Hyderabad Rains: వర్షాకాలం సీజన్ ప్రారంభం, జంట నగరాల్లో పటిష్టమైన చర్యలకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు
Hyderabad Traffic Alerts| జీహెచ్ఎంసీ పరిధిలో వరద తీవ్రత ఉండే 141 ప్రాంతాలను గుర్తించి, సునాయాసంగా వరద వెళ్లేలా వాటర్ హార్వెస్ట్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు.
Telangana CM Revanth Reddy | హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు తెలంగాణలో పూర్తిగా వ్యాపించాయి. రుతుపవనాలు చురుకుగా కదులుతుండటంతో గత వారం వర్షాలు కురిశాయి. తాజాగా పగటి ఉష్ణోగ్రత తగ్గి, ప్రతిరోజూ ఆకాశం మేఘావృతమై ఉంటుంది. అయితే వర్షాకాలం సీజన్ ప్రారంభం కావడంతో హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Telangana CM Revanth Reddy) అధికారులను ఆదేశించారు. మంత్రులతో కలిసి శనివారం (జూన్ 15న) సీఎం రేవంత్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సందర్శించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఎఫ్‌ఎం రేడియో ద్వారా ఎప్పటికప్పుడు ట్రాఫిక్ అలర్ట్స్ (Hyderabad Traffic Alerts) అందించేలా ఏర్పాట్లు చేయాలని చెప్పారు.
అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి పలు సూచనలు
వర్షాకాలం సీజన్‌లో ట్రాఫిక్ ఇబ్బందులతో పాటు, నీరు నిలుస్తున్న ప్రాంతాల్లో తీసుకోవలసిన చర్యలపై అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి పలు సూచనలు చేశారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఫిజికల్ పోలీసింగ్ విధానం అనుసరించాలన్నారు. ఒకవేళ ఎక్కడైనా సిబ్బంది కొరత ఉంటే, హోం గార్డులను రిక్రూట్ చేసుకోవాలని రేవంత్ రెడ్డి చెప్పారు. ఔటర్ రింగ్ రోడ్డు (Outer Ring Road) యూనిట్‌గా తీసుకుని డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌ను ఇంటిగ్రేట్ చేయాలని, ఔటర్ లోపల ఉన్న సీసీ కెమెరాలన్నింటిని వీలైనంత త్వరగా కమాండ్ కంట్రోల్‌కు అనుసంధానం చేయాలని ఆదేశించారు.
జీహెచ్ఎంసీ పరిధిలో వరద తీవ్రత ఉండే 141 ప్రాంతాలను గుర్తించినట్టు అధికారులు సీఎంకు వివరించారు. అయితే వర్షాకాలంలో వరద నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, ఇందుకు సంబంధించి అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని రేవంత్ రెడ్డి సూచించారు. నగరంలో నీరు ఎక్కువ వచ్చి చేరే ప్రాంతాల నుంచి సునాయాసంగా వరద వెళ్లేలా వాటర్ హార్వెస్ట్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులకు వివరించారు. ముఖ్యమంత్రితో పాటు కమాండ్ కంట్రోల్ సెంటర్ (#CommandAndControlCentre)ను సందర్శించిన వారిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka), మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy), దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ రవి గుప్త (Telangana DGP) ఉన్నారు.