Predator Badlands Review In Telugu - 'ప్రెడేటర్: బ్యాడ్ ల్యాండ్స్' రివ్యూ: ఇన్నాళ్లకు దారిలో పడ్డ ఫ్రాంచైజీ... సినిమా ఎలా ఉందంటే?
ప్రెడేటర్ ఫిల్మ్ ఫ్రాంచైజీ లో క్రొత్త మూవీ ప్రెడేటర్ బ్యాడ్ ల్యాండ్స్ రిలీజ్ అయింది. 'ప్రే'తో ప్రెడేటర్ ఫ్రాంచైజీకి కొత్త ఊపిరి పోసిన డాన్ ట్రాచెన్ బెర్గ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందంటే?

Predator Badlands Movie Review: ప్రెడేటర్ ఫిల్మ్ ఫ్రాంచైజీలో కొత్త మూవీ 'ప్రెడేటర్ బ్యాడ్ ల్యాండ్స్' ఈ రోజు రిలీజ్ అయింది. 'ప్రే' (Prey 2022) సినిమాతో ప్రెడేటర్ ఫ్రాంచైజీకి కొత్త ఊపిరి పోసిన డాన్ ట్రాచెన్ బెర్గ్ (Dan Trachtenberg) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాపై ముందు నుండి భారీ అంచనాలు ఉన్నాయి. నవంబర్ 3న కొన్ని దేశాల్లో ప్రీమియర్లు పడ్డ ఈ మూవీ భారత్, అమెరికా సహా అనేక దేశాల్లో ఈ రోజు రిలీజ్ అయింది. మరి ఈ సినిమా అంచనాలు అందుకుందా? లేదా? అనేది ఇప్పుడు చూద్దాం.
కథ (Predator Badlands Story): ప్రెడేటర్ ల గ్రహంలో ఒక యంగ్ ప్రెడేటర్ పేరు డెక్. మిగిలిన ప్రెడేటర్లతో పోలిస్తే కాస్త చిన్న సైజ్ లో ఉండే డెక్ అంటే తండ్రికి నచ్చడు. వేటగాడిగా తనను తాను నిరూపించు కోవడానికి అత్యంత ప్రమాదకరమైన గెన్నా అనే గ్రహంలో ఉండే కలిస్క్ (Kalisk) అనే భయానక జీవిని వేటాడడానికి తన అన్న క్వెయ్ (Kwei)ని సాయం అడుగుతాడు. అయితే ఈ లోపు తండ్రి వచ్చి క్వెయ్ తో డెక్ ని చంపేయమని అర్డర్ వేస్తాడు. దానికి క్వెయ్ ఒప్పుకోడు. దానితో క్వెయ్ చంపేస్తాడు తండ్రి. చనిపోయే ముందు తమ్ముడు డెక్ ను గెన్నా గ్రహం మీదకు వెళ్లే మార్గాన్ని యాక్టివేట్ చేస్తాడు క్వెయ్.
గెన్నా గ్రహం మీద క్రాష్ ల్యాండ్ అయిన డెక్ కి అనేక ప్రమాదాలు ఎదురవుతాయి. అదే సమయంలో భూమిపై నుండి 'వే ల్యాండ్ -యూటాని' కంపెనీ పంపిన ఒక మనిషి లాంటి సింథటిక్ రోబో థియా (Thia)తో డెక్ కు పరిచయం అవుతుంది. థియా కూడా ఆ గ్రహం మీది భయంకర జీవి కలిస్క్ కోసమే వచ్చి ఉంటుంది కానీ దానితో జరిగిన ఫైట్ లో నడుం క్రింద భాగం తెగిపోయి ఉంటుంది. గెన్నా గ్రహం గురించి బాగా తెలిసిన థియా ను నడుముకు కట్టుకుని అదే గ్రహం మీది పరిచయం అయిన మరో వింత జీవి బడ్ (Bud ) తో కలిసి కలిస్క్ ను వేటడానికి బయలుదేరాతాడు డెక్.
అదే సమయంలో భూమి నుండి వేలాండ్ కంపెనీకి చెందిన మరో బృందం థియాను పోలిన వేరొక రోబో టెస్సా (Tessa) ఆధ్వర్యంలో గెన్నా గ్రహం మీదకు చేరుకుంటుంది. వాళ్ళ లక్ష్యం కూడా కలిస్క్ జీవినే. మరి అటు కలిస్క్, ఇటు టెస్సా బృందంతో డెక్ ఎలా పోరాడాడు?అనుక్షణం ప్రమాదం ఎదురయ్యే గెన్నా గ్రహంలో డెక్ ఎలా ఆపదల నుండి బయట పడ్డాడు? థియా, బడ్ ఏమయ్యారు? తన అన్న క్వయ్ చావుకి డెక్ ప్రతీకారం తీర్చుకున్నాడా లేడా అనేది మిగిలిన కథ.
విశ్లేషణ (Predator Badlands Review Telugu): 1987లో వచ్చిన మొదటి ప్రెడేటర్ మూవీలో భయపెట్టే ప్రెడేటర్ జీవిని బ్యాడ్ ల్యాండ్స్ సినిమాలో హీరోగా చూస్తాం. మిగిలిన ప్రెడేటర్ జీవులతో పోలిస్తే చిన్నగా బలహీనంగా కనిపించే డెక్ తనను తాను గ్రహాంతర వేటగాడినని నిరూపించుకోవడానికి చేసే పోరాటంతో ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. తనకి సాయపడే సింథటిక్ రోబో థియా నచ్చుతుంది. తన వన్ లైనర్స్ బాగున్నాయి. అలాగే చిన్న జీవి బడ్ కూడా ఆకట్టుకుంటుంది. విజువల్స్ ఎఫెక్ట్స్ బాగున్నాయి. యాక్షన్ సీక్వెన్స్ చాలా బాగా డిజైన్ చేశారు. అలాగే ప్రెడేటర్ ఫ్రాంచైజీని మరోసారి ఏలియన్ (Alien) ప్రాంచైజీతో కలిపారు. భవిష్యత్ లో మరిన్ని ప్రెడేటర్ మూవీస్ కి రంగం సిద్ధం చేశారు. ఆల్మోస్ట్ ప్రేడేటర్ ఫ్రాంచైజీ డెడ్ అయిపొయింది అనుకున్న సమయంలో దాని టోన్ మార్చి దర్శకుడు డాన్ ట్రెచెన్ బెర్గ్ చేసిన ప్రయోగం మరోసారి సక్సెస్ అయింది. ప్రెడేటర్, ఏలియన్ సినిమాలు అనగానే గుర్తు వచ్చే బృటాలిటీ ని కాస్త పక్కన బెట్టి కథ స్క్రీన్ ప్లే మీద దృష్టి పెట్టాడు డైరెక్టర్. సారా స్కాచ్నెర్, బెంజ మిన్ వాల్ఫిష్ జంట ఇచ్చిన మ్యూజిక్ మూడ్ ని ఎలివేట్ చేస్తే జెఫ్ కట్టర్ సినిమాటోగ్రఫీ సినిమాకి ప్లస్ అయింది. అయితే ప్రెడేటర్ డిజైన్ మాత్రం ఈసారి మరీ భయపెట్టేలా లేదు. పైగా ప్రెడేటర్ అంటే ఇలానే ఉంటుంది అనే రూపం చాలామంది ఫ్రాంచైజీ ఫ్యాన్స్ లో ఉంది. మరి ఈ సారి క్రొత్తగా బక్కగా ఉండే ప్రెడేటర్ రూపం మాత్రం ఆకట్టుకుంటుందో చూడాలి.
1987లో కాస్త మీడియం బడ్జెట్ సినిమాగా వచ్చిన ప్రెడేటర్ పెద్ద హిట్ అయింది. అప్పటికే వరుస హిట్ల మీద ఉన్న ఆర్నాల్డ్ కెరీర్ ని మరింత పెద్ద స్థాయికి తీసుకెళ్ళింది ప్రెడేటర్. అభిమానులకు ఈ సినిమా ఒక కల్ట్ క్లాసిక్. 18 మిలియన్ డాలర్లతో తీస్తే ఆ రోజుల్లోనే ఏకంగా 98 మిలియన్ డాలర్లు సంపాదించింది ఈ సినిమా. దానితో ఈ మూవీకి చాలా సీక్వెల్స్, ప్రేడేటర్ vs ఏలియన్ వంటి క్రాస్ ఓవర్ సినిమాలు వచ్చాయి. విచిత్రంగా వాటిలో దేనిలోనూ మళ్లీ ఆర్నాల్డ్ నటించలేదు. అలాగే మొదటి సినిమా ప్రెడేటర్ తీసిన డైరెక్టర్ జాన్ మెక్ టర్నన్ కూడా వేరే ఏ పార్ట్ నీ డైరెక్ట్ చేయలేదు. ఆ తర్వాత వచ్చిన ఏ సీక్వెల్ కూడా మొదటి ప్రెడేటర్ స్థాయిలో హిట్ కాలేదు. డబ్బులు పరంగా కొన్ని పార్ట్ లు ఓకే గానీ మొదటి సినిమా ఇంపాక్ట్ మాత్రం ఏదీ కలిగించలేదు.
ఇక ప్రెడేటర్ సినిమాలు రావు అనుకున్న సమయంలో 2022లో డాన్ ట్రెచెన్ బెర్గ్ లిమిటెడ్ బడ్జెట్ లో OTT కోసం తీసిన ప్రెడేటర్ సిరీస్ లో తీసిన సినిమా 'ప్రే' (PREY). అది ఎవ్వరూ ఊహించనంత హిట్ కావడంతో ఆయనే 'ప్రెడేటర్: కిల్లర్ అఫ్ ది కిల్లర్' అనే అనిమేషన్ మూవీని OTTలో రిలీజ్ చేశారు. అదీ పెద్ద హిట్ అయింది. దానితో ప్రెడేటర్ సిరీస్ ని బిగ్ స్క్రీన్ పైకి తేవడం కోసం తీసిన సినిమా ప్రెడేటర్ బ్యాడ్ ల్యాండ్స్. ఈ సినిమా ప్రీమియర్ లకు మంచి రెస్పాన్ఫ్ రావడం తో సినిమా ఈరోజు ప్రపంచ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
బాటమ్ లైన్: విలన్.. హీరో అయ్యాడు.
Also Read: 'జటాధర' రివ్యూ: సుధీర్ బాబు కష్టం బూడిదలో పోసిన పన్నీరేనా? - అసలు థియేటర్లలో ఈ సినిమాను చూడగలమా?






















