Patnam Mahender Reddy: కాంగ్రెస్ గూటికి పట్న మహేందర్‌రెడ్డి దంపతులు, చేవెళ్ల ఎంపీ టిక్కెట్ హామీ
Patnam Mahender Reddy News: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి దంపతులు కాంగ్రెస్ పార్టీ చేరనున్నారు. వికారాబాద్ జడ్పీ ఛైర్మన్ సునీతారెడ్డికి హస్తం పార్టీ చెవెళ్ల ఎంపీ టిక్కెట్ ఇవ్వనుంది
Patnam Mahender Reddy: లోక్‌సభ ఎన్నికలకు ముందు తెలంగాణ(Telangana) కాంగ్రెస్‌లోకి వలసల జోరు కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు బీఆర్‌ఎస్(BRS) ఎమ్మెల్యేలు, ఎంపీలు సీఎం రేవంత్‌రెడ్డి(Revanth Reddy)ని కలిసినా... మర్యాదపూర్వకమేనంటూ దాట వేశారు. అయితే ముఖ్యమంత్రి సొంత జిల్లాకు చెందిన సీనియర్ బీఆర్‌ఎస్ నేత, మాజీమంత్రి పట్నం మహేందర్‌రెడ్డి(Mahender Reddy) దంపతులు కాంగ్రెస్‌లో చేరనున్నారు. ముఖ్యమంత్రిని కలిసి సంసిద్ధత వ్యక్తం చేశారు. వారం రోజుల్లో వారు కాంగ్రెస్‌లో చేరడం ఖాయమైంది...
కాంగ్రెస్ గూటికి పట్నం
మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డితోపాటు ఆయన సతీమణి, వికారాబాద్ జిల్లాపరిషత్ ఛైర్మన్ సునీతారెడ్డి(Sunitha Reddy) కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఈమేరకు సీఎం రేవంత్‌రెడ్డిని ఆయన నివాసంలో కలిసి అంగీకారం తెలిపారు. మహేందర్‌రెడ్డితో పాటు తాను, అనుచరగణంతో కాంగ్రెస్(Congress)లో చేరనున్నట్లు సునీతారెడ్డి ముందుగానే తెలపగా....సీఎంను కలవడంతో వారు చేరిక ఖాయమని తేలిపోయింది. వారం రోజుల్లో కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉంది. డిల్లీ వెళ్లి మల్లికార్జునఖర్గే సమావేశంలో చేరాలా లేక...కొండగల్ లో సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించనున్న బహిరంగ సభలో చేరాలా అన్నదానిపై త్వరలోనే నిర్ణయం వెల్లడిస్తామన్నారు.
శాసనసభ ఎన్నికలకు ముందే వీరు కాంగ్రెస్ పార్టీలో చేరాలని భావించినా... బీఆర్ఎస్(BRS) అధిష్టానం అప్రమత్తమైంది. మహేందర్‌రెడ్డికి అప్పటికప్పుడు మంత్రిపదవి ఇచ్చి కాస్త చల్లబరిచారు. శాసనసభ ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర ఓటమితో ఇప్పుడు వారు కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నారు. మహేందర్‌రెడ్డి మద్దతుదారులు ఇప్పటికే చాలామంది కాంగ్రెస్‌లో చేరారు. తాండూరు మున్సిపల్ చైర్‌పర్సన్ తాటికొండ స్వప్న, సీనియర్ నాయకులు రవి గౌడ్, కరణం పురుషోత్తంరావ్ తదితరులు పట్నం వెంట వెళ్లనున్నారు.
చేవెళ్ల టిక్కెట్ ఖారారైనట్లే
వికారాబాద్ జెడ్పీ ఛైర్మన్‌గా ఉన్న సునీతారెడ్డి చేవెళ్ల(Chevella) ఎంపీ టిక్కెట్ ఆశిస్తున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ నుంచి గ్రీన్‌సిగ్నల్ రావడంతోనే వారు సీఎం రేవంత్‌రెడ్డిని కలసి పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. తాండూరు ఎమ్మెల్యే టిక్కెట్ మహేందర్‌రెడ్డి ఆశించగా మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డికి బీఆర్‌ఎస్ కేటాయించింది. దీంతోపాటు మరో నేత మెతుకు ఆనంద్‌తో నెలకొన్న విభేదాల కారణంగానే మహేందర్‌రెడ్డి దంపతులు బీఆర్‌ఎస్‌ను వీడుతున్నట్లు తెలిసింది.
బీఆర్‌ఎస్‌లోనే సోదరుడు
మహేందర్‌రెడ్డి సోదరుడు పట్నం నరేందర్‌రెడ్డి(Narendra Reddy) మాత్రం బీఆర్ఎస్‌లోనే ఉండనున్నారు. వారు కనీసం తనకు మాట మాత్రం కూడా చెప్పలేదన్నారు. శాసనసభ ఎన్నికల ముందే కాంగ్రెస్‌లో చేరదామమని వారు ప్రపోజల్ పెట్టినా....తానే వారించానన్నారు. ఇప్పుడు వారు ఇష్టపూర్వకంగానే కాంగ్రెస్‌లో చేరారని నరేందర్‌రెడ్డి తెలిపారు. రాజకీయాల్లో ఎవరి ఇష్టం వారిదన్న నరేందర్‌రెడ్డి......తాను మాత్రం బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతానన్నారు. ఈయన గత ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతిలో ఓటమి చవిచూశారు.
రేవంత్‌ను ఓడించి...ఆయన పక్కకే చేరిక
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరంటారు. వికారాబాద్ జిల్లా రాజకీయాలను ఒకపక్క రేవంత్‌రెడ్డి, మరోపక్క పట్నం మహేందర్‌రెడ్డి శాసించారు. 2018 ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి ఓటమే ధ్యేయంగా బీఆర్‌ఎస్ అధిష్ఠానం అప్పటి మంత్రి పట్నం మహేందర్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించింది. అప్పుడు ఆయన తన సోదరుడు పట్నం నరేందర్‌రెడ్డిని రంగంలోకి దింపి....తన అనుభవాన్ని, అధికారాన్ని ఉపయోగించి రేవంత్‌రెడ్డిని సొంత నియోజకవర్గంలో తొలిసారి ఓటమిపాలు చేశారు. ఆ తర్వాత ఆయన మల్కాజ్‌గిరి ఎంపీగా గెలవడం, పీసీసీ అధ్యక్షుడితో పాటు ఒంటిచేత్తో శాసససభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు అదే రేవంత్‌రెడ్డి సమక్షంలో పట్నం మహేందర్‌రెడ్డి దంపతులు కాంగ్రెస్‌లో చేరనున్నారు.