Jatadhara Movie Review - 'జటాధర' రివ్యూ: శివుని నేపథ్యంలో సుధీర్ బాబు సినిమా - థియేటర్లలో చూడగలమా?
Jatadhara Review Telugu: నవ దళపతి సుధీర్ బాబు హీరోగా నటించిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ 'జటాధర'. సోనాక్షి సిన్హా, దివ్యా ఖోస్లా కుమార్, శిల్పా శిరోద్కర్ నటించిన ఈ సినిమా ఎలా ఉందంటే?
వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్
సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా, దివ్యా ఖోస్లా కుమార్, శిల్పా శిరోద్కర్, రాజీవ్ కనకాల, ఝాన్సీ, శుభలేఖ సుధాకర్ తదితరులు
Sudheer Babu's Jatadhara Review In Telugu: నవ దళపతి సుధీర్ బాబు హీరోగా నటించిన పాన్ ఇండియా సూపర్ నేచురల్ థ్రిల్లర్ 'జటాధర'. ధన పిశాచిగా సోనాక్షి సిన్హా కనిపించారు. మహేష్ బాబు మరదలు శిల్పా శిరోద్కర్, బాలీవుడ్ నటి దివ్యా ఖోస్లా కుమార్, రవికుమార్ ఇతర ప్రధాన తారాగణం. వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎలా ఉంది?
కథ (Jatadhara Movie Story): దెయ్యాలు లేవని నమ్మే ఘోస్ట్ / స్పిరిట్ హంటర్ శివ (సుధీర్ బాబు). తల్లి కోసం పూజలు చేస్తాడు. అలాగే చేతికి మంత్రించిన తాళ్లు, తాయత్తులు కడతాడు. రుద్రారం గ్రామంలో లంకె బిందెలు తవ్వడం కోసం వెళ్లిన కొందరు మరణించిన వార్త తెలిసి... అక్కడికి వెళతాడు శివ.
శివ తల్లిది రుద్రారం. ఆ విషయం అతనికి తెలియకుండా ఎందుకు పెంచారు? శివ జన్మించిన మేనమామ ఇంటిలో ధన పిశాచి (సోనాక్షి సిన్హా) ఎందుకు ఉంది? శివ కలలో కనిపించే చిన్నారి, ఆ చిన్నారిని చంపడానికి ప్రయత్నించే మహిళ ఎవరు? శివ బలిని ఎందుకు కోరుతోంది? దెయ్యాలు లేవని నమ్మే శివ... ధన పిశాచి గురించి తెలిశాక ఎలా స్పందించాడు? అతను రుద్రారం వెళ్లిన తర్వాత ఏమైంది? అనేది సినిమా.
విశ్లేషణ (Jatadhara Telugu Review): మంచి సినిమా తీయడానికి ఎగ్జైటింగ్ ఐడియా ఒక్కటే సరిపోదు. ప్రేక్షకులను అంతే ఎగ్జైట్ చేసేలా తీయడం చాలా అంటే చాలా ముఖ్యం. డివోషనల్ టచ్ ఉన్న కథలు పాన్ ఇండియా లెవల్లో బ్లాక్ బస్టర్స్ అవుతున్నాయని శివుని నేపథ్యంలో 'జటాధర' తీసినట్టు ఉంటుంది తప్ప... కథ, కథనం, అన్నిటి కంటే ముఖ్యంగా క్వాలిటీ విషయంలో దర్శక నిర్మాతలు అసలు శ్రద్ధ తీసుకున్నట్టు అనిపించదు.
తెలుగులో సుధీర్ బాబుకు పేరుంది. హిందీలో సోనాక్షి సిన్హాకు గుర్తింపు ఉంది. ఇక శిల్పా శిరోద్కర్, దివ్యా ఖోస్లా కుమార్ తదితరులు ఉన్నప్పుడు విజువల్స్ పరంగా జాగ్రత్త తీసుకోవాలి కదా! 'జటాధర' మేకింగ్‌లో అటువంటి జాగ్రత్తలు తీసుకోలేదు. వీఎఫ్ఎక్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్‌లలో ఇంత కంటే మంచి గ్రాఫిక్స్ ఉంటున్న రోజుల్లో... 'జటాధర' విజువల్స్ షాక్ ఇస్తాయి. విజువల్ క్వాలిటీ లేదంటే అసలు కంటెంట్‌లో సత్తా అంతంత మాత్రమే.
'జటాధర'... ఇదొక ఎమోషనల్ సూపర్ నేచురల్ థ్రిల్లర్. సినిమాలో ఫాదర్ & మదర్ సెంటిమెంట్, సూపర్ నేచురల్ ఎలిమెంట్స్ ఉన్నా... దర్శకులు వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ ఒక్కటంటే ఒక్క సన్నివేశాన్ని కూడా ఎగ్జైటింగ్‌గా తీయలేదు. ఈ మూవీ స్టార్టింగ్ నుంచి నాన్ సింక్‌లో వెళుతుంది. ముందుకు వెళ్లే కొలదీ బోరింగ్‌గా మారుతుంది. కథ, సన్నివేశాలతో సంబంధం లేకుండా శివుని నేపథ్యంలో సీన్ వచ్చినప్పుడు గూస్ బంప్స్ వస్తాయని ఆశిస్తే అక్కడ నాసిరకం విజువల్స్ మరింత విసుగు తెప్పిస్తాయి. థియేటర్ల నుంచి బయటకు వచ్చేటప్పుడు ఒక్క పాట గుర్తు ఉండదు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అసలు బాలేదు. పూర్ ప్రొడక్షన్ వేల్యూస్ గురించి మాట్లాడుకోవడం అనవసరం.
Also Read: గర్ల్ ఫ్రెండ్ vs జటాధర... బిజినెస్‌లో ఎవరిది అప్పర్ హ్యాండ్? ఏ మూవీ క్రేజ్ ఎక్కువ??
సుధీర్ బాబు పడిన కష్టం, శ్రమ బూడిదలో పోసిన పన్నీరుగా మారాయి. ప్యాక్డ్ బాడీ ఒక్కటే కాదు... ఎమోషనల్ సన్నివేశాల్లో చక్కగా నటించారు. ఆయన ఒక్కరి ఎఫర్ట్ సినిమాను నిలబెట్టలేదుగా. ధన పిశాచిగా సోనాక్షి సిన్హా లుక్ బావుంది. కానీ, నటన చూపించడానికి తగ్గ సన్నివేశాలు పడలేదు. ఇంటర్వెల్ ముందు సరిగా ఆవిడ కనిపించింది లేదు. ఇంటర్వెల్ తర్వాత వచ్చినా గుర్తు పెట్టుకునేంతగా సోనాక్షి సిన్హా నటన లేదు. సుధీర్ బాబు, దివ్యా ఖోస్లా కుమార్ మధ్య ప్రేమ కథ సరిగా రాయలేదు అంటే... దివ్య నటనను తెలుగు ప్రేక్షకులు ఆదరించడం కష్టం. హీరో హీరోయిన్స్ జంట చూడముచ్చటగా లేదు. రాజీవ్ కనకాల, ఝాన్సీ, శుభలేఖ సుధాకర్ వంటి ట్యాలెంటెడ్ ఆర్టిస్టులు సినిమాలో ఉన్నారు.
స్టార్టింగ్ టు ఎండింగ్ ఎటువంటి ఎగ్జైట్మెంట్ లేకుండా బోర్ కొట్టించే సూపర్ నేచురల్ థ్రిల్లర్ 'జటాధర'. ఇటీవల కాలంలో ఇంత నాసిరకం విజువల్స్ ఉన్న సినిమాను చూసి ఉండరు. మ్యూజిక్, ప్రొడక్షన్ వేల్యూస్, రైటింగ్ విభాగాలు ఒకదానితో మరొకటి బ్యాడ్ అవుట్ పుట్ ఇవ్వడానికి పోటీ పడ్డాయి. డివోషనల్ / శివుని టచ్ ఉందని చూడాలని ప్లాన్ చేస్తారేమో... 'జటాధర' థియేటర్లకు దూరంగా ఉండటం మంచిది. ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుందీ సినిమా.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















