Hyderabad ఆర్ఆర్ఆర్‌కు సహకరించాలి, మన్నెగూడ రహదారి పనులు వెంటనే చేపట్టాలి: NHAI అధికారులతో రేవంత్ రెడ్డి
Telangana News | తెలంగాణలో జాతీయ రహదారుల నిర్మాణంలో ఏ సమస్యలు ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం వాటిని వెంటనే పరిష్కరిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ఎన్‌హెచ్ఏఐ అధికారులకు తెలిపారు.
Revanth Reddy meeting with NHAI official | హైదరాబాద్: తెలంగాణలో జాతీయ రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రహదారుల నిర్మాణానికి ఏవైనా ఆటంకాలు ఉంటే వాటిని తొలగిస్తామని పేర్కొన్నారు. భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) ఉన్నతాధికారులు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ఆయన నివాసంలో మంగళవారం (జులై 9న) సమావేశం అయ్యారు.
తెలంగాణలో ఎన్‌హెచ్ఏఐ చేపడుతున్న రహదారుల నిర్మాణంలో భూ సేకరణతో పాటు తలెత్తిన ఇబ్బందులను అధికారులు రేవంత్ రెడ్డికి వివరించారు. ఆ సమస్యల పరిష్కారానికి సచివాలయంలో బుధవారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తామన్నారు. రహదారులు నిర్మాణం జరిగే జిల్లాల కలెక్టర్లు, అటవీ శాఖ అధికారులు ఈ కీలక భేటీలో పాల్గొంటారు. ఆయా సమస్యలపై చర్చించి అక్కడే సమస్యలను పరిష్కరించుకుందామని ఎన్‌హెచ్ఏఐ అధికారులకు రేవంత్ రెడ్డి సూచించారు. తెలంగాణ సీఎంతో ఎన్‌హెచ్ఏఐ అధికారుల సమావేశంలో రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి, ఎన్‌హెచ్ఏఐ ప్రాజెక్ట్స్ మెంబర్ అనిల్ చౌదరి, సీఎం కార్యదర్శి షానవాజ్ ఖాసిం, ఆర్ అండ్ బీ స్పెషల్ సెక్రటరీ దాసరి హరిచందన తదితరులు పాల్గొన్నారు.
ఆ పనులు మొదలుపెట్టండి
హైదరాబాద్, మన్నెగూడ రహదారి పనులను వెంటనే ప్రారంభించాలని రేవంత్ రెడ్డి ఎన్‌హెచ్ఏఐ అధికారులకు సూచించారు. కాంట్రాక్టు సంస్థతో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలని కోరారు. హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారి విస్తరణ పనులు వెంటనే చేపట్టాలని సీఎం అధికారులకు సూచించారు. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సమన్వయం చేసుకొని ముందుకు వెళ్లాలని రేవంత్ సూచించారు. హైదరాబాద్- విజయవాడ మధ్య గ్రీన్ ఫీల్డ్ హైవే మంజూరు కోసం ఆంధ్రప్రదేశ్ చేస్తున్న ప్రయత్నాలను అధికారుల దృష్టికి రేవంత్ తీసుకెళ్లారు. తమ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రీజినల్ రింగ్ రోడ్ (Hyderabad Regional Ring Road) నిర్మాణానికి సహకరించాలని ఎన్‌హెచ్ఏఐ అధికారులను ఆయన కోరారు.
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన భారత్ మాల పథకంలో హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డును చేపట్టాలని ప్రధానమంత్రి మోదీకి ఇటీవల విజ్ఞప్తి చేసిన విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో 12 రేడియల్ రోడ్లు వస్తాయన్నారు. వాటి మధ్య పలు క్లస్టర్లు, శాటిలైట్ టౌన్ షిప్ లు ఏర్పాటు చేయాలని తెలిపారు. తెలంగాణకు తీర ప్రాంతం లేనందున డ్రై పోర్ట్ ఏర్పాటు చేయనున్నామని, ఇందుకోసం బందర్ పోర్టు (Bandar Port)ను అనుసంధానించేలా హై స్పీడ్ ఎక్స్ ప్రెస్ వే నిర్మాణం చేపట్టాలని అధికారులకు సీఎం రేవంత్ సూచించారు.
హైదరాబాద్ - కల్వకుర్తి జాతీయ రహదారి పనులు మొదలు పెట్టి త్వరగా పూర్తి చేస్తే.. ఈ రహదారితో తిరుపతికి 70 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని తెలిపారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలతో పాటు హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్లే వారికి మరింత సౌకర్యంగా ఉంటుందని చెప్పారు. తెలంగాణలో రహదారుల నిర్మాణంపై ప్రతి వారం తనకు నివేదిక ఇవ్వాలని సీఎంవో కార్యదర్శి షానవాజ్ ఖాసీంను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా లేవనెత్తిన అంశాలు..
1. మంచిర్యాల- వరంగల్- ఖమ్మం- విజయవాడ (ఎన్ హెచ్ 163జీ ) కారిడార్ నిర్మాణానికి భూముల అప్పగింత
2. ఆర్మూర్- జగిత్యాల- మంచిర్యాల ( ఎన్ హెచ్ 63 ) భూ సేకరణకు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టడం
3. వరంగల్- కరీంనగర్ (ఎన్ హెచ్ 563 ) రహదారి నిర్మాణానికి చెరువు మట్టి, ప్లై యాష్ సేకరణ
4. ఎన్‌హెచ్ 44తో కాళ్లకల్- గుండ్లపోచంపల్లి రహదారి 6 వరుసల విస్తరణకు భూ సేకరణ
5. జాతీయ రహదారుల నిర్మాణంలో విద్యుత్ సంస్థలతో తలెత్తుతున్న సమస్యలకు పరిష్కారం
6. ఖమ్మం- దేవరపల్లి, ఖమ్మం- కోదాడ రహదారుల నిర్మాణంలో పోలీసుల భద్రత ఏర్పాటు