Hyderbaad News: హైదరాబాద్‌లో ప్రపంచ వరి సదస్సు జూన్ 7, 8న - మంత్రి తుమ్మల
Hyderabad News: జూన్ 7,8 వ తేదీన తాజ్ కృష్ణ హోటల్ లో ప్రపంచ వరి సదస్సు ఉంటుందని మంత్రి తుమ్మల తెలిపారు. వివిధ దేశాల నుండి వరి శాస్త్రవేత్తలు ఈ వరి సదస్సులో పాల్గొనే అవకాశం – మంత్రి తుమ్మల
World Rice Conference Hyderabad in Hyderabad: జూన్ నెల 7, 8వ తేదీలలో హైదరాబాద్ లోని తాజ్ కృష్ణ హోటల్ లో జరిగే ప్రపంచ వరి సదస్సుకు సన్నహాలు ముమ్మరం చేస్తున్నట్టు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ సదస్సును నిర్వహిస్తున్న అంతర్జాతీయ పంటల సంస్థ ( కాలిఫోర్నియా, అమెరికా) డైరెక్టర్ మెర్సిడెజ్ జోన్స్ తో పాటు స్థానిక నిర్వహకులు అయిన ప్రొ. అల్దాస్ జానయ్య నేడు (మే 31) వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసి సదస్సుకు సంబంధించిన నిర్వహణ అంశాలు వివరించారు.
ఈ సదస్సుకు దాదాపు 150 మంది విదేశీ వరి ధాన్యం ఎగుమతిదారులు, దిగుమతిదారులతో పాటు అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ (పిలిప్పైన్స్) నుంచి ప్రముఖ వరి శాస్త్రవేత్తలు, దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి దాదాపు మరో 150 మంది వరి ఎగుమతిదారులు, వరి విత్తన కంపెనీల ప్రతినిధులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు పాల్గొంటున్నట్టు తెలిపారు.
వీరితో పాటు రాష్ట్రంలోని దాదాపు 30 మంది అభ్యుదయ రైతులు, 30 మంది రైస్ మిల్లర్లు కూడా పాల్గొంటున్నారు. ఇంకా ఈ సదస్సులో ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ & ఇండస్ట్రీస్ కూడా భాగస్వామ్యం పంచుకుంటుందని తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల నుండి వచ్చే వరి ఎగుమతిదారులకు ఇది ఒక మంచి సువర్ణావకాశమన్నారు. ఈ సదస్సులో మన దేశీయ వరి ఎగుమతిదారులు, ఇతర దేశాల నుండి వచ్చే ధాన్యం దిగుమతిదారులతో నేరుగా సంప్రదింపులు జరిపుకొనే అవకాశం ఉంటుందన్నారు. తద్వారా మనం ఎగుమతిచేసే వరిధాన్యం అనేది ఇతర దేశాల దిగుమతిదారులకు అనుకూలంగా ఉన్నాయా, లేదా అని తెలుసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.
అంతేకాకుండా ఏఏ దేశాలలో ఏ రకం వరి దిగుమతులకు డిమాండ్ ఉన్నది. ఎలాంటి నాణ్యతగల వరి రకాలు మన దేశం నుండి ఎగుమతిఅవుతున్నాయి అనే విషయాలు తెలుసుకునే అవకాశాన్ని ఈ సదస్సు కల్పిస్తుంది. దీంతోపాటు ఎలాంటి అధునాతనమైన రైస్ మిల్లర్లు వాడి ఎగుమతికి కావాల్సిన నాణ్యతను పాటించేవిధంగా రైస్ మిల్లర్లకు అవగాహన చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. అదేవిధంగా వరిపండించే అభ్యుదయ రైతులు, ఎలాంటి యాజమాన్య పద్దతులు పాటించి ఏ రకం వరి పండించినట్టయితే ఎగుమతికి అనుకూలమైన ధాన్యాన్ని పండించవచ్చొ తెలుసుకునే అవకాశం ఉంటుందని మంత్రిగారు పేర్కొన్నారు.
అంతేకాకుండా అంతర్జాతీయ వరి సంస్థ నుండి పాల్గొనే శాస్త్రవేత్తల నుండి విత్తనోత్పత్తిలో అందుబాటులో ఉన్న అధునాతన పరిజ్ఞానాన్ని విత్తన పరిశ్రమ ప్రతినిధులు, అభ్యుదయ రైతులు తెలుసుకునే అవకాశాన్ని ఈ సదస్సు కల్పిస్తుంది. ఈ సదస్సులో భాగంగా దాదాపు 20 మంది విదేశీ, దేశీయ పరిశ్రమలు వారివారి ఉత్పత్తులను, ఎగుమతులకు అనుగుణమైన వరి రకాలను ప్రదర్శిస్తారు. ఈ సమాచారం ఇటు రైతులకు, దేశీయ వరి ఎగుమతిదారులకు ఎంతో ఉపయోగకరం. అందువలన మొట్టమొదటిసారిగా భారతదేశంలో నిర్వహించే ఈ ప్రపంచ వరి సదస్సులో ఇటు వరి విత్తన పరిశ్రమ ప్రతినిధులు, రైస్ మిల్లర్లు, వరి ఎగుమతిదారులతో పాటు వివిధ ఆహార ఉత్పత్తుల పరిశ్రమల ప్రతినిధులు కూడా పెద్దఎత్తున పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు.