Telangana OU JAC: విరమించింది దీక్షే-పోరాటం కాదు- ప్రభుత్వానికి ఓయూ జేఏసీ నేత మోతీలాల్ హెచ్చరిక
Telangana: ఉద్యోగ క్యాలెండర్‌తోపాటు నిరుద్యోగ భృతి కోసంపోరాటం చేస్తున్న ఓయూ జేఏసీ నేత దీక్ష విరమించారు. ప్రభుత్వం దిగి వచ్చే వరకు పోరాటం మాత్రం వదిలేదని తేల్చి చెప్పారు.
Hyderabad : కాంగ్రెస్ చెప్పిన ఉద్యోగాలు భర్తీ చేసే వరకు పోరాటం కొనసాగుతున్నారు ఓయూ జేఏసీ నేత మోతీలాల్ నాయక్. తొమ్మిది రోజులు గా చేస్తున్న అమరణ దీక్షను ఆసుపత్రిలో విరమించారు. ఆరోగ్యం క్షీణిస్తున్నందున దీక్ష విరమిస్తున్నట్టు మోతీలాల్ ప్రకటించారు. అయితే పోరాటం మాత్రం వీడేది లేదన్నారు.
తెలంగాణ వచ్చి ఇన్నేళ్లు అవుతున్నా యువతకు ఉద్యోగాలు రావడం లేదన్నారు మోతీలాల్. అందుకే యువత నేడు ఉద్యమబాట పట్టాల్సి వచ్చిందని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి నిరుద్యోగులకు చాలా వరాలు ఇచ్చిందని వాటినే తాము అడుగుతున్నామన్నారు. గ్రూప్ 1లో ఒక పోస్టుకు వంద మందిని పిలవాలని డిమాండ్ చేశారు. గ్రూప్ టు, గ్రూప్ త్రీ ఉద్యోగాల సంఖ్య పెంచాలన్నారు. ఇప్పుడు ప్రకటించిన డీఎస్సీని రద్దు చేసి మెగా డీఎస్సీని ప్రకటించాలని పేర్కొన్నారు. ఇలా అన్ని కలిపీ పాతిక వేల ఉద్యోగాలతో నోటిఫికేషన్ ఇవ్వాల్సిందేనంటూ పట్టుపట్టారు. అప్పటి వరకు యువత ప్రభుత్వాన్ని నిద్రపోనీయమని హెచ్చరించారు.
ఓయూ జేఏసీ నేతల డిమాండ్లు ఇవే
- గ్రూప్ వన్ మెయిన్స్‌కు ఒక పోస్టుకు వందమందిని పిలవాలి
- 2000 గ్రూప్ టు పోస్టులు భర్తీ చేయాలి.
- మూడు వేల గ్రూప్ త్రీ పోస్టులు భర్తీ చేయాలి
- ఇప్పుడున్న డీఎస్సీ నోటిఫికేషన్ రద్దు చేసి మెగా డీఎస్సీని తీయాలి.
- నిరుద్యోగులకు నాలుగు వేల నిరుద్యోగ భృతి ఇవ్వాలి.
- ఏడు నెలలుగా నిరుద్యోగ భృతి ఇవ్వాలి
- గురుకుల ఉపాధ్యాయ పోస్టులను బ్యాక్‌లాగ్‌లో ఉంచకుండా భర్తీ చేయాలి.
9 రోజులుగా అమరణ దీక్ష చేస్తున్న మోతీలాల్‌కు మద్దతుగా సోమవారం భారీ సంఖ్యలో నేతలు, నిరుద్యోగులు కదిలారు. ఆయన్ని గాంధీ ఆసుపత్రికి తరలించడంతో అక్కడ ఆయన్ని పరామర్శించేందుకు ప్రయత్నించారు. దీన్ని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
భారీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వాటి ప్రస్తావన లేకుండా ఉద్యమాలను అణగదొక్కుతోందన్నారు ఓయూ జేఏసీ నేతలు. లైబ్రెరీ నుంచి ఆర్ట్స్ కాలేజీ వరకు ర్యాలీ తీసిన విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అక్కడి నుంచి స్టేషన్‌కు తరిలించారు.