Revanth Reddy: రేవంత్ రెడ్డి పాదయాత్రకు ముహూర్తం ఫిక్స్, ఆ తేదీ నుంచే మొదలు!
ప్రస్తుతం తెలంగాణలో పాదయాత్రల హవా నడుస్తోంది. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా పాదయాత్ర చేయడానికి పూనుకున్నారు.
తెలంగాణలో మరో పాదయాత్ర మొదలుకాబోతోంది. 'సకల జనుల సంఘర్షణ' పేరుతో జనవరి చివరి వారం నుండి 5 నెలలపాటు నిర్విరామంగా రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయనున్నారు. టీపీసీసీ అధ్యక్షుడిగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు, వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి తీసుకొచ్చే లక్ష్యంతో ఈ పాదయాత్ర కొనసాగుతుందని టీపీసీసీ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే అధిష్ఠానం నుంచి అందుకు అనుమతి కూడా వచ్చినట్లు తెలుస్తోంది. జనవరి 26 నుంచి యాత్ర ప్రారంభించే అవకాశం ఉంది.
ప్రస్తుతం తెలంగాణలో ప్రస్తుతం పాదయాత్రల హవా నడుస్తోంది. బీజేపీ చీఫ్ బండి సంజయ్ విడతల వారీగా ప్రజా సంగ్రామ యాత్ర అనే పేరుతో పాదయాత్ర చేస్తున్నారు. ఇప్పటికి 5 విడతలు పూర్తయ్యాయి. ఇటు వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాష్ట్రమంతటా పాదయాత్ర చేస్తున్నారు. వీరి దారిలోనే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా పాదయాత్ర చేయడానికి పూనుకున్నారు. ఆయన గతంలో కూడా కొంత పాదయాత్ర చేశారు. సరిగ్గా ఇంకో ఏడాదిలో ఎన్నికలు ఉన్నందున నిత్యం ఏదో ఒక రూపంలో ప్రజల్లో ఉండకపోతే కష్టం అనే భావనకు వచ్చి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
నేటి సమావేశంలో పాదయాత్రపైనా చర్చ, కానీ..
ఆలిండియా కాంగ్రెస్ కమిటీ ఆదేశాలతో నేడు (డిసెంబర్ 18) సాయంత్రం హాత్ సే హాత్ జోడో యాత్ర సన్నాహక సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రేవంత్ పాదయాత్ర, భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. అందరూ కచ్చితంగా వచ్చి తీరాలంటూ ఇప్పటికే ఏఐసీసీ ఆదేశాలు ఇచ్చింది. ఈ క్రమంలో నిన్నటి తిరుగుబాటుతో సీనియర్ల నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ మీటింగ్‌కి రాకపోతే హైకమాండ్‌ను ధిక్కరించినట్టే అవుతుందని రేవంత్ వర్గం చెబుతోంది.
'సాయంత్రం 4 గంటలకు జరిగే ఈ సమావేశానికి టీపీసీసీ కొత్త కమిటీ సభ్యులు హాజరుకానున్నారు. ఏఐసీసీ చేపట్టే కార్యక్రమాల అమలు కార్యక్రమాలపై చర్చించనున్నారు. సీనియర్ల అసంతృప్తి నేపథ్యంలో వారు హాజరు అవుతారా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. అయితే నేడు జరిగే పీసీసీ కార్యవర్గ సమావేశాన్ని బహిష్కరించాలని సీనియర్‌లు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి నిర్వహించే కార్యక్రమాలకు దూరంగా ఉండాలని సీనియర్ నేతలు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో నేడు జరిగే పీసీసీ కార్యవర్గ సమావేశం ఎలా జరుగుతుందోనని గాంధీభవన్ వర్గాలు ఎదురుచూస్తున్నాయి.