Jurala Project Inflow: జూరాలకు పెరుగుతున్న వరద నీరు, 18 ఏళ్లలో తొలిసారి గేట్లు ఎత్తి నీటి విడుదల
Jurala Project | జూరాల ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు కొనసాగుతోంది. గురువారం రాత్రి వరకు లక్ష క్యూసెక్కుల ప్రవాహానికి చేరనుందని అధికారులు అంచనా వేశారు.

- 18 సంవత్సరాల తర్వాత మే నెలలో జూరాల ప్రాజెక్టు వద్ద వరద ప్రవాహం
- ఎగువ ప్రాంతాలలో భారీ వర్షపాతం కారణంగా, మహబూబ్ నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు వరద పెరిగింది.
- 18 సంవత్సరాలలో తొలిసారిగా, మే నెలలో 12 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు.
- ప్రస్తుతం, ఇన్‌ఫ్లో, అవుట్ ఫ్లో రెండూ 82,000 క్యూసెక్కుల వద్ద ఉన్నాయి.
- ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 9.657 టిఎంసిలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 7.389 టిఎంసిలు
ధరూర్: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కీలక ప్రాజెక్టు అయిన ఇందిరా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దాంతో ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఎగువ నుంచి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దాంతో 18 ఏళ్ల తరువాత తొలిసారిగా మే నెలలో జూరాల ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు 12 గేట్లు ఎత్తి 80 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.
ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు
ఎగువ ప్రాంతాలైన కర్ణాటక, మహారాష్ట్రలలో భారీ వర్షపాతం కారణంగా, మహబూబ్ నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. జలాశయం పూర్తి నీటి సామర్థ్యం 9.657 టిఎంసిలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 7.389 టిఎంసిలు ఉందని అధికారులు తెలిపారు. గత రెండు దశాబ్దాలలో జూరాల ప్రాజెక్టుకు మే నెలలోనే వరద నీరు ఈ స్థాయిలో రావడం ఇది రెండోసారి. చివరగా 18 ఏళ్ల కిందట మే నెలలో జూరాల గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు వద్ద ప్రస్తుతం, ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో రెండూ 82,000 క్యూసెక్కుల వద్ద ఉన్నాయని వరద నీరు ఇలాగే కొసాగితే లక్ష క్యూసెక్కుల వరకు పెరిగే అవకాశం ఉందని ప్రాజెక్టు అధికారులు చెబుతున్నారు.
తెలంగాణలో నేడు, శనివారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. తరువాత వారం రోజులపాటు వర్షం ప్రభావం ఏమాత్రం ఉండదని వాతావరణ శాఖ చెబుతోంది. జూన్ రెండో వారం నుంచి నైరుతి రుతుపవనాల ద్వారా వానలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు.






















