Mahender Reddy: మంత్రిగా మహేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం - రాజ్ భవన్‌లో కేసీఆర్, మంత్రుల హాజరు
ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ కూడా హాజరు అయ్యారు. అందరు మంత్రులతో పాటుగా బీఆర్ఎస్ నేతలు కూడా ఈ కార్యక్రమానికి హాజరు అయ్యారు.
తెలంగాణ మంత్రివర్గ విస్తరణలో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్ లో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మహేందర్ రెడ్డితో మంత్రిగా ప్రమాణం చేయించారు. గురువారం (ఆగస్టు 24) ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ కూడా హాజరు అయ్యారు. అందరు మంత్రులతో పాటుగా బీఆర్ఎస్ నేతలు కూడా ఈ కార్యక్రమానికి హాజరు అయ్యారు.
గత మార్చి నెలలో ఈటల రాజేందర్ బర్తరఫ్ చేయడంతో ఖాళీ అయిన మంత్రి స్థానం అలాగే ఉండిపోయిన సంగతి తెలిసిందే. ఆ స్థానాన్ని ఇప్పుడు మహేందర్ రెడ్డితో భర్తీ చేస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం విడుదల చేసిన బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో మహేందర్ రెడ్డి పేరు లేదు. ఆయన్ను బుజ్జగించేందుకు మంత్రివర్గంలోకి ఆయన్ను తీసుకుంటున్నారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కీలక నేత పట్నం మహేందర్ రెడ్డి. ఈ జిల్లాలో ఈయనకు మంచి పట్టుంది. ఈయన గతంలో మంత్రిగా పని చేశారు. తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన గెలిచారు. తర్వాత మంత్రి పదవి వస్తుందని ఆశించినా.. సీఎం కేసీఆర్ మంత్రి పదవి ఇవ్వలేదు. దీనిపై మహేందర్ రెడ్డి గతంలో అసహన వ్యాఖ్యలు చేశారు. అయితే, కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లుగా లీకులు కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ అభ్యర్థులను ప్రకటన చేయడం, అందులో మహేందర్ రెడ్డి పేరు లేకపోవడంతో ఇక ఆయన్ను బుజ్జగించేందుకు మంత్రి పదవి ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు.
పదవి అంగీకరించినంత మాత్రాన మెత్తబడ్డట్లు కాదు - మహేందర్ రెడ్డి
మంత్రి పదవి తీసుకోవడానికి అంగీకరించినంత మాత్రాన తాను మెత్తబడినట్లు కాదని .. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీపై పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటానని మీడియాతో వ్యాఖ్యనించారు. గత ఎన్నికల్లో తాండూరు నుంచి పోటీ చేసిన మహేందర్ రెడ్డి.. స్వల్ప తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి పైలట్ రోహిత్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. అయితే తర్వాత రోహిత్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరారు. సిట్టింగ్‌లు అందిరికీ టిక్కెట్లు ఇవ్వాలనుకున్న కేసీఆర్.. ఫిరాయింపు ఎమ్మెల్యేలకూ అదే చాన్స్ ఇచ్చారు. దీతో మహేందర్ రెడ్డి పార్టీ మారిపోతారన్న ప్రచారం ఊపందుకుంది. కానీ అనూహ్యంగా ఆయనకు కేసీఆర్ కేబినట్ లో చోటు కల్పిస్తున్నారు. మహేందర్ రెడ్డి పార్టీ మారకుండా.. బుజ్జగించేందుకు కేసీఆర్ మంత్రి పదవి ఆఫర్ చేశారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.