Talasani Srinivas Yadav: అభివృద్ధిపై చర్చకు సిద్ధమా? బీజేపీ, కాంగ్రెస్ కు మంత్రి తలసాని సవాల్
Talasani Srinivas Yadav: రాష్ట్ర అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు మంత్రి తలసాని సవాల్ విసిరారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధికి సహకరించడం లేదని ప్రధాని అనడం హాస్యాస్పదమన్నారు.
Talasani Srinivas Yadav: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిపై చర్చకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సిద్ధమా అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సవాల్ విసిరారు. అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాతే అభివృద్ధి జరుగుతోందని మంత్రి తలసాని స్పష్టం చేశారు. హైదరాబాద్ అంబర్ పేటలోని గోల్నాకో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొని మాట్లాడారు.
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు అంబర్ పెట్ నియోజకవర్గ పరిధిలోని మహారాణా ప్రతాప్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన గోల్నాక డివిజన్ బీఆర్ఎస్ ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ గారు మరియు హైదరాబాద్ ఇంచార్జ్ దాసోజు శ్రవణ్ గారితో కలిసి పాల్గొనడం… pic.twitter.com/kPBK9HLSAT
— Talasani Srinivas Yadav (@YadavTalasani) April 9, 2023
అంబర్ పేట నియోజకవర్గానికి 15 ఏళ్లు ఎమ్మెల్యేగా పని చేసిన, ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి.. గత నాలుగు సంవత్సరాల్లో ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కిషన్ రెడ్డి ఎమ్మెల్యేగా అంబర్ పేటలో ఓడిపోవడంతోనే కేంద్ర మంత్రి కాగలిగారని, అందుకు బీఆర్ఎస్ కృతజ్ఞతలు చెప్పాలని అన్నారు. దేశంలోని ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఢీకొట్టగలిగిన నాయకుడు మరెవరూ లేరని అన్నారు. రాష్ట్ర సర్కారుపై విమర్శలు మానేసి ఢిల్లీ నుండి నిధులు తెచ్చే దమ్ము రాష్ట్ర బీజేపీ నాయకులకు ఉందా అని నిలదీశారు. కుల, మతాల పేర్లతో లబ్ధిపొందాలని బీజేపీ చూస్తోందని తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శలు గుప్పించారు. అయితే తెలంగాణ ప్రభుత్వం మతాలను గౌరవిస్తూ అన్ని పండగలను అధికారికంగా నిర్వహిస్తోందని మంత్రి చెప్పుకొచ్చారు. సీఎం కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని వెల్లడించారు.
ప్రోటోకాల్ ఉల్లంఘనకు తెరలేపింది మోదీయే
గతంలో మోదీ తెలంగాణకు వచ్చినప్పుడు ఆయన కార్యక్రమాలకు సీఎం కేసీఆర్‌ను రావొద్దన్నారన్నారు. విభజన చట్టం హామీలపై ప్రధాని మోదీ ఎందుకు మాట్లాడడంలేదని ప్రశ్నించారు. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉండి రాష్ట్రానికి కాదు కనీసం ఆయన నియోజకవర్గం సికింద్రాబాద్‌కు ఏమైనా చేశారా? అని నిలదీశారు. మోదీ చేసిన విమర్శలపై చర్చకు సిద్ధమన్నారు. ఎవరి వాదనలో బలమెంతో చూసుకుందామంటూ సవాల్ విసిరారు. మోదీ కేసీఆర్ ను తిట్టాలనుకుంటే దిల్లీలో ఉండి తిట్టుకోవచ్చని దానికి హైదరాబాద్ వరకూ రావాలా? అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ ను విమర్శిస్తే ప్రజలే తిరగబడతారన్నారు. ప్రధాని వస్తే సీఎంలు స్వాగతం పలకాలని ఏ చట్టంలో ఉందని నిలదీశారు. అవినీతి, కుటుంబ పాలన గురించి మాట్లాడే నైతిక హక్కు మోదీకి ఉందా? అని మండిపడ్డారు. బీజేపీలో కుటుంబ రాజకీయాలు లేవా? అని ప్రశ్నించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు అవినీతిలో కూరుకుపోతే విచారణలు ఎందుకు ఉండవన్నారు. తెలంగాణ ఏ రంగంలో వెనకబడిందో చెప్పాలన్నారు. రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజీ అయినా ఇచ్చారా? జాతీయ రహదారులు ఏ పార్టీ అధికారంలో వేస్తారన్నారు. అందులో మోదీ గొప్ప ఏముందని ప్రశ్నించారు. దేశానికి తెలంగాణ నుంచి వస్తున్న ఆదాయం ఎంత? కేంద్రం తిరిగి ఇస్తుంది ఎంతో చెప్పాలన్నారు. కోవిడ్ వ్యాక్సిన్ కూడా కనిపెట్టినట్లు మోదీ మాట్లాడుతారన్నారు. అసలు ప్రోటోకాల్ ఉల్లంఘనకు తెరలేపింది మోదీ అన్నారు.