Criminal case against Konda Surekha: మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ కేసు పెట్టాలి -నాంపల్లి కోర్టు సంచలన ఆదేశాలు
Nampally court: మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ కేసులు పెట్టాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం పిటిషన్ పై విచారణ జరిపి ఈ ఆదేశాలు ఇచ్చింది.

Criminal cases against Minister Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆగస్టు 21వ తేదీ లోపు కేసులు నమోదు చేయాలని స్పష్టం చేసింది. సమంత విడాకుల వ్యవహారంలో కేటీఆర్ పాత్ర ఉందని.. ఫోన్ ట్యాపింగ్ చేసి.. సమంతను బ్లాక్ మెయిల్ చేశారని కొండా సురేఖ ఆరోపించారు. ఈ వ్యవహారంతో నాగచైతన్య విడాకులు తీసుకున్నారని అన్నారు. అయితే ఈ ఆరోపణలు తన , తన కుటుంబం పరువుకు భంగం కలిగించేలా ఉన్నాయని కేటీఆర్ పరువు నష్టం పిటిషన్లు దాఖలు చేశారు. విచారణ జరిపిన నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశించింది.
కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం దావాను BNS సెక్షన్ 356 కింద పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం, కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేసి, ఈ నెల 21 లోపు నిందితురాలికి నోటీసు జారీ చేయాలని ఆదేశించింది. కొండా సరేఖ తరుపు న్యాయవాది వ్యక్తం చేసిన అభ్యంతరాలను కోర్టు పట్టించుకోలేదు. కేటీఆర్ చేసిన ఫిర్యాదు ఊహాగానాల ఆధారంగా ఉందని, సరైన సమాచారం లేదని, ఫిర్యాదు చేసిన పోలీస్ స్టేషన్ పరిధి తదితర అంశాలపై వారు లేవనెత్తిన అంశాలను కోర్టు తోసిపుచ్చింది. కొండా సురేఖ చేసిన ఆరోపణలు నిరాధారంగా ఉన్నాయని కేటీఆర్ తరపు న్యాయవాది సిద్ధార్థ్ పోగుల చేసిన వాదనతో ఏకీభవించిన కోర్టు, నిందితురాలిపై కేసు నమోదు చేయవచ్చని తేల్చిచెప్పింది.
ఫిర్యాదును స్వీకరించే అధికారం కోర్టుకు ఉందని, హైకోర్టు ఆదేశం (క్రిమినల్ పిటిషన్ నెం. 5670/2024) ప్రకారం చట్టపరంగా నిర్ణయం తీసుకోవచ్చని పేర్కొందిసురేఖ చేసిన వ్యాఖ్యలు, అడ్డగోలుగా చేసిన ఆరోపణలు ఇంతకుముందే మీడియాలో వచ్చాయి అనడానికి ఎలాంటి ఆధారం లేదని, ఈ నిర్దిష్ట ప్రకటనలు, ఆమె స్వయంగా చేసినవిగా సూచిస్తున్నాయని కోర్టు నిర్ధారించింది. పరిశీలనల ఆధారంగా, సెక్షన్ 222 r/w 223 BNSS కింద సెక్షన్ 356 BNS ప్రకారం నేరాన్ని స్వీకరించి, దీనిని క్రిమినల్ కేసుగా నమోదు చేయాలని, నిందితురాలికి 21 ఆగస్టు 2025 నాటికి నోటీసు జారీ చేయాలని కోర్టు ఆదేశించింది.
2024 అక్టోబర్ 2న, గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని లంగర్‌హౌస్‌లో బాపూఘాట్ వద్ద జరిగిన మీడియా సమావేశంలో, కొండా సురేఖ కేటీఆర్‌పై , నాగార్జున కుటుంబంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నాగచైతన్య , సమంత రూత్ ప్రభు విడాకులకు కేటీఆర్ కారణమని ఆరోపించారు. కేటీఆర్ సినీ రంగంలోని కొందరు హీరోయిన్లతో అనుచితంగా వ్యవహరించారని, డ్రగ్స్ అలవాటు చేశారని, హీరోయిన్లు తొందరగా పెళ్లిళ్లు చేసుకోవడానికి కేటీఆర్ కారణమని తీవ్రమైన ఆరోపణలు చేశారు
కేటీఆర్ న్యాయవాది ఉమామహేశ్వర్‌రావు కేటీఆర్ తరపున పరువు నష్టం పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో BRS నాయకులైన బాల్క సుమన్, సత్యవతి రాథోడ్, తుల ఉమ, దాసోజు శ్రవణ్‌లను సాక్షులుగా పేర్కొన్నారు. కేటీఆర్ తన పిటిషన్‌లో, కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తన వ్యక్తిగత , రాజకీయ ఇమేజ్‌కు నష్టం కలిగించాయని, క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు. 2025 ఫిబ్రవరి 13న, కొండా సురేఖ నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో జడ్జి శ్రీదేవి ముందు విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో కేటీఆర్, ఇతర సాక్షుల వాంగ్మూలాలు రికార్డు చేశారు.
కొండా సురేఖ వ్యాఖ్యలపై అక్కినేని నాగార్జున కుటుంబం కూడా రూ. వంద కోట్లకు పరువు నష్టం పిటిషన్ దాఖలు చేసింది. అప్పట్లో సురేఖ వ్యాఖ్యలు సినీ , రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. నటి రకుల్ ప్రీత్ సింగ్, తన పేరును రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించవద్దని కోరారు.





















