Balakrishna: తెలంగాణలో టీడీపీకి పునర్వైభవం తేవాలి, ఆ బాధ్యత కార్యకర్తలదే - బాలకృష్ణ
సికింద్రాబాద్ రసూల్ పురలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని ఆధ్వర్యంలో నందమూరి బాలకృష్ణ నివాళి అర్పించారు.
తెలుగుదేశం పార్టీకి పునర్వైభవం తీసుకురావలసిన బాధ్యతను తమ భుజస్కందాలపై వేసుకొని పనిచేయాలని టీడీపీ కార్యకర్తలకు నందమూరి బాలకృష్ణ పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ 27వ వర్ధంతిని పురస్కరించుకుని సికింద్రాబాద్ రసూల్ పురలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని ఆధ్వర్యంలో నందమూరి బాలకృష్ణ నివాళి అర్పించారు. కాగడాను వెలిగించి అమరజ్యోతి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి ఉన్నంత కార్యకర్తలు ప్రపంచంలో ఏ పార్టీకి లేరని తెలిపారు. మహిళలకు ఆర్థిక స్వాతంత్రం, ఆస్తిలో వాటాను కల్పించి ఆడపడుచుల అన్నగా నిలిచారని పేర్కొన్నారు. విప్లవాత్మక పథకాలను ప్రవేశ పెట్టిన ఘనత నందమూరి తారకరామారావుదేనని అన్నారు. బడుగుబాలహీన వర్గాలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించి వారి ఎదుగుదలకు పట్టుబడిన దేవుడు ఎన్టీఆర్ అని తెలిపారు.
ఎటువంటి వ్యతిరేక పరిస్థితులకు కూడా చెదరక, బెదరక, తలవంచకుండా ముందుకు సాగిన దీరోదాత్తముడు నందమూరి తారకరామారావని కొనియాడారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడి తెలుగు వెలుగులు ప్రపంచానికి చాటిచెప్పిన తెలుగు తేజం ఎన్టీఆర్, చిత్రసీమలోనే కాదు రాజకీయాలలో కూడా ఎన్టీఆర్ కు ముందు ఎన్టీఆర్ కు తరువాత అనే చెప్పుకునే విధంగా పరిపాలనను అందించి ఆదర్శంగా నిలిచారని వెల్లడించారు.
ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి @naralokesh గారు ఉండవల్లి నివాసంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. (1/2) pic.twitter.com/UHWa74vzjq
— Telugu Desam Party (@JaiTDP) January 18, 2023
ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు
ఎన్టీఆర్ బిడ్డగా పుట్టడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తానని బాలకృష్ణ అన్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నందమూరి కుటుంబసభ్యులు నివాళులు అర్పించారు. నందమూరి బాలకృష్ణ, నందమూరి రామకృష్ణ, నందమూరి సుహాసిని, ఇతర కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు నివాళులర్పించారు. అనంతరం బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు.
ఆడవాళ్లకు అండగా ఆర్థిక స్వాతంత్ర్యాన్ని ఇచ్చిన అన్న నందమూరి తారకరామావు అని కొనియాడారు. అటువంటి మహానుభావుడిని ప్రతిఒక్కరు స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. కోట్లాది మంది ప్రజల అభిమానాన్ని సంపాదించుకోవడం ఎన్టీఆర్‌కే సాధ్యం అయిందని, తెలుగుదేశం పార్టీ అనేది ఎన్టీఆర్ ఇచ్చిన గొప్ప ఆస్తి అని అన్నారు. ఇది కేవలం పార్టీ మాత్రమే కాదని, ఒక వ్యవస్థ అని అన్నారు. టీడీపీ ఉన్న కార్యకర్తలు మరే పార్టీకి లేరని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని అన్నారు.
బడుగు, బలహీన, వెనకబడిన వర్గాల అభ్యున్నతికి ఆయన ఎంతో పని చేశారని గుర్తు చేశారు. టీడీపీని ప్రతి కార్యకర్త ముందుకు నడిపి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేయాలని అన్నారు. ఆయన జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారని, ఎప్పుడు కూడా ఆయన తలవంచకుండా ముందుకు వెళ్లారని అన్నారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని విశ్వవ్యాప్తం చేసిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని బాలకృష్ణ గుర్తు చేసుకున్నారు.