను తిలకించారు. అల్పాహారం తరువాత జోగిపేటలోని వీరన్న రెసిడెన్సీ లో ఆమె బసచేశారు. స్దానిక డిగ్రీ కాలేజిలో పాదయాత్రలో పాల్గొన్న కాంగ్రెస్ నేతలంతా కలిసి శ్రమదానం చేశారు. విద్యార్దులు, కార్యకర్తలతో కలసి కాలేజి ప్రాంగణంలో మొక్కలు నాటారు. సంగ్ పేట్ లోని సక్షి గార్డెన్స్ లో జరిగిన కాంగ్రెస్ నేతల సమావేశంతో రెండోరోజు పాదయాత్రను ముగించారు.
కేసీఆర్, కేటీఆర్ టార్గెట్‌గా మంత్రుల ఆరోపణలు
జనహిత పాదయాత్రలో గత బిఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలతో విరుచుకుపడ్డారు తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు. కాళేశ్వరంపై ఇంజనీర్లు చెప్పినా వినకుండా, కేసీఆర్ తన సొంత లాభం కోసం అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ లో కేటీఆర్ కూడా అవినీతి చేసి తప్పించుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. పథకాల విషంలో లబ్ధిదారులతో కార్యకర్తలకు సత్సంబంధాలుండాలని కోరారు , ప్రతీ పథకంపై అవగాహన ఉండాలని, ఎంత లబ్దిపొందుతున్నారో ఇంటింటికీ వెళ్లి వివరించాలన్నారు.





















