![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Pullareddy: రాష్ట్రపతి ముర్ముకు పుల్లారెడ్డి స్వీట్స్ ఓనర్ కోడలు లేఖ - ఆ కాలేజీ విజిటింగ్‌కు ముందే ట్విస్ట్!
పుల్లారెడ్డి గ్రూపునకు చెందిన జి.నారాయణమ్మ కాలేజీకి రాష్ట్రపతి ఈ నెల 29న రానున్న నేపథ్యంలో ఆమె ఈ లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
![Pullareddy: రాష్ట్రపతి ముర్ముకు పుల్లారెడ్డి స్వీట్స్ ఓనర్ కోడలు లేఖ - ఆ కాలేజీ విజిటింగ్‌కు ముందే ట్విస్ట్! Pullareddy sweets owner's niece writes letter to President droupadi murmu over domestic violence Pullareddy: రాష్ట్రపతి ముర్ముకు పుల్లారెడ్డి స్వీట్స్ ఓనర్ కోడలు లేఖ - ఆ కాలేజీ విజిటింగ్‌కు ముందే ట్విస్ట్!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/27/f4c188a0395105f31e934fd2b1a7cf871672127172406234_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
జి.పుల్లారెడ్డి స్వీట్స్ యజమాని కుటుంబంలో జరుగుతున్న గొడవ మరోసారి తెరపైకి వచ్చింది. కొన్నాళ్లుగా పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత జి.రాఘవ రెడ్డి, ఆయన కుటుంబంతో కోడలు ప్రజ్ఞా రెడ్డి మధ్య వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ వివాదం రాష్ట్రపతిని చేరింది. శీతకాల విడిది కోసం హైదరాబాద్‌కి వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ప్రజ్ఞా రెడ్డి ఈ - మెయిల్ ద్వారా లేఖ రాశారు. తనకు న్యాయం చేయాలని కోరారు. పుల్లారెడ్డి గ్రూపునకు చెందిన జి.నారాయణమ్మ కాలేజీకి రాష్ట్రపతి రానున్న నేపథ్యంలో ఆమె ఈ లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ నెల 29న జి.నారాయణమ్మ కాలేజీలో రాష్ట్రపతి పర్యటనను రాఘవ రెడ్డి, ఇతర కుటుంబ సభ్యులు తమకు అనుకూలంగా మార్చుకునే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఈ లేఖ సోమవారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
రాఘవ రెడ్డితో పాటు ఆయన భార్య భారతి రెడ్డి, కుమార్తె శ్రీవిద్య రెడ్డి రెండేళ్లుగా తనతో పాటు తన 8 ఏళ్ల కుమార్తెను వేధిస్తున్నారని ప్రజ్ఞా రెడ్డి రాష్ట్రపతికి రాసిన లేఖలో వివరించారు. వాళ్లు తమను చంపేందుకు ప్రయత్నించారని, వరకట్నం తేవాలని పదే పదే హింసలు పెట్టేవారని ఆరోపించారు. తమను ఇంటి నుంచి బయటకి రాకుండా చేసేందుకు రాత్రికి రాత్రి ఇంట్లోనే తన గది బయట గోడ కట్టించారని లేఖలో వాపోయారు.
ఈ విషయం కోర్టుకు కూడా వెళ్లిందని గుర్తు చేశారు. కోర్టు కూడా కట్టిన గోడను కూల్చి వేయాలని ఆదేశించిందని చెప్పారు. ఇవి తాను చేస్తున్న ఆరోపణలు కాదని.. ఈ విషయం కోర్టులో వరకు వెళ్లడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన జడ్జి గది బయట గోడ కూల్చి వేయమని ఆదేశించారని ప్రజ్ఞ చెప్పుకొచ్చారు. తన మెయిల్‌లో కోర్టు ఆదేశాల మేరకు గది బయట గోడను కూలగొడుతున్న అధికారుల వీడియోను కూడా జత చేశారు.
తనను తీవ్ర వేధింపులకు గురి చేస్తున్న అత్తింటి వారిపై ఇప్పటికే హైదరాబాద్‌లో కేసులు నమోదై ఉన్నాయని చెప్పారు. సాటి మహిళగా తన పరిస్థితిని అర్థం చేసుకోవాలని ఈ - మెయిల్ ద్వారా రాసిన లేఖలో రాష్ట్రపతిని వేడుకున్నారు. ఈ నెల 29న రాఘవ రెడ్డికి చెందిన జి. నారాయణమ్మ ఇంజినీరింగ్ కాలేజీలో మీ పర్యటనతో మరింత రెచ్చిపోతారని ప్రజ్ఞా రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఆ పర్యటనను తమకు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉందని వాపోయారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)