KCR-PK Meeting: ప్రగతి భవన్‌లో కేసీఆర్, ప్రశాంత్ కిషోర్ భేటీ - కీలక అంశాలపై చర్చలు
జాతీయ పార్టీ ప్రకటన, ఎన్నికలు, సర్వే తదితర కీలక అంశాలపై వీరిద్దరూ చర్చించుకున్నట్లు తెలుస్తోంది. ప్రశాంత్ కిషోర్ మరో రెండు రోజులు హైదరాబాద్‌లోనే ఉండనున్నట్లు సమాచారం.
KCR PK Meeting In Pragathi Bhavan: ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రశాంత్ కిషోర్ భేటీ అయ్యారు. మూడు గంటలుగా వీరి మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి మంత్రి హరీశ్ రావు కూడా హాజరయ్యారు. జాతీయ పార్టీ ప్రకటన, ఎన్నికలు, సర్వే తదితర కీలక అంశాలపై చర్చించుకున్నట్లు తెలుస్తోంది. ప్రశాంత్ కిషోర్ మరో రెండు రోజులు హైదరాబాద్‌లోనే ఉండనున్నట్లు సమాచారం. ఇటీవల ఎమ్మెల్యేల పనితీరుపై పీకే సర్వే చేశారు. పార్టీని దేశవ్యాప్తంగా ఎలా విస్తరించాలి? వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో ఎలాంటి వ్యూహాలు రచించాలనే అంశంపై వీరు చర్చించినట్లుగా తెలుస్తోంది.
ప్రగతి భవన్‌లో ఈనెల 10వ తేదీన (శుక్రవారం) మంత్రులు, ఎంపీలు, కీలక నేతలతో కేసీఆర్ 6 గంటల పాటు సుదీర్ఘంగా సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ భేటీలో కేసీఆర్ దేశ రాజకీయ పరిస్థితులు, అందులో టీఆర్‌ఎస్ పోషించనున్న పాత్రపై విస్తృతంగా చర్చించినట్లుగా తెలిసింది. దేశంలో మతపరమైన పరిస్థితులు నెలకొన్న వేళ దేశ ప్రజల అవసరాలు ఎజెండాగా జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిద్దామని కేసీఆర్ చెప్పినట్లుగా సమాచారం. టీఆర్‌ఎస్‌ను జాతీయ పార్టీగా మార్చే అంశంపై వారి అభిప్రాయాలు సేకరించినట్లుగా తెలుస్తోంది.
ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా పీకేతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. టీఆర్‌ఎస్ త్వరలోనే భారతీయ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)గా మారబోతోందా? అనే ఊహాగానాలు కూడా వచ్చాయి. అయితే, ఈ నెల 19లోగా జరుగనున్న టీఆర్‌ఎస్ కార్యవర్గ సమావేశంలో దీనిపై సీఎం కేసీఆర్ ఫైనల్ నిర్ణయం ప్రకటించనున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. తెలంగాణలో టీఆర్‌ఎస్ ఎప్పట్లాగే కొనసాగుతుందా? లేదా ఊహాగానాలకు తగ్గట్లుగా జాతీయ పార్టీగా అవతరిస్తుందా అనే అంశంపై ఆసక్తి నెలకొని ఉంది.
KCR Undavalli Arun Kumar Meeting In Pragathi Bhavan ఉండవల్లితోనూ కేసీఆర్ భేటీ
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ (Undavalli Arun Kumar) కూడా భేటీ అయ్యారు. కాసేపటి క్రితమే ఆయనతో సమావేశం ముగిసింది. ప్రశాంత్ కిషోర్ (Prashanth Kishore) తో సమావేశం అనంతరం వీరిద్దరి భేటీ జరిగింది. జాతీయ రాజకీయాలపై అవగాహన ఉన్న ఉండవల్లి అరుణ్ కుమార్ తో జాతీయ పార్టీ అంశంపై చర్చించేందుకే ఆయనను ప్రత్యేకంగా ఆహ్వానించినట్లుగా సమాచారం. కొత్త పార్టీ పెడితే ఎలాంటి పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉంటుందనే కోణంలో కేసీఆర్ ఆయన అభిప్రాయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తమతో ఏ పార్టీలు కలిసొచ్చే అవకాశం ఉంటుందనే అంశంపై కూడా కేసీఆర్ ఉండవల్లి సలహాలు తీసుకున్నట్లుగా సమాచారం.