Telangana Rains News: వరదలకు దెబ్బతిన్న రోడ్లు! మంత్రి వేముల సమీక్ష, తక్షణం నిధులు విడుదల
Telangana News: తెలంగాణలో రహదారులు 1,733 కి.మీ పొడవున దెబ్బతిన్నాయి. వీటి మరమ్మత్తులకు 379.50 కోట్లు, 8.4 కిలో మీటర్ల మేర రోడ్లు తెగిపోయాయి.
Minister Vemula Prashanth Reddy Review: గత 15 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు దెబ్బతిన్న రాష్ట్ర రహదారులు, బ్రిడ్జ్ లు, కల్వర్టులు, కోతకు గురైన పలు రోడ్లకు సంబంధించి రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మంత్రుల నివాస సముదాయంలోని తన అధికారిక నివాసంలో ఈఎన్సీ రవీందర్ రావుతో సమావేశమై పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు.
రాష్ట్ర రహదారులు 1,733 కి.మీ పొడవున దెబ్బతిన్నాయి. వీటి మరమ్మత్తులకు 379.50 కోట్లు, 8.4 కిలో మీటర్ల మేర రోడ్లు తెగిపోయాయి. వీటి పునరుద్దరణకు 13.45 కోట్లు, 39.8 కిలో మీటర్ల పొడవైన రోడ్డు కోతలకు గురి అయింది. దీనికి గాను 7.10 కోట్లు, రాష్ట్ర వ్యాప్తంగా 412 కల్వర్టులు దెబ్బతిన్నాయి. వీటి మరమ్మత్తులకు 98.19 కోట్లు. శాశ్వత ప్రాతిపదికన మరమ్మత్తులకు మొత్తం కలిపి 498.24 కోట్లు ఖర్చు అవుతాయని సంబంధిత ఇంజనీర్లు రూపొందించిన అంచనాలు మంత్రి పరిశీలించారు.
ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా తాత్కాలికంగా పునరుద్ధరణ చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రూ.10 కోట్లు మంజూరు చేసినట్టు మంత్రి వెల్లడించారు.
రాష్ట్రవ్యాప్తంగా వర్షాల కారణంగా దెబ్బతిన్న రహదారుల పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రహదారులు, వంతెనల మరమ్మతు కోసం @TelanganaCMO పది కోట్ల రూపాయలు మంజూరు చేశారని మంత్రి చెప్పారు.#KCR #rains
— AIR News Hyderabad (@airnews_hyd) July 28, 2022
సెక్రటేరియట్ నిర్మాణం పరిశీలన
అంతకుముందు మంగళవారం మంత్రి కొత్త సెక్రటేరియట్ పనులు పరిశీలించారు. నిర్మాణ పనుల్లో ఇంకా వేగం పెంచి సీఎం విధించిన గడువులోగా పూర్తి చేయాలని నిర్మాణ సంస్థను ఆదేశించారు. ఉదయం సెక్రటేరియట్ నిర్మాణ ప్రాంగణానికి చేరుకుని మధ్యాహ్నం వరకు అక్కడే ఉండి వివిధ పనులు పరిశీలించారు. సుమారు 4 గంటల పాటు మొత్తం సెక్రెటేరియట్ అంతా తిరిగారు. అక్కడే అధికారులతో సమీక్ష చేశారు.
సీఎం చాంబర్, మంత్రుల చాంబర్, ఆఫీసర్స్ చాంబర్స్ ఫర్నీచర్ డిజైన్లు పరిశీలించారు. గ్రాండ్ ఎంట్రీ మెయిన్ డోర్ కు సంబంధించి ఆర్కిటెక్ట్ ఆస్కార్ పొన్ని రూపొందించిన డిజైన్లు పరిశీలించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు వాటిని ఫైనలైజ్ చేయనున్నారు. ప్రస్తుతం సెక్రెటేరియట్ నిర్మాణంలో 2,118 మంది కార్మికులు పని చేస్తున్నారు.
హుస్సేన్ సాగర్ ఒడ్డున నిర్మిస్తున్న అమరవీరుల స్మారక చిహ్నం పనులను కూడా మంత్రి పరిశీలించారు. ఈ నిర్మాణం తెలంగాణ ప్రజల సెంటిమెంట్ అని, మనసుపెట్టి చేయాలన్నారు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి కావాలని మంత్రి అదేశించారు. మంత్రి వెంట ఈఎన్సీ గణపతి రెడ్డి, ఎస్ఈలు సత్యనారాయణ, హఫీజుద్దీన్, లింగారెడ్డి సహా పలువురు ఆర్ అండ్ బీ అధికారులు ఉన్నారు.