Traffic Diversions in hyderabad: హైదరాబాద్ కు రాష్ట్రపతి, సోమవారం నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు- అక్కడ బీ అలర్ట్
హైదరాబాద్ లో రాష్ట్రపతి వెళ్లే రహదారికి ఇరువైపులా ఉన్న నివాసాలపై ఇప్పటికే పోలీస్, ఇంటిలిజెన్స్ సిబ్బంది నిఘా పెట్టారు. రాష్ట్రపతి విడిది కాలంలో లోతుకుంట నుంచి ఆంక్షలు అమలు చేస్తారు.
హైదరాబాద్ లో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ట్రాఫిక్ ఇబ్బందులు కాస్త పెరిగాయి. వీటిని త్వరలోనే పరిష్కరిస్తామని కొత్త కమిషనర్ కూడా అభయమిచ్చారు. అయితే ఈ సోమవారం నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఉండబోతున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయని ఉన్నాతాధికారులు ప్రకటించారు.
రాష్ట్రపతి ముర్ము హైదరాబాద్ పర్యటన సందర్భంగా.. హకీంపేట విమానాశ్రయం నుంచి వై జంక్షన్, బొల్లారం జంక్షన్, నేవీ జంక్షన్, యాప్రాల్ రోడ్, బైసన్ గేట్, లోతుకుంట జంక్షన్ వైపు వచ్చే వాహనాలను సోమవారం దారి మళ్లిస్తామని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఆయా మార్గాల్లో వెళ్లేవారు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని, వేరే మార్గాల్లో వెళ్లాలని సూచించారు. ట్రాఫిక్ పోలీసులు తగిన సూచనలు చేస్తారన్నారు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ డైవర్షన్ ఉంటుందని, ప్రజలు సహకరించాలన్నారు.
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది కోసం హైదరాబాద్ వస్తున్నారు. సోమవారం ఆమె ఢిల్లీనుంచి బయలుదేరి హైదరాబాద్ వస్తారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆమె విడిది చేస్తారు. ఈనెల 18నుంచి 23 వరకు ఆమె హైదరాబాద్ లోనే ఉంటారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో కాన్వాయ్ తో హైదరాబాద్ లోరిహార్సల్స్ నిర్వహించారు అధికారులు. హకీంపేట్ విమానాశ్రయం నుంచి బొల్లారం రాష్ట్రపతి నిలయం, సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ వరకు కాన్వాయ్ తో అధికారులు రిహార్సల్ చేశారు. ఐదు రోజల పాటు హైదరాబాద్ లో రాష్ట్రపతి ఉంటారు. ఈనెల 23వ తేదీన ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు. రాష్ట్రపతి రాక సందర్భంగా హైదరాబాద్ లో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి.
సోమవారం (డిసెంబర్ 18న) సాయంత్రం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరుతారు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము. సాయంత్రం 6:25 గంటలకు రక్షణ శాఖ పరిధిలోని హకీంపేట వైమానిక దళ శిక్షణ కేంద్రానికి రాష్ట్రపతి ప్రత్యేక విమానంలో చేరుకుంటారు. అక్కడి నుంచి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి రాత్రి 7 గంటలకు చేరుకుంటారు. ఆయా మార్గాల్లో రాష్ట్రపతి కాన్వాయ్ కు సంబంధించి సైబరాబాద్ సీపీ ఏకే మహంతి ఏర్పాట్లు పర్యవేక్షించారు.
హైదరాబాద్ లో రాష్ట్రపతి వెళ్లే రహదారికి ఇరువైపులా ఉన్న నివాసాలపై ఇప్పటికే పోలీస్, ఇంటిలిజెన్స్ సిబ్బంది నిఘా పెట్టారు. రాష్ట్రపతి విడిది కాలంలో లోతుకుంట నుంచి ఆంక్షలు అమలు చేస్తారు.