Hyderabad Metro Rail : శంషాబాద్ ఎయిర్ పోర్టు మెట్రోరైలు కొండెక్కబోతోంది!
రాయదుర్గ్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు నిర్మించతలపెట్టిన మెట్రో రైలు ప్రాజెక్టుకు అనే అడ్డంకులు సవాల్ విసురుతున్నాయి. అందుకే మెట్రో రైలును కొండెక్కించాలని నిర్ణయించారు.
శంషాబాద్ ఎయిర్ పోర్టు మెట్రోరైలు కొండెక్కబోతోంది! మీరు చదివింది నిజమే! కొండెక్కడమంటే, ప్రాజెక్టు అటకెక్కడమో, అందకుండా పోవడమో కాదు! విమానాశ్రయం వెళ్లే దారిలో ఎదురయ్యే రాజేంద్రనగర్ కొండపై నుంచి వెళ్లబోతోంది. అది కూడా 100 మీటర్లు కాదు 200 మీటర్లు కాదు. ఏకంగా 1.3 కిలోమీటర్లు గుట్టమీద జర్నీ చేయాలి. దీనికి సంబంధించిన అలైన్‌మెంటు సాధ్యాసాధ్యాలను మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎయిర్ పోర్ట్ మెట్రో చీఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ ఆనంద్ మోహన్, డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ (రైల్వే) జైన్ గుప్తా, ఇతర సీనియర్ అధికారులతో కలిసి ఎన్వీఎస్ రెడ్డి తనిఖీ చేశారు.
రాజేంద్రనగర్ కొండపై సుమారు 1.3 కి.మీ పొడవుగల మెట్రో అలైన్‌మెంట్. నిటారుగా ఉండే కొండలు, బండరాళ్లు, లోయలతో కొండపై మెట్రో వయాడక్ట్ నిర్మాణం చాలా కష్టమైన పని. నిటారుగా ఉండే వాలు, ఎత్తయిన బండరాళ్లను అధిరోహిస్తూ రైలు జర్నీ సాగాలి. ఈ క్రమంలోనే ప్రతిపాదిత ఎలైన్మెంటును పరిశీలించి, ఎండీ కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు
రాజేంద్రనగర్ కొండపై రైలు నడిచేందుకు తీసుకున్న నిర్ణయాలివే:
- మెట్రో అలైన్‌మెంట్, ORR క్రాష్ బారియర్ మధ్య గ్యాప్ దాదాపు 18 అడుగులు మాత్రమే ఉంది. దాంతోపాటు ORR డీప్ కటింగ్‌లో ఉన్నందున, ORR వైపు ఎటువంటి బండరాళ్లు పడకుండా చూడాలి
- తగిన బలం, ఎత్తుతో కూడిన రక్షణ బ్యారియర్లను అమర్చాలని నిర్ణయించారు.
- బౌల్డర్ స్టెబిలైజేషన్ పద్ధతులను నిపుణులతో సంప్రదించి చేయాలని భావించారు.
- ఏదైనా సంఘ విద్రోహ కార్యకలాపాల నుంచి మెట్రో వయాడక్ట్‌ను రక్షించడానికి ఎడమ వైపున రక్షిత ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
- ఆక్రమణలను నిరోధించడానికి పక్కనే ఉన్న ప్రైవేట్ ఆస్తుల నుంచి విమానాశ్రయ మెట్రో ప్రాంతాన్ని ఆక్రమణలు లేకుండా HMDAతో సంప్రదించి సరిహద్దు సర్వే రాళ్లను ఏర్పాటు చేయాలని డిసైడ్ చేశారు.
- రాతిని తొలగించే అవసరం లేకుండా, స్టబ్‌లు, తక్కువ ఎత్తు ఉన్న స్తంభాలపై మెట్రో వయాడక్ట్‌ను నిర్మించే అవకాశాన్ని పరిశీలించాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నారు.
- ORR డ్రైనేజీ వ్యవస్థలోకి వర్షపు నీరు ప్రవహించేలా కొండపై నిర్మించిన తాత్కాలిక రహదారి లోయ పాయింట్ల వద్ద తగినంత వ్యాసార్థంతో కూడిన హ్యూమ్ పైపులతో క్రాస్ డ్రెయిన్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
- కొండపై దాదాపు 300 మీటర్ల వరకు మిగిలిన విస్తీర్ణంలో తాత్కాలిక రహదారిని కొద్ది రోజుల్లో పూర్తి చేయాలని నిర్ణయించారు.
ఇదిలావుంటే ఇదే దారిలో మరో సవాల్- రాయదుర్గం స్టేషన్ నుంచి నానక్‌రామ్‌గూడ జంక్షన్! ఈ రూట్లో ఇంజినీరింగ్ పరంగా అతి క్లిష్టం.ఈ ప్రాంతంలో మెట్రో సాంకేతిక సవాళ్లను ఎదుర్కొక తప్పదని ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఇప్పటికే తెలిపారు. 21 మీటర్ల ఎత్తులో రాయదుర్గ్, మైండ్ స్పేస్ జంక్షన్‌ను దాటడం ఒక పెద్ద సవాల్‌తో కూడుకున్న విషయమని ఎన్వీఎస్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ అడ్డంకిని అధిగమించేందుకు పరిష్కారంగా ప్రత్యేకమైన స్పాన్‌ని అక్కడే నిర్మించేలా పరిశీలించినట్లు ఆయన గతంలోనే చెప్పారు. దాంతోపాటు తాజాగా మరో సవాల్ రాజేంద్రనగర్ కొండ రూపంలో ఎదురైంది. ఏది ఏమైనా, ఎన్ని అడ్డంకులు వచ్చినా విమానాశ్రయం వరకు మెట్రోని పరుగులు తీయించడమే లక్ష్యంగా పనులు జరుగుతున్నాయి!