Ponnala Lakshmaiah: ఏఐసీసీ ప్రెసిడెంట్ ఎన్నికల్లో కన్‌ఫ్యూజన్! పొన్నాల ఫైర్ - బయటపడ్డ వర్గపోరు
హైదరాబాద్‌లోని గాంధీభవన్ లో ఏఐసీసీ అధ్యక్ష పదవికి సోమవారం ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఓటరు జాబితాలోని పేర్లు మార్చాలంటూ పొన్నాల లక్ష్మయ్య ఆందోళనకు దిగారు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నెలకొని ఉన్న అంతర్గత పోరు తాజాగా జరుగుతున్న ఏఐసీసీ అధ్యక్ష పదవి ఎన్నికల సందర్భంగా బయటపడింది. హైదరాబాద్‌లోని గాంధీభవన్ లో ఏఐసీసీ అధ్యక్ష పదవికి సోమవారం ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఓటరు జాబితాలోని పేర్లు మార్చాలంటూ పొన్నాల లక్ష్మయ్య ఆందోళనకు దిగారు. రాత్రికి రాత్రి తన పేరు మార్చేశారని పొన్నాల లక్ష్యయ్య సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
జనగామ నియోజకవర్గం డెలిగేట్ ఓట్ల విషయంలో ఈ గందరగోళం చోటుచేసుకుంది. తెలంగాణలో ప్రతి నియోజకవర్గం నుంచి ఇద్దరికి ఓటు వేసే అవకాశం కల్పించారు. అయితే, జనగామ నుంచి పొన్నాల లక్ష్యయ్యకు, చెంచారపు శ్రీనివాస్ రెడ్డికి ఓటు వేసే అవకాశాన్ని తొలుత కల్పించారు. ఆ మేరకు ఓటింగ్ కార్డ్ ఇష్యూ చేశారు. ఓటు వేసేందుకు పొన్నాల లక్ష్మయ్య, శ్రీనివాస్ రెడ్డి గాంధీ భవన్ కు చేరుకోగా చివరి క్షణంలో ఓటరు లిస్టులో చెంచారపు శ్రీనివాస్ రెడ్డి పేరు తొలగించి ఉంది.
శ్రీనివాస్ రెడ్డి స్థానంలో కొమ్మూరు ప్రతాప్ రెడ్డి పేరు చేర్చి ఉంది. ఆదివారం (అక్టోబరు 16) రాత్రికి రాత్రే కొమ్మూరు ప్రతాప్ రెడ్డి పేరును రాష్ట్ర కాంగ్రెస్ అధిష్ఠానం చేర్చినట్లుగా తెలుస్తోంది. ఇలా ఆఖరి నిమిషంలో కొమ్మూరి ప్రతాప్ రెడ్డి పేరును చేర్చడం పట్ల పొన్నాల లక్ష్మయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ ఏజెంట్లపై మండిపడ్డారు. శ్రీనివాస్ రెడ్డికి ఓటు వేసే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాను 40 ఏళ్ల నుంచి గాంధీ భవన్ కు వస్తున్నానని చెప్పారు. అదే సమయంలో పొన్నాల లక్ష్మయ్యకు జానారెడ్డి సర్ది చెప్పారు. ఈ గొడవ నేపథ్యంలో ప్రస్తుతం శ్రీనివాస్ రెడ్డి, కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఇద్దరినీ ఓటు వేయకుండా సంబంధిత ఎన్నికల సిబ్బంది ఆపారు.
కాంగ్రెస్ లో కీలక పరిణామం - జానారెడ్డి
ఏఐసీసీ (ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ - All India Congress Committee) అధ్యక్ష పదవి కోసం ఎన్నికలు జరుగుతుండడంపై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత కె. జానారెడ్డి స్పందించారు. సోమవారం ఉదయం ఏఐసీసీ అధ్యక్ష ఎన్నిక సందర్భంగా ఆయన గాంధీ భవన్ కు వచ్చారు. ఆ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఆయన చాలా కాలం తర్వాత ఏఐసీసీ అధ్యక్ష పదవికి డెమొక్రటిక్‌గా (ప్రజాస్వామ్య పద్ధతిలో) ఎన్నికలు జరుగుతున్నాయని జానారెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఇది ఒక కీలక పరిణామం అని ఆయన అభిప్రాయపడ్డారు. అధ్యక్షుడి ఎన్నిక ప్రశాంతంగా జరుగుతోందని అన్నారు. ఎన్నిక సందర్భంగా వివాదాలు మాట్లాడడం సరైంది కాదని తాను భావిస్తున్నానని జానారెడ్డి అన్నారు. మునుగోడు ఉప ఎన్నికల గురించి కూడా జానారెడ్డి మాట్లాడారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి చరిత్ర సృష్టిస్తోందని అన్నారు. రెండు ప్రభుత్వాలు ఎన్నికపై జవాబు చెప్పాలని అన్నారు. మునుగోడు ప్రజలు పార్టీలకు అతీతంగా ఓటేస్తారని జానారెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు.
Also Read: Hyderabad: చెప్పుతో కొడతా, ఆ సీఐ నా చుట్టమే - నడిరోడ్డుపై మహిళ బూతులతో రచ్చ