Revanth Reddy: లక్షల కోట్లు కేసీఆర్ బినామీలకు, అందుకే జీవో 111 రద్దు - రేవంత్ ఆరోపణలు
సీఎం కేసీఆర్ తన బినామీలు, బంధువర్గాలకు ఈ రూ.లక్షల కోట్ల ఆస్తులు కట్టబెట్టే ఉద్దేశంతోనే జీవో నెంబరు 111 ను రద్దు చేశారని ఆరోపించారు.
తెలంగాణలో ఇటీవల జరిగిన మంత్రి వర్గ సమావేశంలో జీవో నెంబరు 111ను రద్దు చేస్తున్నట్లు తీసుకున్న నిర్ణయంపై విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. 111 జీవో రద్దు నిర్ణయం వెనుక రూ.లక్షల కోట్ల భూ కుంభకోణం ఉందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. మొత్తం భూములను పేదల నుంచి కొనుగోలు చేశాక ఇప్పుడు జీవో రద్దు చేశారని అన్నారు. సీఎం కేసీఆర్ తన బినామీలు, బంధువర్గాలకు ఈ రూ.లక్షల కోట్ల ఆస్తులు కట్టబెట్టే ఉద్దేశంతోనే జీవో నెంబరు 111 ను రద్దు చేశారని ఆరోపించారు. ఈ నిర్ణయం జంట నగరాల పర్యావరణంపై అణువిస్ఫోటనం లాంటిదని, దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
మాజీ సీఎస్ సోమేష్ కుమార్, మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ ఈ విధ్వంసానికి కారణమంటూ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాసుకొరా సాంబ అని కేసీఆర్ చెప్పగానే అరవింద్ వచ్చి రాసుకుంటారు అంటూ రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. బ్రిటిషర్లు, నిజాంలు, సమైక్య పాలకులు హైదరాబాద్‌ను ఎంతో కొంత అభివృద్ధి చేస్తూ వచ్చారని, దుర్మార్గులైన బ్రిటిష్, నిజాం, సమైక్య పాలకులకన్నా కేసీఆర్ మరింత దారుణంగా పాలన చేస్తున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. పరిపాలనపై పట్టులేని వ్యక్తి నిర్ణయాల వల్ల హైదరాబాద్ ఆగం ఆగం అవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
తాగునీటి సమస్య పేరు చెప్పి సీఎం కేసీఆర్ సమస్యను చిన్నదిగా చేసి చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే బినామీ చట్టాన్ని వర్తింపజేసి వాస్తవాలను బయటపెట్టాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆ భూములు ఎవరెవరికి కేటాయించారనే అంశంపై కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిజనిర్ధారణ కమిటీ వేస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు.
సంబంధిత భూములు కేసీఆర్ బంధువులు, బినామీ చేతుల్లోనే 80 శాతం వరకూ ఉన్నాయి. కేసీఆర్ పర్యావరణ విధ్వంసానికి పాల్పడుతున్నారని, బినామీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం పటిష్ఠంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. జంట నగరాలను కాపాడాలనే ఉద్దేశం ఉంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేయాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ నిర్ణయం వల్ల హైదరాబాద్ నగరం వరదల్లో మునిగి వేల మంది చనిపోయే పరిస్థితి వస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి ఇప్పటి వరకు భూ కేటాయింపులు జరగలేదని, తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కోసం భూమి కేటాయించారని గుర్తుచేశారు. 5,100 గజాల కోసం డబ్బు కట్టామని, అయినా కానీ భూ కేటాయింపు జరగలేదని అన్నారు. అందుకే ఇప్పటికీ అద్దెకే ఉంటున్నట్లు తెలిపారు. కేసీఆర్ తన పార్టీ ఆఫీసుకి 11 ఎకరాలు కేటాయించుకోడం దుర్మార్గమని అన్నారు.
అసలు ఏంటి ఈ జీవో 111?
హైదరాబాద్ నగరానికి తాగు నీరు అందించడానికి నిజాం పాలకుల హయాంలో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌లను నిర్మించారు. సిటీకి ప్రాణాధారమైన ఈ రిజర్వాయర్‌లు కలుషితం, కబ్జా అవ్వకుండా కాపాడడానికి 1996లో అప్పటి ప్రభుత్వం జీవో 111 తీసుకొచ్చింది. ఈ జీవో వల్ల సికింద్రాబాద్ వైపు కంటోన్మెంట్ ప్రాంతం, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల పరిధిలో అభివృద్ధి విస్తరణకు, వికేంద్రీకరణకు ఆటంకం కలుగుతుందని ఇప్పటి ప్రభుత్వం చెప్తుంది.
ప్రస్తుతం హైదరాబాద్ తాగునీటి అవసరాలు గండిపేట, హిమాయత్ సాగర్‌పై ఆధారపడి లేవు. కృష్ణా, గోదావరి జలాల ద్వారా నగర ప్రజల తాగునీటి అవసరాలు తీరుతున్నాయి. అందుకే 111 జీవోను రద్దు చేశారు. జీవో 111 కింద ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ పరిధిలోని 84 గ్రామాలు వస్తాయి. ఇదంతా బయో కన్జర్వేషన్ జోన్‌గా ఉంది. ఈ ప్రాంత విస్తీర్ణం 538 చదరపు కిలోమీటర్లు. అంటే ఇది దాదాపు జీహెచ్ఎంసీ విస్తీర్ణానికి సమానం. ఈ 84 గ్రామాల్లోని లక్షా 32 వేల ఎకరాల భూములు ఉన్నాయి. అలాంటి భూముల్లో వ్యవసాయం కాకుండా ఇతర కార్యకలాపాలు చేపట్టడంపై జీవో 111 ప్రకారం ఆంక్షలు ఉన్నాయి. ఆ జీవో ఎత్తేస్తే ఆ భూముల్లో అభివృద్ధి జరగనుంది. అంతేకాక, ఇక్కడి భూముల ధరలు భారీగా పెరుగనున్నాయి.